Rice for vaccine: వ్యాక్సిన్ తీసుకుంటే.. బియ్యం ఉచితం... అరుణాచల్‌ ప్రదేశ్‌ అధికారుల కొత్త ప్రణాళిక

Covid vaccine

తాజాగా ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో వ్యాక్సిన్ పై పుకార్లు తొలగించేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళిక రచించింది. టీకా తీసుకున్న వ్యక్తులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది.

  • Share this:
దేశంలో విజృంభిస్తున్న కరోనాను వ్యాక్సినేషన్ ద్వారా మాత్రమే కట్టడి చేయగలమని నిపుణులు చెబుతున్నారు. భారత్‌లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమై చాలా రోజులు అవుతోంది. అయినా వ్యాక్సిన్లపై చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. పుకార్లను నమ్ముతూ టీకా సమర్థతపై సందేహపడుతున్నారు. ఈ అపోహలను దూరం చేసేందుకు అధికారులు ఎంతగానో కృషి చేస్తున్నారు. టీకాలపై అనుమానాలను నివృత్తి చేసేందుకు విభిన్న రకాలుగా అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ లో వ్యాక్సిన్ పై పుకార్లు తొలగించేందుకు ప్రభుత్వం కొత్త ప్రణాళిక రచించింది. టీకా తీసుకున్న వ్యక్తులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఇలా ఒక్కొక్కరికీ 20 కేజీల బియ్యం అందజేస్తూ టీకా సమర్థత గురించి అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ ప్రకటన విడుదల చేసిన కొద్ది రోజుల్లోనే వివిధ గ్రామాల నుంచి వందల మంది టీకా వేసుకునేందుకు వచ్చారు.

జూన్ 20లోపు 100 శాతం టీకా ఇస్తాం..
ఈ వినూత్న ఆలోచననను ఆ రాష్ట్రంలో సుబన్ సిరి జిల్లాలోని యాజాలికి చెందిన సర్కిల్ ఆఫిసర్ తాషి వాంగ్ చుక్ థాంగ్ డాక్ ప్రవేశపెట్టారు. 45 ఏళ్లు నిండిన వారందరీకి రాష్ట్రంలో ఉచితంగా టీకాలు వేసే కార్యక్రమం సోమవారం ప్రారంభించారు. బుధవారం వరకు ఈ ఆఫర్ (20 కేజీల బియ్యం) అందుబాటులో ఉంటుంది. టీకా కవరేజీని మెరుగుపరచడనికి ఇలాంటి మార్గాలు దోహదం చేస్తాయని చెబుతున్నారు 2016 బ్యాచ్ ఐపీఎస్ అధికారి థాంగ్ డాక్ తెలిపారు. జూన్ 20 నాటికి 100 శాతం టీకాలు వేయడం తమ లక్ష్యమని, యాజాలి సిర్కిల్ లో 45 ఏళ్లకు పైబడిన వారు 1399 మంది ఉన్నారని స్పష్టం చేశారు.

ఇంటింటికి వెళ్లి..
ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ టీకాలు తీసుకోవడానికి వచ్చినవారిలో చాలా మంది సుదూర గ్రామాల నుంచి కాలినడకన వచ్చారని థాంగ్ డాక్ తెలిపారు. ఈ ప్రాంతంలో ప్రతి గ్రామానికి రోడ్ మ్యాప్ రూపొందించామని చెప్పారు. 45 ఏళ్లు పైబడిన వారికి టీకా ఇచ్చేందుకు శుక్ర, శనివారాల్లో ఇంటింటికి వెళ్లాలని ప్లాన్ చేసినట్లు తెలిపారు. ఉచితంగా బియ్యం అందజేసే ఆఫర్ ఇంకా కొనసాగుతుందన్నారు. అయితే గడువు తరువాత 20 కేజీలకు బదులుగా 10 కేజీలు మాత్రమే ఇస్తామన్నారు. వివేకానంద కేంద్ర విద్యాలయానికి చెందిన ఇద్దరు మాజీ విద్యార్థులు లబ్ధిదారుల పంపిణీ కోసం బియ్యాన్ని విరాళంగా ఇచ్చారని తెలిపారు.

కరోనా రోగనిరోధకత చుట్టూ అలుముకున్న పుకార్లు, టీకాతో తీసుకున్న తర్వాత తీవ్రమైన వ్యాధులు రావడం వంటివి ఈశాన్య ప్రాంతంలో సందేహాస్పదంగా ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ లో 3,95,445 టీకాలు వేసినట్లు రాష్ట్ర అధికారులు వెల్లడించారు.
Published by:Krishna Adithya
First published: