Home /News /trending /

AFFECTS WILDLIFE TO THREATEN CHENCHU TRIBES WHAT HAPPENS TO TELANGANAS NALLAMALA FOREST BS

నల్లమల ఉద్యమం.. అసలు అక్కడ ఏం జరుగుతోందంటే..

నల్లమల అడవి

నల్లమల అడవి

Save Nallamala : దట్టమైన అభయారణ్యాలు.. అరుదైన జంతు జాతులు.. లెక్కలేనన్ని క్రూర మృగాలు.. బోలెడన్ని పులులు.. ఎటుచూసినా కొండలు, లోయలు, ఎత్తైన చెట్లు.. ఇదీ నల్లమల అడవుల స్వరూపం. ఏపీ, తెలంగాణలోని కర్నూలు, మహబూబ్‌నగర్, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ పచ్చని అడవులు బూడిదగా మారిపోతాయా?

ఇంకా చదవండి ...
దట్టమైన అభయారణ్యాలు.. అరుదైన జంతు జాతులు.. లెక్కలేనన్ని క్రూర మృగాలు.. బోలెడన్ని పులులు.. ఎటుచూసినా కొండలు, లోయలు, ఎత్తైన చెట్లు.. ఇదీ నల్లమల అడవుల స్వరూపం. ఏపీ, తెలంగాణలోని కర్నూలు, మహబూబ్‌నగర్, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ పచ్చని అడవులు బూడిదగా మారిపోతాయా? కొండలు, గుట్టలు కరిగి స్మశానంగా రూపాంతరం చెందుతుందా? కీకారణ్యాలు చావు కేక పెడతాయా? దక్షిణ భారత దేశానికే తలమానికంగా ఉన్న నల్లమల అడవులు ప్రమాదంలో పడబోతున్నాయా? అసలు నల్లమలలో ఏం జరుగుతోంది? ఎందుకు ప్రముఖులు, సినీనటులు సేవ్ నల్లమల అంటూ ఉద్యమం చేపట్టారు? తదితర ప్రశ్నలకు సమాధానాలు వెతకాల్సిన సమయం వచ్చింది. ఎక్కువగా చదువుకోకున్నా అడవినే తమ తల్లిలా భావించే చెంచులు.. నల్లమలను కాపాడుకోవడానికి ప్రాణాలను ఫణంగా పెట్టేందుకు సిద్ధమవుతున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు ఈ ఉద్యమం ఏ స్థాయికి వెళుతుందో..!

వివరాల్లోకెళితే.. నల్లమల అడవుల్లో యురేనియం ఉన్నట్లు తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం నిక్షేపాలను గుర్తించేందుకు సర్వేకు అనుమతి ఇచ్చింది. నల్లమల అడవిలోని కుంచోని మూల నుంచి పదర వరకు మొదటి బ్లాక్​లో 38 చదరపు కిలో మీటర్లు, పదర నుంచి ఉడిమిల్ల వరకు రెండో బ్లాకులో 38 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో నాలుగు వేల బోర్లు వేసి, నమూనాలు సేకరించేందుకు భారత అణుశక్తి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు అనుమతులు రావడంతో అచ్చంపేట, అమ్రాబాద్​ అటవీశాఖ అధికారులు, సిబ్బంది కలిసి వారం రోజులుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. డ్రిల్లింగ్​యంత్రాలు తీసుకు వచ్చేందుకు రూట్​మ్యాప్ సిద్ధం చేస్తున్నారు. యురేనియం సర్వే గురించి తెలియగానే మేధావులు, ప్రజా సంఘాల నాయకులు, విపక్ష నేతలు రంగంలోకి దిగారు. నల్లమలలో పర్యటించి, యురేనియం తవ్వకాల వల్ల కలిగే చెడు పరిణామాలపై స్థానికులకు వివరించి, వారిని చైతన్యవంతుల్ని చేశారు. యువజన, కుల సంఘాల నాయకులతో కలిసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు.

నల్లమల అడవి


చెంచులు, స్థానికులు ఏకమై.. తమ ప్రాణాలను అడ్డు పెట్టయినా అడవిని, తమ అస్థిత్వాన్ని కాపాడుకుంటామని శపథం చేస్తున్నారు. బృందాలుగా రోడ్లపైకి వచ్చి రాత్రింబవళ్లు కాపలా కాస్తున్నారు. ప్రధానంగా మన్ననూర్​ చెక్​ పోస్టుతోపాటు అమ్రాబాద్ మండల కేంద్రంలోనూ యురేనియం వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో అడ్డా వేస్తున్నారు. యురేనియం ముసుగులో నల్లమలను నాశనం చేయడం ద్వారా ప్రభుత్వమే తమకు మరణ శాసనం రాస్తోందంటూ, మూగ జీవాల ప్రాణాలను ఫణంగా పెట్టబోతోందంటూ విమర్శిస్తున్నారు. నల్లమలను ఏ విధంగా కాపాడుకోవాలో తమకు తెలుసని, ఊరికే చేతులు కట్టుకొని ఉండబోమని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. యురేనియం మైనింగ్ వల్ల అడవి చుట్టూ ఉన్న కృష్ణానది కలుషితం అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారికి సినీ నటులు కూడా మద్దతు ఇస్తుండటం గమనార్హం.

నల్లమలపై కేంద్రం దృష్టి ఎలా పడిందంటే..
2030 నాటికి అణు విద్యత్తు ఉత్పత్తి 40వేల మెగావాట్లకు చేరాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు తగ్గట్లు భారత అటామిక్ ఎనర్జీ శాఖకు ఆదేశాలు ఇచ్చింది. యురేనియం నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయో వెతకాలని స్పష్టం చేసింది. దీంతో హై గ్రేడ్, దీర్ఘకాలం పాటు దొరికే యురేనియం నిక్షేపాల కోసం వెతగ్గా.. నల్లమల అడవుల్లో దొరుకుతున్నట్లు తెలిసింది. వెంటనే ఫారెస్ట్ అడ్వైజరీ కమిటీకి నివేదించగా.. ఆ కమిటీ ఆందోళన వ్యక్తం చేసినా, జాతి ప్రయోజనాల దృష్ట్యా యురేనియం తవ్వకాలు అత్యవసరం’ అని ప్రాజెక్టుకు అప్రూవల్ ఇచ్చారు.
First published:

Tags: Nallamala forest, Pawan kalyan, Ram Pothineni, Samantha, Save Nallamala, Telugu Cinema, Tollywood, Vijay Devarakonda

తదుపరి వార్తలు