Home /News /trending /

ADITI ASHOK TO ABHINAV BINDRA HEARTBREAKING INSTANCES WHEN INDIAN ATHLETES FINISHED 4TH AT OLYMPICS GH VB

Heartbreaking Olympics: రణ్‌దీర్‌ నుంచి అదితి వరకు.. ఒలింపిక్స్‌లో కాంస్యం చేరువకు వచ్చి ఆగిపోయింది వీరే..

ఒలంపిక్స్ లో నాలుగో స్థానంలో నిలిచిన కొందరు ఆటగాళ్లు

ఒలంపిక్స్ లో నాలుగో స్థానంలో నిలిచిన కొందరు ఆటగాళ్లు

ఎన్నో ఆటంకాలు, అవరోధాల నడుమ ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్ విశ్వ క్రీడలు ముగిశాయి. ఎంతోమంది క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు గెల్చుకున్నారు. మరికొందరు విజయం వరకు వచ్చి త్రుటిలో పతకాలను చేజార్చుకున్నారు. వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం..

ఇంకా చదవండి ...
ఎన్నో ఆటంకాలు, అవరోధాల నడుమ ప్రారంభమైన టోక్యో ఒలింపిక్స్ విశ్వ క్రీడలు ముగిశాయి. ఎంతోమంది క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనతో పతకాలు గెల్చుకున్నారు. మరికొందరు విజయం వరకు వచ్చి త్రుటిలో పతకాలను చేజార్చుకున్నారు. అదేదో సినిమాలో చెప్పినట్లు... ‘వాళ్లు ఆటలో గెలిచారు... మేం మనసులు గెలుచుకున్నాం’ అనే డైలాగ్‌ భారత ఒలింపియన్లు చాలా మందికి వర్తించింది. మొత్తంగా ఇప్పటివరకు ఒలింపిక్స్‌ చరిత్రలో భారతదేశానికి ఇలాంటి ‘మనసులు గెలుచుకున్న’ సందర్భాలు ఏమేం ఉన్నాయో చూద్దాం.
అదితి అశోక్‌ (టోక్యో ఒలింపిక్స్)
టోక్యో ఒలింపిక్స్‌లో పతకం ఖాయం అంటూ ఆఖరులో ప్రచారం జరిగి, పతకం కొట్టేసినంత పని చేసింది అదితి అశోక్‌. గోల్ఫ్‌ అంటే అంతగా ఆదరణ లేని మన దేశంలో పతక రేసులో తీవ్రంగా పోరాడి నాలుగో స్థానంలో నిలిచిపోయింది అదితి. పోటీలో తొలి మూడు రోజులు రెండో స్థానంలో ఉండి పతకంపై ఆశలు రేపింది. అయితే ఆఖరికి నాలుగో స్థానానికి పరిమితమైంది. దీంతో పతకం మిస్‌ అయ్యింది.

మహిళల హాకీ టీమ్‌ (టోక్యో ఒలింపిక్స్)
టోక్యో ఒలిపింక్స్‌లో ఎవరూ ఊహించని విజయాలు సాధించిన బృందం... మహిళల హాకీ టీమ్‌. రాణీ రాంపాల్‌ నేతృత్వంలో మహిళల జట్టు అంచనాలను మించి రాణించింది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను 1-0తో ఓడించింది. అయితే సెమీస్‌లో అర్జెంటీనా చేతిలో ఓడిపోయింది. ఆఖరికి కాంస్య పతకం కోసం జరిగిన పోరులో గ్రేట్‌ బ్రిటన్‌ చేతిలో 3-4 తేడాతో ఓటమిపాలైంది. దీంతో అభిమానులను మనసు చివుక్కుమంది.
దీపా కర్మాకర్‌ (2016)
రియో ఒలింపిక్స్‌లో సంచలనం ఎవరూ అంటే దీపా కర్మాకర్‌ అని చెప్పొచ్చు. జిమ్నాస్టిక్స్‌లో డేంజరస్‌గా పిలిచే ప్రొడునోవా వాల్ట్‌ ఫీట్‌ను చేసి మైమరపించింది. అయితే పతకం మాత్రం సాధించలేకపోయింది. దీంతో దీపా కర్మాకర్‌ పతక పోరు అలా ముగిసిపోయింది.
అభినవ్‌ బింద్రా (2016)
నీరజ్‌ చోప్రాకు ముందు ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం తీసుకొచ్చిన ఏకైక ఆటగాడు.. షూటర్ అభినవ్‌ బింద్రా. బీజింగ్‌ ఒలింపిక్స్‌లో అతడు ఈ ఘనత సాధించాడు. అయితే రియోలో కూడా ఓ పతకం రావాల్సింది. కానీ త్రుటిలో మిస్‌ అయ్యింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో గురి మిస్‌ అయ్యి... నాలుగో స్థానంలో నిలిచాడు.

సానియా మీర్జా - రోహన్‌‌ బోపన్న (2016)
రియో ఒలింపిక్స్‌లో అభిమానుల గుండెపగిలిన మరో ఈవెంట్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ టెన్నిస్‌. ఈ విభాగంలో సానియా మీర్జా - రోహన్‌ బోపన్న తొలి రౌండ్స్‌లో బాగానే ఆడి పతకం మీద ఆశలు రేపారు. అయితే పతకం దగ్గరకు వచ్చేసరికి ఉసూరుమనిపించారు. సెమీస్‌లో ఓడి, కాంస్యం కోసం జరిగిన మ్యాచ్‌లోనూ ఓటమిపాలయ్యారు.
జోయ్‌దీప్‌ కర్మాకర్‌ (2012)
లండన్‌ ఒలింపిక్స్‌లో పతకం ఆశలు రేపిన క్రీడాకారుడు జోయ్‌దీప్‌ కర్మాకర్‌. మెన్స్‌ 50 మీటర్ల రైఫిల్‌ ప్రోన్‌ ఈవెంట్‌లో పతకం కోసం జరిగిన పోరులో నాలుగో స్థానంలో నిలిచాడు. ఒకానొక దశలో కనీసం కాంస్యం అయినా దక్కుతుందని అనుకున్నా... ఆఖరికి అది రాజ్‌మండ్‌ డెబ్‌వేక్‌కు దక్కింది.
లియాండర్‌ పేస్‌ - మహేష్‌ భూపతి (2004)
భారత టెన్నిస్‌ అభిమానులకు 2004 ఒలింపిక్స్‌ చాలా ఆనందాన్నిచ్చేలా కనిపించింది. లియాండర్‌ పేస్‌, మహేష్‌ భూపతి జోడీ కచ్చితంగా పతకం సాధిస్తుందని అందరూ ఆశించారు. అందుకు తగ్గట్టుగా తొలి మూడు రౌండ్లు అలవోకగా దాటేశారు. అయితే సెమీస్‌కి వచ్చేసరికి వరుస సెట్‌లలో ఓడిపోయారు. దీంతో పతకం ఆశలు ఆవిరయ్యాయి.
కుంజురాణీ దేవి (2004)
ఏథేన్స్‌ ఒలింపిక్స్‌లో పతక ఆశలు కలిగించి... ఆఖరులో ఆవిరి చేసేసిన వెయిట్‌లిఫ్టర్‌ కుంజురాణీ దేవి. 48 కిలోల డివిజన్‌ విభాగంలో 190 కిలోల బరువు ఎత్తి వావ్‌ అనిపించింది. అయితే కాంస్య పతకానికి 10 కిలోల బరువు ముందు ఆగిపోయింది. అలా పతకం అవకాశం మిస్‌ అయ్యింది.

పీటీ ఉష (1984)
భారతీయ క్రీడా రంగంలో చిరస్థాయిగా గుర్తుండిపోయే పేర్లలో పీటీ ఉష ఒకరు. లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో ఆమె పతకం దగ్గరకు వచ్చి నిలిచిపోయారు. 400 మీటర్ల హర్డిల్స్‌ను 55.42 సెకన్లలో పూర్తి చేశారు. అయితే ఆమెను దాటి ముందుకెళ్లి కాంస్యం గెలుచుకున్న ప్లేయర్‌కు ఈమెకు మధ్య ఉన్న తేడా సెకనులో వందో వంతు కావడం గమనార్హం.
మహిళ హాకీ టీమ్‌ (1980)
భారత మహిళల హాకీ టీమ్‌ ఈ ఏడాది ఒలింపిక్స్‌లో ఎలాంటి ప్రతిభ చూపించిందో చూశాం. సరిగ్గా 40 ఏళ్ల క్రితం కూడా ఇలాంటి ప్రదర్శనే చేసింది. మాస్కోలో జరిగిన ఒలింపిక్స్‌లో నాలుగో స్థానంలో నలిచింది. అయితే మహిళల హాకీ టీమ్‌ తొలిసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది ఈ ఏడాదే.
మిల్కా సింగ్‌ (1960)
పరుగుల వీరుడు ఫ్లయింగ్‌ సిఖ్‌ మిల్కా సింగ్‌ ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది. రోమ్‌ ఒలింపిక్స్‌లో ఆయన కేవలం 0.1 సెకండ్‌ తేడాలో కాంస్య పతకాన్ని మిస్‌ చేసుకున్నారు. 400 మీటర్ల స్ప్రింట్‌లో ఆయన పతకం చేజార్చుకున్నారు. ఈ పోటీలో ఆయన 45.6 సెకన్లలో పోటీ పూర్తి చేయడం గమనార్హం.

పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు (1956)
భారత పురుషుల ఫుట్‌బాల్‌ జట్టు అంటే ఇప్పుడు పెద్దగా పేరు ఉండకపోవచ్చు. కానీ మెల్‌బోర్న్‌ ఒలిపింక్స్‌లో మన జట్టు పతకం అంచులదాకా వెళ్లి వెనక్కి వచ్చేసింది. క్వార్టర్‌ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్‌కు చేరింది. అందులో నెవిల్‌ డిసౌజా హ్యాట్రిక్‌ గోల్స్‌ సాధించడం విశేషం. అయితే సెమీన్‌లో యుగోస్లేవియా చేతిలోను, కాంస్య పతకం కోసం జరిగిన పోరులో బల్గేరియా చేతిలోనూ ఓటమిపాలయ్యారు.
రణ్‌దీర్‌ షిండేస్‌ (1920)
ఈ ఒలింపిక్స్‌లో మన రెజర్లు అదరగొట్టారు. పతకాలతో కొందరు, అవకాశాలతో ఇంకొందరు వావ్‌ అనిపించారు. అయితే వందేళ్ల క్రితం అంట్వెర్ప్‌లో జరిగిన ఒలింపిక్స్‌లో రణ్‌దీర్‌ షిండేస్‌ అనే రెజ్లర్‌ ఇలాగే పతకం వరకు వచ్చారు. సెమీ ఫైనల్స్‌, కాంస్య పతకం పోరులో ఓటమిపాలై నాలుగో స్థానంలో నిలిచారు రణ్‌దీర్‌ షిండేస్‌.
Published by:Veera Babu
First published:

Tags: Games, Olympics

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు