ఆకాశంలో ఏర్పడే ఖగోళ అద్భుతాలకు ప్రజలు ఎంతో విలువ ఇస్తారు. దాదాపు నెల రోజుల కాలంలో సూపర్ మూన్, బ్లడ్ మూన్, సంపూర్ణ చంద్రగ్రహణంతో పాటు వలయాకార సూర్యగ్రహణాన్ని కూడా చూశాం. త్వరలో మరో ఖగోళ ఘటనను వీక్షించబోతున్నాం. అదే స్ట్రాబెర్రీ మూన్. వచ్చే పౌర్ణమి నాడు(జూన్ 24) చంద్రుడు స్ట్రాబెర్రీ మూన్ మాదిరిగా కనిపించనున్నాడు. భూ కక్ష్యకు అతి సమీపంలోకి వచ్చిన చంద్రుడు సాధారణ పరిమాణం కంటే పెద్దదిగా కనిపించనున్నాడు. అయితే దీన్ని మేలో కనిపించిన సూపర్ మూన్ గా పరిగణించరు. స్ట్రాబెర్రీ మూన్ ను వసంత రుతువులో వచ్చే చివరి పౌర్ణమిగా పరిగణిస్తారు.
స్ట్రాబెర్రీ మూన్ అని ఎందుకు పిలుస్తారు?
స్ట్రాబెర్రీల పంట కాలం ఈ పౌర్ణమితోనే ప్రారంభమవడం వల్ల ప్రాచీన అమెరికన్ తెగలు ఈ ఖగోళ దృశ్యాన్ని స్ట్రాబెర్రీ మూన్ గా పిలవడం ప్రారంభించారు. అప్పటి నుంచి ఇది ప్రాచుర్యం పొందింది. జూన్ మాసంలో వచ్చే ఈ పౌర్ణమి చంద్రుడిని ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరు పేర్లతో సూచించారు. ఐరోపాలో దీన్ని రోజ్ మూన్ అని పిలుస్తారు. ఎందుకంటే అక్కడ గులాబీల పెంపకాన్ని సూచిస్తుంది. ఉత్తరార్ధ గోళంలో వేసవి ప్రారంభమవడంతో అక్కడ దీన్ని హాట్ మూన్ అని పిలుస్తారు. రాత్రి పూట ఆకాశంలో సాధారణ చంద్రుడిలా కాకుండా స్ట్రాబెర్రీ మూన్ పూర్తి దశ ఒక రోజుకుపైగా కనిపిస్తుంది.
2021 పౌర్ణమి దశలు..
చంద్రుడి ఆకారాన్ని బట్టి ఒక్కో పౌర్ణమిన ఒక్కో పేరుతో జాబిల్లిని గుర్తిస్తారు. భూమి చుట్టూ చంద్రుడు ఒక్కసారి భ్రమణం చేసి రావడానికి 29.5 రోజులు పడుతుంది. ఈ సమయంలో అది పూర్తి దశకు చేరుకుంటుంది. అప్పుడు చంద్రుడు సంపూర్ణ ఆకృతిని పొందుతాడు. వేసవిలో స్ట్రాబెర్రీ మూన్.. ప్రతి 20 సంవత్సరాలకు ఓ సారి వస్తుంది. జూన్ 24న సంభవించే పౌర్ణమి నాడు ఆకాశంలో స్ట్రాబెర్రీ మూన్ ను చూస్తారు. అనంతరం జులై 24న సంభవించే పౌర్ణమి నాడు బక్ మూన్ కనిపిస్తుంది. ఆ తర్వాత ఆగస్టు 22న పౌర్ణమి రోజు కనిపించే చంద్రుడిని సర్జన్ మూన్ అంటారు. సెప్టెంబరు 20న కనిపించే జాబిల్లిని హార్వెస్ట్ మూన్ అంటారు. ఈ సీజన్ లో ఇదే చివరి పౌర్ణమి. సెప్టెంబరు 22 నాడు విషవత్తు ఏర్పడుతుంది. అంటే పగలు, రాత్రి సమానంగా ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Blood moon, Moon, VIRAL NEWS