రక్షాబంధన్ రోజున సోదరులు తమ కష్టసుఖాల్లో అండగా ఉండాలని ప్రతి ఆడబిడ్డ కోరుకుంటుంది. అన్నాచెల్లెళ్లు అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా రాఖీ పండుగ నిలుస్తుంది. రాఖీ కట్టిన సోదరికి సోదరులు గిఫ్ట్ లేదా నగదు ఇస్తుంటారు. ఈ రోజున సోదరీమణుల పర్సులు డబ్బులతో నిండిపోతుంటాయి. అయితే ప్రస్తుత డిజిటల్ వరల్డ్‌కి అనుగుణంగా కొందరు యువతులు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. సోదరుడు నగదు చేతికి ఇవ్వడం.. అవి తీసుకొని పర్సులో పెట్టుకోవడం వంటి రోజులు పోయాయంటున్నారు. రాఖీ వేడుకల్లో భాగంగా తన సోదరుడి నుంచి డబ్బులు నొక్కేసేందుకు ఒక యువతి ఏకంగా గూగుల్ పే క్యూఆర్ కోడ్‌నే వాడేసింది. ఈమె హారతి/పూజ పళ్లెంలో కానుకలను సేకరించేందుకు గూగుల్ పే క్యూఆర్ కోడ్ బోర్డ్ పెట్టేసింది. ఈ ఫోటోను ట్విట్టర్లో షేర్ చేయగా.. ప్రస్తుతం అది ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోంది.
సాధారణంగా రాఖీ పూజ పళ్లెంలో కుంకుమ, బియ్యం హారతి, స్వీట్స్, రాఖీ దారం పెడుతుంటారు. కానీ ఒక అమ్మాయి మాత్రం వీటితో పాటు గూగుల్ పే క్యూఆర్ కోడ్ స్టాండ్ బోర్డును సైతం పెట్టేసింది. ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లుగా ఒక సింగిల్ క్లిక్ తో పేమెంట్ చేస్తే సరిపోతుందన్నట్లుగా ఈ పూజ ప్లేట్‌ను రెడీ చేసింది.
ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట నవ్వులు పూయిస్తోంది. ఇప్పటి అమ్మాయిల ఆలోచనలు వేరే లెవల్లో ఉంటున్నాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. సోదరుల నుంచి డబ్బులు నొక్కడానికి అక్కాచెల్లెళ్లు కొత్త ఆప్షన్ కనిపెట్టేశారని పోస్టులు పెడుతున్నారు. మరికొందరు మాత్రం భారత ఆడబిడ్డలు డిజిటల్ ఇండియాని ప్రచారం చేస్తున్నారని ఫన్నీ కామెంట్స్ రాస్తున్నారు. ఒక నెటిజన్ మాత్రం.. యూట్యూబ్ క్యూఆర్ కోడ్ ఎడిట్ చేసి పెట్టారా? అని సందేహం వ్యక్తం చేశాడు. అయితే ఈ ప్రయత్నం చేసిన యువతి వివరాలు మాత్రం బయటకు రాలేదు.
ఆగస్టు 22న షేర్ చేసిన ఈ ట్వీట్ కి ఇప్పటికే 9 వేలకు పైగా లైకులు వచ్చాయి. దీనికి వేలకొద్దీ రీట్వీట్స్, వందలకొద్దీ కామెంట్స్ వచ్చాయి. నిజానికి ఈ రోజుల్లో పండుగలు, ఫంక్షన్లలో కానుకల సేకరణ పూర్తిగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ నగదు రహిత కానుకలు ఇచ్చిపుచ్చుకోవడానికే ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలో క్యూఆర్ కోడ్‌ను రాఖీ గిఫ్ట్ ప్రైజ్ కోసం వాడటం.. నెటిజన్లను ఆకర్షించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Raksha Bandhan, Sister love