Viral Video: మనసుకు హత్తుకునే దృశ్యం..వ‌ర్షంలో తడవకుండా కుక్కకు గొడుగు పట్టిన చిన్నారి..

Photo Credit : Twitter

Viral Video : చిన్నారులు దైవంతో సమానం అంటారు. వారి హృదయాలు ఎంత సున్నితంగా ఉంటాయో తెలిసిందే. ఎవరైనా కష్టాల్లో ఉంటే చాలు వెంటనే కరిగిపోతారు. అది తోటి మనిషైనా, జంతువైనా.. సాయం చేయడానికి ముందుకొస్తారు. ఇందుకు ఈ ఘటనే నిదర్శనం.

  • Share this:
మానవత్వం, మంచితనాన్ని నిరూపించుకోడానికి పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరం లేదు. సందర్భానుసారం చేసే కొన్ని పనులే మనలోని మంచితనాన్ని బయటకు చాటుతాయి. మనుషుల్లో ఉండే కాస్తంత జాలి, ద‌య వంటి గుణాలు వారికి ప్రత్యేకతను తీసుకువస్తాయి. తాజాగా ఇలాంటి దయా గుణంతో వార్తల్లో నిలుస్తోంది ఒక చిన్నారి. తన కుక్క వర్షంలో తడవకుండా, దానికి గొడుగు పట్టి తాను వర్షంలో మద్దయి పోయింది. తనకంటే ఎక్కువగా కుక్కకు ప్రాధాన్యం ఇచ్చిన ఈ చిన్నారిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీన్ని ఇండియ‌న్ ఫారెస్ట్‌ స‌ర్వీసెస్ అధికారి శుశాంత్ నంద ట్విట్ట‌ర్‌లో షేర్ చేశారు.

* వీడియోలో ఏముంది?
ఈ ప‌న్నెండు సెక‌న్ల‌ వీడియోలో ఒక పాప త‌న కుక్కతో కలిసి వెళ్తున్నట్టు కనిపిస్తోంది. ముందు ఉన్న కుక్క వ‌ర్షంలో త‌డిసిపోకుండా ఆమె ద‌గ్గ‌రున్న గొడుగును అడ్డుపెడుతుంది. అంతేకాదు.. ఈ కుక్క కంగారుగా అటు ఇటూ క‌దులుతున్నా చిన్నారి మాత్రం దాన్ని వ‌దిలేయ‌లేదు. అది వర్షంలో తడవకుండా గొడుగు పట్టి కాపాడింది. ఐఎఫ్ఎస్ ఆఫీస‌ర్ శుశాంత్ నంద ఈ పోస్ట్‌కు క్యాప్ష‌న్ పెట్టారు. ‘ఇత‌రుల కోసం చిన్న చిన్న పనులు చేయ‌డ‌మే ద‌య‌. అది మనం చేయ‌గ‌లిగిందే’ అని పేర్కొన్నారు. ఇప్పటికే వేల కొద్దీ వ్యూస్, లైక్స్ సాధించిన ఈ వీడియో ఎంతోమందిని ఆకట్టుకుంటోంది. చిన్న‌త‌నంలోనే ఈ చిన్నారి తోటి జీవుల‌ను ప్రేమించ‌డం గొప్ప విషయమని పలువురు ప్రశంసిస్తున్నారు.


ఈ వీడియో ఇప్పుడు ఇంట‌ర్నెట్‌లో చ‌క్క‌ర్లు కొడుతోంది. ఈ చిన్నారి, కుక్కపై చూపించిన ప్రేమ‌ను నెటిజన్లు కొనియాడుతున్నారు. ప్రేమ, దయ వంటివి చిన్నప్పటి నుంచే పిల్లలకు అలవడేలా పెద్దవాళ్లు జాగ్రత్తలు తీసుకోవాలని వీడియోకు కామెంట్లు పెడుతున్నారు. ‘ఈ పాప మ‌న‌సు బంగారం. బాధితుల‌కు స‌హాయం చేసే ర‌కం ఈ చిన్నారి’ అని ఒక యూజర్ వీడియోకు కామెంట్ పెట్టారు. మ‌రో వ్య‌క్తి త‌న కామెంట్‌లో ‘ఇంత విశాల హృద‌యం ఉన్న పాప‌కు ధన్యవాదాలు. ఆమెకు నా దీవెనలు అందిస్తున్నాను’ అని రాశారు. జంతువుల ప‌ట్ల జాలి చూపిస్తే ఎంతో సంతృప్తిగా ఉంటుందని పేర్కొన్నారు మ‌రో జంతు ప్రేమికురాలు. చిన్నతనంలోనే మంచిత‌నాన్ని నేర్పిన ఈ పాప త‌ల్లిదండ్రులను నెటిజన్లు ప్ర‌శంసిస్తున్నారు.
Published by:Sridhar Reddy
First published: