మనం కప్పు గెలిచాం... వాళ్లు మనసుల్ని గెలిచారు!

అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న ఆఫ్ఘాన్ జట్టు... మేటి జట్లకు ముచ్ఛెమటలు పట్టించిన బంగ్లా జట్టు!

Chinthakindhi.Ramu | news18-telugu
Updated: September 30, 2018, 11:27 AM IST
మనం కప్పు గెలిచాం... వాళ్లు మనసుల్ని గెలిచారు!
ఆఫ్ఘాన్, బంగ్లాదేశ్ జట్లు
  • Share this:
ఆసియాకప్ 2018 విజేత ఎవరు... టీమిండియా! ఇది ఎవర్ని అడిగినా చెబుతారు. అయితే నిజానికి టాప్ 2 ప్లేస్‌లో ఉన్న భారత జట్టు ఊహించినట్టుగానే రాణించింది. తన కంటే తక్కువ ర్యాంకు ఉన్న జట్లను ఓడించి కప్పు గెలిచింది. నిజానికి టీమిండియా మీద ఉన్న అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. ఫైనల్ మ్యాచ్ అయితే చివరి బంతి వరకూ ఉత్కంఠ రేపింది. ఒక్క బాల్ తేడా అయ్యి ఉంటే సీన్స్ మొత్తం రివర్స్ అయ్యేది. అందుకే ఇండియా కప్పు గెలిచినప్పటికీ ఛాంపియన్ ఆటతీరు చూపించలేకపోయింది. అయితే ఆసియాకప్ టోర్నీ మొత్తంలో అద్భుత ప్రదర్శనను చూపి, రెండు జట్లు క్రికెట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందులో మొదటిది పసికూన ఆఫ్ఘానిస్థాన్ అయితే రెండోది ఫైనలిస్ట్ బంగ్లాదేశ్.

ఆప్ఘాన్ ఆట అదరహో..!
ఆసియాకప్‌లో ఆఫ్ఘాన్ ఓ పసికూనగా అడుగుపెట్టింది. అయితే ఊహించని విధంగా అద్భుత ఆటతీరుతో గ్రూప్ ఏలో టాప్ ప్లేస్ సంపాదించి, సూపర్ 4కి అర్హత సాధించింది. గ్రూప్ దశలో శ్రీలంక జట్టును 91 పరుగుల తేడాతో, బంగ్లాను 136 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించిన తీరు అసాధారణం. సూపర్ 4లోనూ అంచనాలను మించి రాణించింది ఆఫ్ఘాన్. టైటిల్ ఫెవరేట్‌గా బరిలో దిగిన పాకిస్థాన్‌కు ఓటమి భయం రుచి చూపించింది. చివరి ఓవర్ వరకూ సాగిన ఈ మ్యాచ్‌లో షోయబ్ మాలిక్ ఇన్నింగ్స్ కారణంగా పాక్ మూడు వికెట్ల తేడాతో గెలవగలిగింది. ఇక బంగ్లాదేశ్, ఆఫ్ఘాన్ మ్యాచ్ అయితే చివరి ఓవర్ దాకా పసికూనదే విజయం అనిపించేలా సాగింది. 250 పరుగుల లక్ష్యచేధనలో ఆఫ్ఘాన్ జట్టు 246 పరుగులు చేసి, కేవలం మూడు పరుగుల తేడాతో ఓడింది.

భారత్, ఆఫ్ఘాన్ టై మ్యాచ్ అయితే టోర్నీనే వన్ ఆఫ్ ది హైలెట్ మ్యాచ్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందే భారత్ ఫైనల్ చేరడం, ఆఫ్ఘాన్ టోర్నీ నుంచి నిష్కమించడంతో నామమాత్రంగానే సాగుతుందని అనుకున్నారంతా. అయితే ధోనిసేనకు వెన్నులో వణుకు పుట్టించింది ఆఫ్ఘాన్. ఆఫ్ఘాన్ అద్భుత ఆటతీరుకి చివరి ఓవర్ చివరి బంతిదాకా ఉత్క్ంఠ నెలకొందంటే ఏ స్థాయిలో పోరాడారో అర్థం చేసుకోవచ్చు. మిగిలిన జట్లతో పోలిస్తే ఆఫ్ఘాన్‌కు అనుభవం తక్కువ. టోర్నీలో మూడు మ్యాచ్‌ల్లో విజయం అంచుల దాకా వచ్చినా, ఓడిపోవడానికి అనుభవలేమే కారణం. ఇంకొన్ని సిరీస్‌లు ఆడితే వారు ఈ చిన్నచిన్న లోపాలను ఈజీగా అధిగమించేస్తారు. అదేగానీ జరిగితే మున్ముందు ఆఫ్ఘాన్ సంచలన విజయాలు సాధిస్తుందనడంలో ఆశ్చర్యం లేదు. గత ఏడాది నుంచి ఛాంపియన్స్‌ట్రోపీ తర్వాత అత్యధిక విజయాలు సాధించిన జట్లలో టాప్-5 స్థానం సంపాదించుకోగలిగింది. ఆఫ్ఘాన్ ఆల్‌రౌండర్ రషీద్ ఖాన్ అయితే ఏకంగా టాప్ 1లో నిలిచి సంచలనం సృష్టించాడు.మిగిలిన దేశాలతో పోలిస్తే ఆఫ్ఘాన్‌లో పరిస్థితి పూర్తిగా భిన్నం. బాంబు దాడులు, తుపాకీ మోతల మధ్య యుద్ధ భూమిని తలపించే ఆఫ్ఘాన్ నుంచి క్రికెట్ జట్టు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఆఫ్ఘాన్ ఆటతీరు చూసి, ఆ దేశంలో పరిస్థితులు కూడా మెల్లిమెల్లిగా మారుతుండడం విశేషం. చాలామంది యువత తుపాకీలు వదిలి, బ్యాటూ... బాల్ పట్టుకుంటున్నారు.

బాబోయ్... బంగ్లాదేశ్ అనాల్సిందే
ఒకప్పుడు బంగ్లాదేశ్ అంటే క్రికెట్లో పసికూన జట్టు అయితే ఇప్పుడు కాదు. కొన్నేళ్లుగా అద్భుత విజయాలు సాధిస్తూ మేటి జట్లకే సవాలు విసురుతున్నారు బంగ్లా క్రికెటర్లు. ముఖ్యంగా మొర్తాజా కెప్టెన్సీలో బంగ్లా జట్టు అద్భుత విజయాలు సాధిస్తోంది. ఇప్పటిదాకా ఆడిన 64 వన్డేల్లో 35 విజయాలు సాధించి, 56.45 శాతం సక్సెస్ రేట్ సాధించింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి టాప్ క్లాస్ జట్లను కూడా ఓడించడం విశేషం. ఆసియా ఫైనల్ మ్యాచ్ అయితే భారత జట్టుకు, బంగ్లా షాక్ ఇచ్చేలాగే కనిపించింది. బ్యాటింగ్‌లోనే కాకుండా బౌలింగ్ విభాగం పటిష్టంగా ఉండడంతో టీమిండియాను ముప్పుతిప్పలు పెట్టింది. పాక్‌పై అతి సులువుగా ఛేజింగ్ చేసిన భారత జట్టు... 222 లక్ష్యాన్ని చేధించడంలో తడబడింది. ఎలాగైనా చావు తప్పి కన్నులొట్టబోయినట్టు విక్టరీ సాధించి, కప్పు గెలుచుకుంది. కప్పు మనం గెలుచుకున్నా... అసలైన పోరాట ప్రతిమ మాత్రం బంగ్లా క్రికెటర్లే కనబరిచారు. హాంకాంగ్...టూ హాట్ గురూ...
ఆసియాకప్‌లో హాట్‌ఫేవరెట్ టీమిండియాకు తొలి మ్యాచ్‌లో పసికూన హాంగ్‌కాంగ్‌ జట్టు అడుగడుగునా గట్టి పోటీనిచ్చింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా...ధావన్ సెంచరీ, అంబటి రాయుడు హాఫ్ సెంచరీతో 285 పరుగులు చేసింది. భారత్ నిర్దేశించిన 286 పరుగుల లక్ష్యాన్ని చేధించడంలో హాంగ్‌కాంగ్ జట్టు ఆఖరి ఓవర్ వరకూ పోరాడి ఓడింది. కనీస పోటీ ఇవ్వగలదా... అనుకున్న హాంకాంగ్ ఏకంగా మొదటి వికెట్‌కి 174 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి భారత జట్టుకు ముచ్ఛెమటలు పట్టించింది. అయితే అనుభవలేమి కారణంగా వరుస వికెట్లు కోల్పోయి 259 పరుగులకు ఆలౌట్ అయ్యింది.
First published: September 30, 2018
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading