ఈ ప్రపంచంలో తల్లి ప్రేమకు మించింది ఏదీ లేదు. మన లైఫ్ లో ఎంత మంది కొత్త వ్యక్తులు వచ్చి మనకు ప్రేమను పంచినా అది తల్లిప్రేమ ముందు దిగదుడుపే. తన బిడ్డలను కాపాడుకోవడంలో తల్లి తర్వాతే ఎవరైనా. బిడ్డలు ఆపదలో ఉన్నారంటే తన సర్వస్వం మరీ ధారపోసి వారిని రక్షించడంలో ఆమె చూపే తెగువ.. ఆప్యాయత.. బిడ్డలను కాపాడుకోవాలన్న తాపత్రాయం.. అందుకోసం ఎంతటి ఆపదనైనా తట్టుకునే ధైర్యం ఆమెకు మాత్రమే సొంతం. అందుకే సృష్టిలో అమ్మ ప్రేమకు అంత ప్రాధాన్యత ఉంది. మనిషైనా.. మూగ జీవులైనా.. తల్లి తల్లే.. అమ్మ ప్రేమ.. అమ్మ ప్రేమే. ఎందుకంటే.. ఆమె తల్లి గనుక.
ట్విట్టర్ లో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కు చెందిన అధికారి సుధా రామెన్ ఒక వీడియో పోస్ట్ చేశారు. ఆ పోస్టులో వాన కురుస్తుండగా.. ఒక కోడి తన పిల్లలను కాపాడుకుంటున్న దృశ్యం అందరినీ ఆకట్టుకుంటున్నది. తన మీద వాన కురుస్తున్నా తట్టుకుని.. తన పిల్లలను మాత్రం తన రెప్పల కాపాడుకుంది ఆ తల్లి కోడి.
ఈ వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారింది. ఈ వీడియోను షేర్ చేస్తూ సదరు అధికారి ఇలా రాశారు.. ‘ఎందుకంటే ఆమె తల్లి గనుక...’. 18 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన నెటిజన్లు అమ్మ ప్రేమకు ఇంతకన్నా సాక్ష్యం ఏం చూపగలం...? బిడ్డల పట్ల తనకున్న ప్రేమను ఎలా కొలవగలం..? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అవును.. అమ్మప్రేమను దేనితో కొలవగలం....?
Published by:Srinivas Munigala
First published:January 20, 2021, 23:01 IST