Afghanistan: తాలిబన్లను నడిపిస్తున్నదెవరు.. వాళ్ల నాయకుల బ్యాక్​గ్రౌండ్ ఏంటంటే

(PC: Twitter)

అఫ్గానిస్థాన్‌​ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ప్రపంచమంతా ​ఆ దేశం వైపు దృష్టి సారించింది. 2001 తర్వాత మళ్లీ అఫ్గాన్‌.. తాలిబన్ల చ?

  • Share this:
అఫ్గానిస్థాన్‌​ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడంతో ప్రపంచమంతా ​ఆ దేశం వైపు దృష్టి సారించింది. 2001 తర్వాత మళ్లీ అఫ్గాన్‌.. తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో ఏం జరుగుతుందోనని ఆ దేశ ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అప్పటి పరిస్థితులను తలుచుకొని ఆవేదన చెందుతున్నారు. దీంతో దేశం విడిచివెళ్లేందుకు ఆరాటపడుతున్నారు. మరోవైపు గతేడాది నుంచి అమెరికా తన బలగాలను అఫ్గానిస్థాన్‌​లో ఉపసంహరించుకోవడంతో తాలిబన్లు మళ్లీ రెచ్చిపోయారు. క్రమంగా నగరాలను స్వాధీనం చేసుకుంటూ వచ్చి చివరికి రాజధాని కాబూల్​ను చేజిక్కించుకున్నారు. దీంతో దేశమంతా తాలిబన్ల చేతుల్లోకి వెళ్లిపోయింది.

1996 నుంచి 2001 వరకు తాలిబన్లు అఫ్గానిస్థాన్‌​ను పాలించారు. మత ఛాందసవాదంతో మధ్యరాతి యుగం నాటి సూత్రాలతో నిరంకుశ పాలన చేశారు. ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. కఠినమైన షరియా చట్టాలను అమలు చేశారు. 10 సంవత్సరాలకు పైబడిన అమ్మాయిలు చదువుకోకూడదని, ఎవరూ టీవీలు, సంగీతం, సినిమాలు చూడకూడదనే కఠిన నిబంధనలు విధించారు. అలాగే హంతకులు, అక్రమ సంబంధాలు పెట్టుకున్నారని అనుమానం ఉన్న వారిని బహిరంగంగా చంపడం లాంటి ఆటవిక పాలన చేశారు. నిబంధనలు అతిక్రమించిన వారికి అవమానకర రీతిలో బహిరంగంగా శిక్షలు వేసే వారు. పాకిస్థాన్​లో పురుడుపోసుకున్న ఈ తాలిబన్ల దళం క్రమంగా పెరిగింది. అఫ్గాన్‌లో స్థిర ప్రభుత్వం లక్ష్యమంటూ 1994లో ముల్లా మహమ్మద్​ ఒమర్ నాయకత్వంలో ఏర్పడిన తాలిబన్లు ఎన్నో అకృత్యాలకు పాల్పడ్డారు. ఇప్పుడు మరోసారి అఫ్గానిస్థాన్‌​ను చేజిక్కించుకన్నారు. ప్రస్తుతం తాలిబన్లను ముందుడి నడిపిస్తున్నదెవరు? ఈ ఇస్లామిస్ట్ మిలిటెంట్ సంస్థకు ప్రధాన నాయకులు ఎవరనే వివరాలు తెలుసుకుందాం.

హైబతుల్లా అఖున్​జద

ప్రస్తుతం తాలిబన్ల అగ్రనాయకుడు హైబతుల్లా అఖున్​జద. 2016లో ఈ దళానికి నాయకుడిగా ఆయన మారాడు. పాకిస్థాన్​లో అమెరికా నిర్వహించిన డ్రోన్ దాడుల్లో అక్తర్ మహమ్మద్ మన్సూర్​ చనిపోవడంతో హైబతుల్లాకు అధికారం దక్కింది. 2001లో హైబతుల్లా పాక్​కు వెళ్లి అక్కడి మదరసాలో చదువుకున్నాడు. ఆ తర్వాత మన్సూర్​ హయాంలో పని చేశాడు. మిలటరీ అనుభవం ఎక్కువగా లేకున్నా ఆర్థిక సంబంధాల్లో కీలకపాత్ర ఉండడంతో హైబతుల్లా నాయకుడిగా మారాడు. ముఖ్యంగా మాదక ద్రవ్యాల రవాణాలో మాస్టర్ మైండ్ అన్న వాదనలు ఉన్నాయి. అయితే హైబతుల్లా ప్రజల ముందుకు రాక కొన్ని సంవత్సరాలైంది.

అబ్దుల్​ ఘనీ బారాదార్​

అబ్దుల్ ఘనీ బారాదార్..​ తాలిబన్ల ముఖ్య నేతగా ఉన్నారు. దోహా, ఖతార్​లో నిర్వహించిన శాంతి చర్చల్లో తాలిబన్ల తరఫున పాల్గొంది ఈయనే. తాలిబన్ల వ్యవస్థాపకుల్లో ఘనీ కూడా ఒకరు. 2010 నుంచి పాకిస్థాన్​ జైల్లో ఘనీ ఉండగా.. శాంతి చర్చల కోసం అతడిని విడుదల చేయాలని అమెరికా 2018లో పాక్​కు సూచించింది. దీంతో అతడు బయటికి వచ్చాడు. అఫ్గాన్‌​ నుంచి అమెరికా బలగాలు వెళ్లిపోవడంలోనూ ఘనీ కీలకపాత్ర పోషించాడు. 2020లో శాంతి చర్చల పేరుతో అప్పటి అమెరికా అధ్యక్షుడు ట్రంప్​తోనూ మాట్లాడాడు. ఇక బైడెన్ అధ్యక్షుడయ్యాక అగ్రరాజ్యం తన బలగాలను అఫ్గాన్‌​ నుంచి వెనక్కి పిలిచింది. అఫ్గాన్‌ ప్రస్తుత అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచివెళ్లాక అబ్దుల్ ఘనీ బారాదార్​.. అఫ్గానిస్థాన్‌​ను ఉద్దేశించి మాట్లాడారు.

మహమ్మద్ యాకూబ్​

తాలిబన్ వ్యవస్థాపకుడు మహమ్మద్ ఒమర్​ తనయుడు మహమ్మద్​ యాకూబ్.. తాలిబన్​ మిలటరీని ముందుకు నడుపుతున్నాడు. 2013 తన తండ్రి మరణించాక దళంలోకి వచ్చిన యాకూబ్ క్రమంగా ఎదిగాడు. అత్యంత క్రూరుడిగా కొందరు విశ్లేషకులు ఇతడి గురించి చెబుతారు. అఫ్గానిస్థాన్‌ మిలటరీపై భీకర దాడుల్లో యాకూబ్​దే మాస్టర్ మైండ్ అని అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.

సిరాజుద్దీన్​ హక్కానీ

హక్కానీ నెట్​వర్క్ వ్యవస్థాపకుడు జలాలుద్దీన్ హక్కానీ కుమారుడే ఈ సిరాజుద్దీన్ హక్కానీ. ఆ నెట్​వర్క్​తో పాటు తాలిబన్ల డిప్యూటీ లీడర్​గానూ సిరాజుద్దీన్​ ఉన్నాడు. ముఖ్యంగా భీకరమైన బాంబు పేలుళ్లకు హక్కానీ నెట్​వర్క్ పేరొందింది. అఫ్గాన్‌ ప్రభుత్వం కొంత కాలం అణచివేసినా.. 2017లో సిరాజుద్దీన్ నాయకత్వంలో 5వేల మందితో ఈ నెట్​వర్క్ మళ్లీ భయంకరంగా తిరిగివచ్చింది.

2001 సెప్టెంబర్​ 11న అమెరికాపై వైమానిక దాడి చేసిన ఆల్​ ఖైదా అధినేత ఒసామా బిన్​ లాడెన్​కు తాలిబన్లు ఆశ్రయమిచ్చారు. దీంతో 2001 అక్టోబర్​లో అఫ్గానిస్థాన్​పై అమెరికా మెరుపుదాడులు చేసి తాలిబన్ల ప్రభుత్వాన్ని కూల్చేసింది. అనంతరం ఆ దేశంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. అయితే 20 సంవత్సరాల తర్వాత అమెరికా తన బలగాలను వెనక్కి రప్పించడంతో మళ్లీ అఫ్గానిస్థాన్‌​లో తాలిబన్ల రాజ్యం ఏర్పడింది.
Published by:Krishna Adithya
First published: