కరోనాతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి సాయం చేయడానికి చాలామంది పెద్దలు ముందుకొచ్చారు. తమ వంతుగా ఆక్సిజన్, మందులు, ఆహారం ఇస్తూ సాయపడ్డారు. అయితే పంజాబ్‌లో ఓ జిల్లాలో జరుగుతున్న కొత్త రకం సాయం మాత్రం దేశం మొత్తాన్ని ఆకట్టుకుంటోంది. దానిని ఇతర రాష్ట్రాల్లోనూ పాటిస్తే కరోనాను మరింత త్వరగా దేశం నుంచి పారద్రోలొచ్చు. అంతటి ఆకర్షణీయం పాయింట్ ఏంటంటే... గ్రామాన్ని దత్తత తీసుకోవడం. ఇందులో కొత్తేముంది అంటారా... ఇక్కడ దత్తత తీసుకునేది వ్యాక్సిన్ వేయించడానికి. వివరాల్లోకి వెళ్తే.. మొహాలీ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను జిల్లా డిప్యూటీ కమిషనర్ గిరీష్ దయాలన్ ముందు నుంచి జాగ్రత్తగా నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రజలు కూడా వ్యాక్సిన్ వేయించుకోవడానికి ముందుకొస్తున్నారు. 18-45 ఏళ్ల వారికి వ్యాక్సిన్ వేయించండి అంటూ ప్రభుత్వం పిలుపు ఇవ్వగానే గిరీశ్ దయాలన్ కొత్త ఆలోచనతో ముందుకొచ్చారు. తొలుత కొంతమంది ఉద్యోగులు వచ్చి... గ్రామాలను దత్తత తీసుకొని... అక్కడి వారికి వ్యాక్సిన్లు వేయించారు. దానికయ్యే మొత్తాన్ని వాళ్లు చెల్లించారట. ఆ తర్వాత ఒక్కొక్కరుగా ముందుకొచ్చి అక్కడి గ్రామాల్లో వ్యాక్సినేషన్ చేయిస్తున్నారట.
ఉద్యోగులు, దాతలతోపాటు పెద్ద పెద్ద సంస్థలు కూడా అక్కడ సీఎఎస్‌ఆర్ పాలసీ కింద డబ్బులు వెచ్చింది వ్యాక్సినేషన్ చేయిస్తున్నాయి. కొన్ని సంస్థలకు సీఎస్‌ఆర్ పాలసీ కింద డబ్బులు ఇచ్చే కన్నా, నేరుగా ప్రజలకు వ్యాక్సిన్ వేయించడంలోనే సంతృప్తి పొందుతున్నారేమో అని డిప్యూటీ కమిషనర్ అంటున్నారు. చాలామంది దాతలు ఆయా గ్రామాలకు వెళ్లి వ్యాక్సినేషన్ ఎలా జరుగుతోంది అనేది కూడా చూస్తున్నారు. ప్రస్తుతం గ్రామాల దత్తత కార్యక్రమం బాగా ప్రాచుర్యం పొందింది. దీంతో చాలామంది దత్తత తీసుకోవడానికి ముందుకొస్తున్నారని గిరీశ్ చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Corona, Corona Vaccine, Covid, VIRAL NEWS