భారత ప్రధాని నరేంద్ర మోదీ వేసుకునే దుస్తులు, ఉపయోగించే వస్తువులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాతో భేటీ సందర్భంగా మోదీ సుమారు 10 లక్షల రూపాయల విలువైన సూట్ వేసుకున్నారు. ఇది అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక, గతంలో ఆయన ధరించిన ఖరీదైన సన్ గ్లాసెస్ కూడా వార్తల్లో నిలిచాయి. ఇప్పుడు ప్రధాని మోదీ కాన్వాయ్‌లో కొత్తగా చేరిన ఓ లగ్జరీ కారు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇటీవల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే.
పుతిన్‌కు స్వాగతం పలికేందుకు ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌కు వచ్చిన మోదీ తొలిసారి మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ 650 ఎస్ (Mercedes-Maybach S650) కారులో కనిపించారు. ఇప్పటికే ప్రధాని మోదీ కాన్వాయ్‌లో రేంజ్ రోవర్ వోగ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ వాహనాలు ఉండగా.. కొత్తగా మెర్సిడెస్-మేబ్యాక్ S650 ఆర్ముడ్ కారు కూడా చేరింది. దీంతో, ఈ కారు గురించి ఆన్లైన్లో వెతకడం ప్రారంభించారు నెటిజన్లు.
స్టైలిష్ లుక్, అత్యంత భద్రతా ప్రమాణాలతో తయారైన ఈ లగ్జరీ కారు విలువ రూ. 12 కోట్లకు పైగానే ఉంటుందని నివేదికలను బట్టి తెలుస్తోంది.
ఈ కారులో అప్‌గ్రేడేటెడ్ కిటికీలు, బాడీ షెల్స్‌ను అమర్చారు. తద్వారా, ఎవరైనా శత్రు మూకలు కారుపై బుల్లెట్ల వర్షం కురిపించినా లోపల ఉన్న వ్యక్తులకు భద్రంగా ఉంటారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని అత్యంత భద్రతా ప్రమాణాలతో తయారు చేశారు. ఈ కారు ఎక్స్‌ప్లోజివ్ రెసిస్టెంట్ వెహికల్ (ERV) 2010 రేటింగ్‌ను కలిగి ఉంది. 15 కిలోల టీఎన్టీ పేలుడు నుంచి కూడా ఇది వాహనంలో ఉన్న వారిని రక్షిస్తుంది. క్యాబిన్లో ప్రత్యేకంగా ఆక్సిజన్ సిలిండర్లు ఉంటాయి. గ్యాస్ దాడి జరిగినప్పుడు ఇవి లోపల ఉన్న వారికి ఆక్సిజన్ సరఫరా చేస్తాయి.
బుల్లెట్ల దాడి నుంచి తట్టుకోగలవు..
ఈ కారు 6.0- లీటర్ ట్విన్-టర్బో V12 ఇంజన్‌తో వస్తుంది. ఇది 516 bhp, 900 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్టంగా గంటకు 160 కి.మీ వేగంతో ప్రయాణించవచ్చు. మెర్సిడెస్ మేబ్యాక్ S650 గార్డ్ ఫ్యుయల్ ట్యాంక్ ఒక ప్రత్యేక కోటింగ్‌తో వస్తుంది. బోయింగ్ ఏహెచ్-64 అపాచీ హెలికాప్టర్లలో ఉపయోగించే కోటింగ్నే దీనిలోనూ ఉపయోగించారు. ఈ కారు విలాసవంతమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంటుంది. స్టాండర్డ్ మేబ్యాక్ ఎస్ -క్లాస్ అన్ని సౌకర్యాలతో వస్తుంది.
మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ S600 గార్డ్ గతేడాది భారత మార్కెట్లో రూ. 10.5 కోట్ల వద్ద విడుదలైంది. అయితే, ప్రధాని మోదీ కోసం దీనిలో ప్రత్యేకంగా కొన్ని భద్రతా ప్రమాణాలను జోడించారు. అందువల్ల మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ S650 ధర రూ. 12 కోట్ల కంటే ఎక్కువ ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసే కాలంలో తన కాన్వాయ్‌లో బుల్లెట్ ప్రూఫ్ మహీంద్రా స్కార్పియో వాహనం ఉపయోగించేవారు. 2014లో ఆయన ప్రధానమంత్రి అయ్యాక, బీఎండబ్ల్యూ7 సిరీస్ హై-సెక్యూరిటీ ఎడిషన్‌కి మారారు. ఆ తర్వాత ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్, టయోటా ల్యాండ్ క్రూయిజర్ కార్లను కూడా కాన్వాయ్‌లో జోడించారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.