ఆషాడ మాసం రాగానే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గూడేల్లో పండుగల సందడి మొదలవుతుంది. వాటిలో మొదటిగా వచ్చేది అకాడి పండుగ. నెలవంక కనిపించడంతో అకాడి సంబురాలు జరుపుకుంటారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గూడేల్లో మొన్నటి వరకు ఈ అకాడి పండుగను సంబురంగా జరుపుకున్నారు. ఈ వేడుకల్లో భాగంగా గ్రామ పొలిమేరలోని అడవిలో బాబ్రి చెట్టు దగ్గరకు వెళ్లి... చెట్టుకింద ఉన్న పవిత్ర దేవతల్ని శుద్ది చేసి ప్రత్యేక పూజలు జరిపారు. అక్కడే ప్రత్యేక భోజనాన్ని తయారు చేసి దేవతలకు నైవేద్యంగా ఇచ్చారు. గ్రామ ప్రజలతోపాటు పశువులు క్షేమంగా ఉండాలని కోరుకున్నారు. భోజనాన్ని ముద్దలుగా చేసి ప్రసాదంగా స్వీకరించారు. కోడి, మేకలను కూడా బలి ఇచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అందరూ కలిసి సహ పంక్తి భోజనాలు చేశారు. ఆ తర్వాత లక్ష్మణ రేఖ వంటి గీతను గీసి పశువులతో ఆ గీత దాటించి అడవులకు తీసుకెళ్లారు. పూజ తర్వాత అడవి నుంచి కొన్ని చెట్ల ఆకుల్ని ఇంటికి తెచ్చారు. వాటిని దేవుడి వరంగా భావిస్తున్నారు. ఎవరికైనా అనారోగ్యం ఉంటే... ఆ ఆకుల పొగ వేస్తే వ్యాధి నయమవుతుందని వారి నమ్మకం.
గిరిసీమలో అకాడి సంబురం... ఆదివాసీల తొలి పండుగ ప్రత్యేకతలివీ...
ఈ అకాడి పండుగ తర్వాత గ్రామంలో గిరిజనులు ఏత్మాసూర్ దేవతకు పూజలు చేస్తున్నారు. నాలుగు నెలలపాటు పూజలు కొనసాగుతాయి. ఈ 4 నెలలు వరుసగా నాగుల పంచమి, శివబోడి, పొలాల అమావాస్య, దసరా, దీపావళి వంటి పండుగల్ని జరుపుకుంటారు. దీపావళి, బోగితో వీరి పండుగలు ముగుస్తాయి.
ఈ అకాడి పండుగను జరుపుకోవడం తమ పూర్వీకుల కాలం నుంచి ఆనవాయితీగా వస్తోందని బజార్ హత్నూర్ మండలం భూతాయి గ్రామానికి చెందిన దుర్వ భూమన్న తెలిపారు. ఇది రాజులు దేవతను కొలిచే పండుగ అని, ప్రజలతోపాటు పశువులు, పక్షులు ఆయురారోగ్యాలతో ఉండాలని ఈ పండుగను జరుపుకుంటారని వివరించారు.
తమ పెద్దలను చూసి ఈ పద్దతులు నేర్చుకొని అనుసరిస్తున్నామని నార్నూర్ మండలం ఖైర్ దాట్వా గ్రామానికి చెందిన మడావి మారుతి తెలిపారు. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనుల పండుగలు, వారి ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉండటమే కాకుండా ప్రకృతితో ముడిపడి చూడముచ్చటగా, ఆలోచింపజేసేవిగా ఉంటాయి.
(కట్టా లెనిన్ - న్యూస్18 తెలుగు ప్రతినిధి)
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.