Viral Video: సముద్రంలో కూలిన రెండంతస్తుల భవనం.. కెమెరాలో రికార్డ్ అయిన షాకింగ్ దృశ్యాలు..

Photo Credit : Sky News Twitter

Viral Video: సముద్రపు అలలు ఏకధాటిగా ఆ కొండను ఢీ కొట్టడంతో.. దానిపై నిర్మించిన భవనం చిగురుటాకులా వణికి పోయింది. కొంత సమయం తర్వాత అలల దెబ్బకు ఆ భవనం పునాదులు కదిలిపోయాయి.

  • Share this:
ప్రకృతిలో అత్యంత శక్తివంతమైనది నీరు. భీకరమైన తుఫాన్‌లు, వరదల వంటి విపత్తుల సమయంలో నీళ్లు సృష్టించే భయానక దృశ్యాలు టీవీలో చూసినా.. కాళ్లు గజగజ వణికిపోతాయి. తాజాగా అలాంటి షాకింగ్ దృశ్యాలే కెమెరాలో రికార్డు అయ్యాయి. సముద్రమట్టం పెరగడంతో ఏర్పడిన ముంపు కారణంగా రెండంతస్తుల భవనం పునాదులతో సహా కూలిపోయింది. ఈ షాకింగ్ ఘటన అర్జెంటీనాలో చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే.. అర్జెంటీనా రాజధాని బ్యూనస్ ఎయిర్స్‌లోని మార్ డెల్ తుయు సిటీలోని దక్షిణ అట్లాంటిక్ మహాసముద్ర తీరాన అర్జెంటీనా ప్రజలు ఇళ్ళు నిర్మించుకున్నారు. వాటిలో ఒక రెండు అంతస్తుల భవనాన్ని తీరంలోని చిన్న కొండపై నిర్మించారు. అయితే జూలై 28వ తేదీన అట్లాంటిక్ మహాసముద్రం ఉగ్రరూపం దాల్చింది. ఆ సముద్రపు అలలు తీరప్రాంతాన్ని తాకాయి. సముద్రమట్టం విపరీతంగా పెరిగిపోవడంతో కొండ పైకి నీళ్లు చేరుకున్నాయి. సముద్రపు అలలు ఏకధాటిగా ఆ కొండను ఢీ కొట్టడంతో.. దానిపై నిర్మించిన భవనం చిగురుటాకులా వణికి పోయింది.

కొంత సమయం తర్వాత అలల దెబ్బకు ఆ భవనం పునాదులు కదిలిపోయాయి. దీంతో ఆ భవనం ఒక్కసారిగా సముద్రం వైపు వాలిపోయింది. ఈ క్రమంలోనే ఇంకో అల రావడంతో భవనం మొత్తం కుప్పకూలిపోయింది. క్షణాల్లోనే ఆ భవనం భయంకరమైన అలలలో తునాతునకలు అయ్యింది. అయితే, ఈ ఘటన జరిగిన సమయంలో భవనంలో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఇంటి యజమానులు ముందస్తుగానే ఖాళీ చేసి వెళ్ళిపోయారని సమాచారం.


భవనం కూలిపోతున్న దృశ్యాలను ఓ స్థానికుడు తన కెమెరాలో బంధించాడు. అనంతరం సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఈ వీడియోపై చాలా మంది నెటిజన్లు రకరకాల కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో సినిమాలోని సన్నివేశం కంటే అత్యంత భయానకంగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ ఒక్క ఘటన వల్ల చాలా ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఆస్తి నష్టం జరిగినా.. దేవుని దయవల్ల ప్రాణ నష్టం జరగలేదని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా, మహా సముద్రాల తీరాన నివసించడం ప్రాణాలకే ప్రమాదం.
Published by:Sridhar Reddy
First published: