ఫిబ్రవరి వచ్చేస్తున్నది. మరికొద్ది రోజులైతే ప్రపంచవ్యాప్తంగా ప్రేమికులు ఎంతో ఇష్టంగా జరుపుకునే వాలైంటైన్స్ డే (valentines day) 14న రానుంది. అయితే అదే రోజు కొన్ని సంఘాలు చేసే రచ్చ కూడా మామూలుగా ఉండదు. అమ్మాయి, అబ్బాయి కనిపించినా.. ఆరోజు సదరు సంస్థల ఆగ్రహానికి బలవ్వాల్సిందే. దాని సంగతి పక్కనబెడితే ఓ కాలేజీ విడుదల చేసిన ఒక ఉత్తర్వు కూడా ఆందోళన రేపుతున్నది. ఉత్తరప్రదేశ్ లోని ఆగ్రాకు చెందిన కాలేజీ విడుదల చేసిన ఉత్తర్వు (సర్క్యూలర్) వివాదాస్పదంగా మారింది. ఆ ఉత్తర్వులలో.. ఫిబ్రవరి 14 న వాలైంటెన్స్ డే కి ముందు కాలేజీకి వచ్చే అమ్మాయిలందరూ ప్రియుడిని కలిగి ఉండాలని ఉంది. దీనిపై అమ్మాయిలు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
ఆగ్రాలోని సెయింట్ జాన్స్ కాలేజ్ లెటర్ హెడ్ ఉత్తర్వులు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ సర్క్యూలర్ అసోసియేట్ డీన్ (అకాడెమిక్ అఫైర్స్) ప్రొఫెసర్ ఆశిశ్ శర్మ పేరు మీద విడుదలైంది. ఈ కళాశాల అత్యంత పురాతనమైంది. 1850 లో బ్రిటిషర్లు దీనిని స్థాపించారు. జనవరి 14న ఈ ఉత్తర్వులు వెలువడ్డట్టు లెటర్ హెడ్ ను బట్టి తెలుస్తున్నది.
సర్క్యూలర్ లో ఇలా ఉంది...‘అమ్మాయిలందరికీ ఫిబ్రవరి 14 నాటికి ఒక ప్రియుడు ఉండాలి. భద్రతా ప్రయోజనాల నిమిత్తం దీనిని తీసుకొస్తున్నాం. ఒంటరి బాలికలను కళాశాలలోకి అనుమతంచరు. ఆ రోజు తప్పనిసరిగా అమ్మాయిలంతా వారి ప్రియుడితోనే కాలేజీకి రావాలి. అతడు లేని పక్షంలో కనీసం ఇటీవలి చిత్రాన్నైనా చూపించాల్సి ఉంటుంది..’ అని రాసి ఉంది.
కాగా ఈ ఉత్తర్వులకు సంబంధించిన లేఖ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వాట్సాప్ ద్వారా కాలేజీలో చదువుతున్న బాలికలందరికీ ఈ మెసేజ్ వెళ్లడంతో వారు భయాందోళనలకు గురయ్యారు. ఇదే విషయాన్ని వాళ్లు వారి తల్లిదండ్రులకు తెలిపారు. వారంతా వెళ్లి కాలేజీ ప్రిన్సిపాల్ ను నిలదీసే సరికి అసలు విషయం బయటకు వచ్చింది.
ఈ లేఖను తాము విడుదల చేయలేదని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.పి.సింగ్ అన్నారు. అదో ఫేక్ సర్య్కూలర్ అని ఆయన కొట్టి పారేశారు. దీనిని కొంతమంది వైరల్ చేస్తూ తమ కళాశాల ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారని.. అసలు ఆశిష్ శర్మ అనే పేరుతో తమ కళాశాలలో ప్రొఫెసర్ ఎవరూ లేరని అన్నారు. విద్యార్థులు ఈ ఉత్తర్వులను నమ్మొద్దని కోరారు. ఫైనల్ ఈయర్ కు చెందిన విద్యార్థులు ఈ పని చేసి ఉంటారని ప్రిన్సిపాల్ అనుమానిస్తున్నారు. దీనిపై ఆయన విచారణకు ఆదేశించారు.
Published by:Srinivas Munigala
First published:January 27, 2021, 18:06 IST