గిరిసీమలో...ఆషాడ మాసంలో జరుపుకునే తొలి పండుగ ‘అకాడి’

ఈ ఆషాడ మాసంలో జరుపుకునే తొలి పండుగ ‘అకాడి’ పై "న్యూస్18 తెలుగు" స్పెషల్ రిపోర్ట్.

news18-telugu
Updated: July 11, 2020, 10:38 AM IST
గిరిసీమలో...ఆషాడ మాసంలో జరుపుకునే తొలి పండుగ ‘అకాడి’
ఈ అకాడి పండుగ తర్వాత గ్రామంలో గిరిజనులు ఏత్మాసూర్ దేవతకు పూజలు చేస్తారు.
  • Share this:
ఆదిలాబాద్: తమ తాత తండ్రుల కాలం నుండి ఆనవాయితీగా వస్తున్న ఆచారాలను, సంప్రదాయాలను కాపాడుకుంటు ముందు తరాలకు వాటిని అందిస్తూ సాగుతున్నారు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనులు. వారు జరుపుకునే ఏ పండుగ అయినా, వేడుక అయినా సరె అందులో వాటికి పెద్దపీఠ వేస్తారు. అందులోనే వారి సంస్కృతి ప్రతిబింబిస్తుంది. అలాంటి గిరిజనుల సంస్కృతిని ప్రతిబింబించే పండుగలు ఆషాడ మాసంతో మొదలవుతాయి. అందులో ఈ ఆషాడ మాసంలో జరుపుకునే తొలి పండుగ ‘అకాడి’ పై "న్యూస్18 తెలుగు" స్పెషల్ రిపోర్ట్.

ఆశాడ మాసం వచ్చిదంటే చాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గూడాల్లో పండుగల సందడి మొదలవుతుంది. అందులో మొదటగా వచే పండుగ అకాడి పండుగ. నెలవంకనిపించడంతో అకాడి సంబురాలు జరుపుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గూడాల్లో మొన్నటి వరకు ఈ అకాడి పండుగను సంబురంగా జరుపుకున్నారు. ఈ అకాడి వేడుకల్లో భాగంగా గ్రామ పొలిమేరలోని అటవీ ప్రాంతంలో బాబ్రి చెట్టు వద్దకు పోయి చెట్టుకింద ఉన్న పవిత్ర దేవతలను శుద్ది చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటవీ ప్రాంతంలోనే ప్రత్యేక భోజనాన్ని తయారు చేసి దేవతలకు నైవేధ్యంగా సమర్పిస్తారు. గ్రామ ప్రజలతోపాటు పశువులు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. భోజనాన్ని ముద్దలుగా చేసి ప్రసాదం గా స్వీకరిస్తారు. కోడి, మేకలను కూడా బలి ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. అక్కడె అందరు కలిసి సహా పంక్తి భోజనాలు చేస్తారు. ఆ తర్వాత లక్ష్మణ రేఖ వంటి గీతను గీసి పశువులతో ఆ గీత దాటించి అడవులకు తీసుకెళతారు. పూజ అనంతరం అడవి నుంచి కొన్ని చెట్ల ఆకులను ఇంటికి తీసువస్తారు. వాటిని దేవుడి వరంగా భావిస్తారు. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఆ ఆకుల పొగ వేస్తే వ్యాధి నయమవుతుందని వారి నమ్మకం.


ఈ అకాడి పండుగ తర్వాత గ్రామంలో గిరిజనులు ఏత్మాసూర్ దేవతకు పూజలు చేస్తారు. నాలుగు నెలలపాటు పూజలు కొనసాగుతాయి. ఈ నాలుగు నెలలు వరుసగా నాగుల పంచమి, శివబోడి, పొలాల అమావాస్య, దసరా, దీపావళి తదితర పండుగలను జరుపుకుంటారు. దీపావళి బోగి తో వీరి పండుగలు ముగుస్తాయి. ఇదిలా ఉంటె ఈ అకాడి పండుగను జరుపుకోవడం తమ పూర్వీకుల కాలం నుండి ఆనవాయితీగా వస్తోందని బజార్ హత్నూర్ మండలం భూతాయి గ్రామానికి చెందిన దుర్వ భూమన్న తెలిపారు. ఇది రాజుల్ దేవతను కొలిచే పండుగ అని, ప్రజలతోపాటు పశువులు, పక్షులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ పండుగను జరుపుకుంటారని పేర్కోన్నారు. కాగా తమ పెద్దలను చూసి ఈ పద్దతులను నేర్చుకొని అనుసరిస్తున్నామని నార్నూర్ మండలం ఖైర్ దాట్వా గ్రామానికి చెందిన మడావి మారుతి తెలిపారు. ఏదిఏమైనా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనుల పండుగలు, వారి ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉండటమే కాకుండా ప్రకృతితో ముడిపడి చూడముచ్చటగా, ఆలోచింపజేసేవిగా ఉంటాయి.
Published by: Venu Gopal
First published: July 11, 2020, 9:59 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading