Flying Car: విమానం లాగా గాల్లోకి ఎగిరే కారు... భవిష్యత్తు వీటిదే అంటున్న నిపుణులు

Flying Car: విమానం లాగా గాల్లోకి ఎగిరే కారు... (image credit - youtube)

Convertible Flying Car: ఒకప్పుడు డూమ్ టీవీలు ఉండేవి... ఇప్పుడు ప్లాస్మాలు... ఒకప్పుడు కేబుల్ టీవీలు... ఇప్పుడు డిష్ యాంటెన్నాలు... టెక్నాలజీ మారుతోంది. ఎగిరే కార్లను చూసే రోజులు దగ్గరపడినట్లే.

  • Share this:
Convertible Flying Car: కారు గాల్లోకి ఎగరడం ఎప్పుడైనా చూశారా? సినిమాల్లో, యాక్సిడెంట్లు జరిగినప్పుడు చాలాసార్లు చూశామని మీరు అనుకోవచ్చు. కానీ వేగంగా వెళ్తున్న కారు ఉన్నట్లుండి విమానం లాగా గాల్లోకి ఎగిరి ప్రయాణించడం చూశారా? ఇలాంటి కార్లను నిజంగానే రూపొందించారు శాస్త్రవేత్తలు. ప్రోటోటైప్ ఫ్లయింగ్ కారును ఇటీవలే డిజైన్ చేశారు. తాజాగా దీన్ని టెస్ట్ డ్రైవ్ కూడా చేశారు. స్లోవేకియాలో దేశంలోని నిత్రా, బ్రాతిస్లావా అంతర్జాతీయ విమానాశ్రయాల మధ్య ఈ ఎయిర్ కారును 35 నిమిషాల పాటు ఎగరేశారు. రెండున్నర నిమిషాల్లోపే కారు విమానంగా మారిపోవడం చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.

ఈ హైబ్రిడ్ కార్ ఎయిర్ క్రాఫ్ట్‌కు.. బీఎండబ్ల్యూ ఇంజిన్‌ను అమర్చి, రెగ్యులర్‌గా వాడే పెట్రోల్‌నే ఇంధనంగా వాడారు. కారు నుంచి విమానంగా మారడానికి ఈ వాహనానికి 2 నిమిషాల 15 సెకన్ల సమయం పట్టింది. సుమారు 8200 అడుగుల ఎత్తులో 1000 కిలోమీటర్ల (600 మైళ్లు) వరకు ఈ ఫ్లయింగ్ కారు ప్రయాణిస్తుందని దీన్ని సృష్టించిన ప్రొఫెసర్ స్టెఫాన్ క్లీన్ తెలిపారు. అంతేకాకుండా 40 గంటల వరకు గాలిలో ఉండే సామర్థ్యాన్ని ఇది కలిగి ఉన్నట్లు ఆయన చెప్పారు.

ఇద్దరు ప్రయాణించవచ్చు:
రోడ్డుపై ఉన్నప్పుడు కారులాగే కనిపించే ఈ వాహనం రెక్కలు తెరుచుకోగానే విమానం లాగా పైకి ఎగరడం ప్రారంభించింది. కారుకు ఇరువైపులా వెడల్పాటి ముడుచుకునే రెక్కలు ఉన్నాయి. రన్‌వే నుంచి నేరుగా నగరంలోకి తీసుకురావడంతో, అందరి దృష్టి ఈ ఫ్లయింగ్ కారుపై పడింది.


ఈ హైబ్రిడ్ కారు సాధారణ విమానం మాదిరిగానే గాల్లోకి ఎగిరిందని, ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతిని పొందానని స్టెఫాన్ తెలిపారు. గంటకు 170 కిలోమీటర్ల వేగంతో ఈ ఫ్లయింగ్ కార్ ప్రయాణించిందని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ వాహనం ఇద్దరు వ్యక్తులను, అత్యధికంగా 200 కేజీల వరకు బరువును మోయగలదని చెప్పారు.

వెస్ట్ ఆఫ్ ఇంగ్లాండ్ వర్సిటీలో సీనియర్ పరిశోధకుడు డాక్టర్ స్టీఫెన్ రైట్.. ఈ ఎయిర్ కారును బుగాట్టీ వెయ్రాన్, సెస్నా 172 వాహనాలతో పోల్చారు. "ఇది చూసేందుకు చాలా బాగుంది. అయితే దీని ధ్రువీకరణ విషయంలో తనకు చాలా ప్రశ్నలు ఉన్నాయి" అని స్పష్టం చేశారు. "ఎవరైనా విమానం తయారు చేయవచ్చు. కానీ సమస్య ఏంటంటే ఎలాంటి అపాయం జరగకుండా పదే పదే గాల్లోకి ఎగురుతూ కొన్ని లక్షల గంటలపాటు అక్కడ ఉండాలి" అని ఆయన అన్నారు.

ఇది కూడా చదవండి: రోజూ రూ.7 పెట్టుబడి పెట్టండి... నెలకు రూ.5,000 పొందండి... ఇవీ స్కీమ్ పూర్తి వివరాలు

మొత్తానికి ఫ్లైయింగ్ కార్ల జోరు పెరిగింది. చాలా కంపెనీలు పోటీపడి మరీ... సరికొత్త ఎగిరే కార్లు తయారుచేస్తున్నారు. ఇక ప్రపంచ దేశాలు పర్మిషన్ ఇవ్వడమే మిగిలి ఉందేమో.
Published by:Krishna Kumar N
First published: