Viral Video: జబ్బు చేసిన వృద్ధురాలిని హత్తుకున్న వాన‌రం.. అన్నం పెట్టిన విశ్వాసాన్ని మర్చిపోని మూగజీవి

వైరల్ అయిన వీడియోలోని ఓ దృశ్యం

జబ్బు చేసి, మంచం పట్టిన వృద్ధురాలిని ఒక కొండముచ్చు (గ్రే లంగూర్) హత్తుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త‌న‌కు అన్నం పెట్టే వృద్ధురాలు వారం రోజులుగా క‌నిపించ‌క‌పోయేస‌రికి ఆ వానరం తల్లడిల్లింది. దీంతో ఆమె కోసం వెతుక్కుంటూ ఇంటికే వ‌చ్చి.. మంచంపై పడుకున్న బామ్మను హత్తుకుంది.

  • Share this:
జబ్బు చేసి, మంచం పట్టిన వృద్ధురాలిని ఒక కొండముచ్చు (గ్రే లంగూర్) హత్తుకున్న ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త‌న‌కు అన్నం పెట్టే వృద్ధురాలు వారం రోజులుగా క‌నిపించ‌క‌పోయేస‌రికి ఆ వానరం తల్లడిల్లింది. దీంతో ఆమె కోసం వెతుక్కుంటూ ఇంటికే వ‌చ్చి.. మంచంపై పడుకున్న బామ్మను హత్తుకుంది. రోజూ ఆహారాన్ని అందించే ఆ వృద్ధురాలి ఇంటికి వానరం రావ‌డం, ఆమె మంచంపైనే కాసేపు కూర్చోవ‌డం, త‌రువాత ఆమెను హ‌త్తుకోవ‌డం చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. సదరు వృద్ధురాలు కూడా కొండముచ్చును అంతే ప్రేమ‌గా చూసింది. దాని వీపు నిమిరి త‌న ఆత్మీయ‌త‌ను చాటింది.

వీడియోలో ఏముంది?
ప్ర‌తిరోజూ త‌న‌కు ఆహారం అందించే వృద్ధురాలు వారం రోజులుగా క‌నిపించ‌క‌పోయేస‌రికి.. ఆ వాన‌రం నేరుగా ఆమె ఇంటికే వ‌చ్చేసిందని వీడియో కాప్ష‌న్‌లో రాశారు. ఆ బామ్మ ఇంటికి వచ్చిన కొండముచ్చు, ఆమె పడుకున్న మంచం పైకి ఎక్కింది. ఆ తరువాత ఆమెను హ‌త్తుకోని కాసేపు అక్కడే కూర్చొంది. కొన్ని నిమిషాల తరువాత అది మంచం దిగి వెళ్ళిపోయినట్లు వీడియోలో కనిపిస్తోంది. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగిందనే వివరాలపై స్పష్టత లేదు. ఇందులో ఉన్న వృద్ధురాలి వివరాలు సైతం బయటకు రాలేదు. ప్రస్తుతం ఈ క్లిప్పింగ్‌ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇప్పటికే వీడియోను యూట్యూబ్‌లో సుమారు నాలుగున్నర ల‌క్ష‌ల‌ మంది చూశారు. ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో సైతం లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి.

ఆ వీడియో కోసం క్లిక్ చేయండి..


ఈ వీడియోకు నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు పెడుతున్నారు. సాక్షాత్తూ హ‌నుంతుడి స్వ‌రూప‌మే ఆమె ఇంటికి వ‌చ్చింద‌ని, బామ్మ త్వ‌ర‌గా కోలుకుంటుంద‌ని కామెంట్లు రాస్తున్నారు. ‘క‌చ్చితంగా బామ్మగారి ఆరోగ్యం మెరుగువుతుంది. స్వ‌యంగా హ‌నుమంతుడే ఆ వాన‌రాన్ని పంపాడు’ అని ఒకరు కామెంట్ పెట్టారు. ‘నా ఆరోగ్యాన్ని సంర‌క్షించుకోవ‌డానికి, చెక్ చేసుకోవ‌డానికి నాకు కూడా ఇలాంటి వాన‌ర‌ం ఒక‌టి ఉంటే బావుంటుంది’ అని మ‌రొక‌ నెటిజ‌న్ కామెంట్ చేశారు. ‘మూగ‌జీవాల‌కు మాట‌లు రావేమో కానీ.. వాటికీ మ‌న‌సుంటుందని ఈ కోతి నిరూపించింది’ అని ఇంకొక వ్యక్తి కామెంట్ పెట్టారు.
Published by:Sambasiva Reddy
First published: