తమ సమస్యల పరిష్కారం కోసం ఎత్తైన భవనాలు, కొబ్బరి చెట్ల మీద ఎక్కి ఆందోళనకు దిగడం ఎక్కడో ఒక చోట మనం చూస్తూనే ఉంటాం. తాజాగా ఓ వ్యక్తి కూడా తన సమస్య పరిష్కారం కోసం ఏకంగా ఎనిమిది గంటలు కొబ్బరి చెట్టు ఎక్కి కూర్చొని ఆందోళన చేశాడు. ఈ ఘటన కర్ణాటక కుడ్లిగి తాలూకా లో జరిగింది. మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో కుడ్లిగి గ్రామానికి చెందిన దొడ్డప్ప అనే వ్యక్తి చెట్టు ఎక్కి కిందకు దిగడానికి నిరాకరించాడు. దొడ్డప్ప, అతని భార్య మధ్య ఉన్న గొడవను గ్రామస్తులు పరిష్కరించకపోవడంతో మనోడు ఈ నిర్ణయానికి వచ్చి.. కొబ్బరి చెట్టు ఎక్కేశాడు. గ్రామస్తులు కొబ్బరి చెట్టు దిగమని అతన్ని ఎంత బతిమాలినా వినలేదు.
తన ముగ్గురు పిల్లల్ని సాకడం కష్టంగా మారిందని దొడ్డప్ప ఆవేదన వ్యక్తం చేశాడు. తన భార్య వస్తేనే చెట్టు దిగుతానని పట్టుబట్టాడు. దొడ్డప్పకు రెండు సార్లు వివాహం జరిగిందని... ఇప్పుడు అతన్ని వదిలిపెట్టింది రెండో భార్య అని గ్రామస్తులు " మొదటి భార్య గర్భం దాల్చకపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. రెండో భార్యతో దొడ్డప్పకు పదే పదే గొడవలు జరిగేవి. అందుకే ఆమె ఐదు ఏళ్ల క్రితం తన పుట్టింటికి వెళ్లిపోయింది" అని గ్రామస్తులు చెప్పుకొచ్చారు.
దొడ్డప్ప ఎంత సేపటికి కొబ్బరి చెట్టు దిగకపోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. మూడు గంటల చర్చల తర్వాత అతని భార్యను సంఘటనా స్థలానికి పోలీసులు తీసుకువచ్చారు. ఆ తర్వాత అగ్ని మాపక సిబ్బంది సాయంతో దొడ్డప్పను కిందకు తీసుకు వచ్చారు. అయితే, ఈ ఘటనపై ఎటువంటి కేసు నమోదు కాలేదని స్థానిక పోలీసులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka