భార్యాబిడ్డల్ని వదిలి కానరాని దేశం పోయిండు.. పైసలొస్తే మంచిగ బతుకొచ్చు అనుకున్నడు.. తాను కష్టపడ్డా ఇంటిల్లిపాది సుఖంగా ఉంటరని, కుటుంబం హాయిగా ఉంటదని ఆశపడ్డడు.. కానీ, ఎడారి దేశంలో ఆయన బతుకు ఎడారైంది. యజమాని జీతం ఇవ్వకపోగా, తిండిపెట్టకపోవడంతో నరకం అనుభవిస్తున్నడు. తిండి లేక, ఒంటి మీద సరిగ్గా బట్టలు లేక, నా బాధ ఇదీ! అని చెప్పుకుందామంటే ఎవ్వరూ లేక అరిగోస పడుతున్నడు. కరీంనగర్ జిల్లా తుమ్మాపురానికి చెందిన ఓ వ్యక్తి బతుకుదెరువు కోసం రెండేళ్ల క్రితం అబుదాబి వెళ్లాడు. అక్కడ ఓ వ్యక్తి వద్ద పనికి కుదిరాడు. ఆ వ్యక్తికి చెందిన వంద ఒంటెలను చూసుకోవడం ఇతని పని. అయితే ఈ రెండేళ్లలో అతను సంపాదించుకున్నదాని కంటే పోగొట్టుకున్నదే ఎక్కువ. జీతం ఇవ్వక, తిండి పెట్టక హింసిస్తున్నారని బాధితుడు వాపోతున్నాడు. ఈ మేరకు తన బాధను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు వీడియో ద్వారా చెప్పుకొంటున్న సంభాషణలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
ఏడారీ బతుకులకూ
దిక్కవ్వరాదన్న..
నీ @KTRTRS
సహాయం కోసం నీరిక్షణ.. 😔#Telangana pic.twitter.com/KosivSuGMg
— వొడువని ముచ్చట.! 🎯 (@voduvanimuchata) May 8, 2019
‘సార్..నన్ను ఒంటెల వద్ద ఉంచుతున్నరు. మా యజమాని వద్ద వంద ఒంటెలు ఉన్నయ్. వాటిని నేనొక్కడినే చూసుకోవాలె. పొట్టుపొట్టు కొట్టిండు. దవడపై కొట్టడంతో ఏం మాట్లాడలేకపోతున్న. దయచేసి నేను మన దేశం వచ్చేటట్టు చూడుర్రి. ఒంటెల్లో ఒక ఒంటె చనిపోవడంతో యజమాని చావగొట్టిండు. మాది కరీంనగర్ జిల్లా తుమ్మాపురం మండలం. మేం గరీబోళ్లం. నా అవతారం, పరిస్థితి చూడుర్రి. అబుదాబికి వచ్చి రెండేళ్లు అయితుంది. అబుదాబికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటున్నం. ఇక్కడ కరెంట్ కూడా ఉండది. ఎట్లా సార్? ఏం చేయమంటరు? మా అమ్మ చనిపోతే అగ్గి పెట్టడానికి కూడా పంపలేదు. దయచేసి నేను ఇంటికి వచ్చేలా చూడుర్రి. ఎంత పని చేసినా మాకు సరిగ్గా తిండి పెడ్తలే. నా కుమారులు, భార్య హాస్పిటల్లో ఉన్నరు. వాళ్లను చూడటానికి కూడా నన్ను పంపుతలేరు’ అని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ వీడియోను ఓ నెటిజన్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు ట్యాగ్ చేశారు. దాంతో కేటీఆర్ వెంటనే స్పందించారు. ‘ఈ విషయంలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ను సాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. అతన్ని ఎలాగైనా విడిపించి భారత్‌కు వచ్చేలా చూడండి’ అని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dubai, Karimnagar S29p03, Sushma Swaraj, Telangana, Telangana Government, Telangana News, Telangana updates, Twitter, Viral Videos