news18-telugu
Updated: August 8, 2020, 6:00 AM IST
Kerala Plane Crash : కేరళ విమాన ప్రమాదంలో 20కి చేరిన మృతుల సంఖ్య
Kerala Plane Crash : విమానాలు టేకాఫ్ అయ్యేటప్పుడు చాలా ఈజీగా అవుతాయి. కానీ... రన్‌వేపై ల్యాండ్ అయ్యేటప్పుడే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. కేరళ... కోజికోడ్ విమాన ప్రమాదం మరోసారి ఈ విషయాన్ని స్పష్టం చేస్తోంది. శుక్రవారం రాత్రి 7:40 గంటలకు 191 మంది ప్రయాణికులతో... ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం... కోజికోడ్ ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ల్యాండ్ అవుతూ... పక్కకు జారిపోయింది. ఇందుకు కారణం... కేరళలో జోరు వర్షాలు పడుతుంటే... రన్‌వే తడిగా ఉంది. అందువల్లే టైర్లు జారి... విమానం పక్కకు వెళ్లి... కుదుపులకు లోనై... 50 అడుగుల లోయలోకి జారి... రెండు ముక్కలైంది. ఆ సమయంలో భారీ శబ్దం వచ్చింది. విమానం పేలిపోయిందేమో అనుకున్నారు. లక్కీగా మంటలేవీ రాకపోవడంతో... పెను ప్రమాదం తప్పినట్లైంది. అయినప్పటికీ... ఈ ప్రమాదంలో పైలట్, కోపైలట్ సహా... 20 మంది ప్రాణాలు కోల్పోయారు.

Kerala Plane Crash : కేరళ విమాన ప్రమాదంలో 20కి చేరిన మృతుల సంఖ్య
ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 737 ఐఎక్స్ 1344, ఎక్స్‌ప్రెస్ విమానం... ‘వందే భారత్’లో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చింది. దుబాయ్ నుంచి పది మంది చిన్నారులు సహా 184 మంది ప్రయాణికులు, ఇద్దరు పైలెట్లు, ఏడుగురు సిబ్బందితో కొజికోడ్ బయలుదేరింది. ప్రమాదానికి ముందు... రెండుసార్లు ల్యాండింగ్ కోసం ప్రయత్నించి... ఆకాశంలోనే రౌండ్లు వేసింది.
మూడోసారి ల్యాండ్ అవుతూ... ప్రమాదంలో చిక్కుకుంది. కాస్త ఎక్కువ వేగంతో ల్యాండ్ అవ్వడం వల్లే విమానం కంట్రోల్ తప్పిందనే వాదన వినిపిస్తోంది. రాత్రంతా సహాయ చర్యలు జరిగాయి. తీవ్రంగా గాయపడిన 15 మందినీ, స్వల్పంగా గాయపడిన 123 మందిని కోజికోడ్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
విమాన ప్రమాదంపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ట్విటర్ ద్వారా మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరారు. విమాన ప్రమాదం తననెంతో కలచివేసిందని మోదీ ట్వీట్ చేశారు. కేరళ సీఎం పినరయి విజయన్‌కు మోదీ ఫోన్ చేసి ప్రమాద వివరాల్ని తెలుసుకున్నారు.
బాధిత కుటుంబాలకు సమాచారం అందించేందుకుగాను షార్జా, దుబాయ్‌లలో భారత రాయబార కార్యాలయ సిబ్బంది సహాయక కేంద్రాల్ని ఏర్పాటు చేశారు. ఘటనపై కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ప్రమాద ఘటనపై విచారణకు పౌర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఆదేశాలు జారీ చేశారు. భారత్‌లో చివరిసారిగా పదేళ్ల కిందట ఇలాగే విమాన ప్రమాదం జరిగింది. 2010లో కర్ణాటకలోని మంగళూరు ఎయిర్‌పోర్టులో రన్‌వేపై ఎయిర్ ఇండియా విమానం జారింది. ఆ ప్రమాదంలో విమానంలో ఉన్న 158 మందీ చనిపోయారు.
మరోవైపు ఇదే కేరళలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఇడుక్కి జిల్లాలోని మున్నార్‌కు సమీపంలో రాజమలై ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి 15 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 12 ఏళ్ల బాలుడు, 13 ఏళ్ల బాలిక, ఎనిమిది మంది పురుషులు, ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈ ప్రాంతంలో తమిళనాడుకు చెందిన దాదాపు 80 మంది కార్మికులు గుడిసెలు ఏర్పాట్లు చేసుకుని నివాసముంటున్నారు. కొండ చరియలు విరిగిపడి 31 గుడిసెలు శిథిలాల కింద చిక్కుకున్నాయి. 15 మంది మృతదేహాలు శిథిలాల కింద వెలికితీయగా...మరో 57 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. కొండ చరియలు విరిగిపడ్డ ఘటనా స్థలాల్లో రిస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. మరో 12 మంది క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స కల్పిస్తున్నారు. వీరిలో ముగ్గురు తీవ్ర గాయాలకు గురైయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు.
Published by:
Krishna Kumar N
First published:
August 8, 2020, 6:00 AM IST