భారత్ లో సుమారుగా రెండు నెలలుగా ఉత్తరాదిని చలి వణికిస్తున్నది. ఉత్తర భారతదేశం అంతా చలి గుప్పిట్లోనే ఉంది. ఇక దక్షిణాది విషయానికొస్తే.. దక్షిణ భారత ముఖద్వారమైన తెలంగాణలో గడిచిన నెల రోజులుగా మనకు కూడా చలి తీవ్రత ఎక్కువగానే ఉంది. వారం రోజులుగా రాత్రి ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల నుంచి 4 డిగ్రీల దాకా పడిపోతున్నాయి. ఇక నగరాలలో వీస్తున్న చలికి.. జనమంతా పొద్దెక్కిన మంచాలనుంచి దిగడం లేదు. ఆదిలాబాద్ వంటి అటవీ ప్రాంతాలను వదిలిపెడితే.. హైదరాబాద్ వంటి మహా నగరాలలో వీస్తున్న చలికే మనం తట్టుకోలేక గజగజ వణుకుతున్నాం. అలాంటిది మైనస్ డిగ్రీ ఉష్ణోగ్రతలలో ఎవరైనా ఉంటే వారి పరిస్థితేంటి..? ఉండటమే కాదు... వారంతా మంచు తుఫాను కురిసే రాత్రి పూట మైనస్ -39 డిగ్రీ సెల్సియస్ వద్ద డాన్స్ లు చేస్తే.. అది కూడా బట్టల్లేకుండా.. ఊహించడానికే ఒళ్లు గగుర్పొడిస్తుంది కదా..! అందుకే అన్నారు పైత్యం పరి పరి విధములు అని. వీరి పైత్యమేంటో చూద్దాం పదండి..
సైబీరియా తెలుసు కదా.. రష్యాలో మూడో అతిపెద్ద నగరం. ఆ ప్రాంతమంతా నిత్యం మంచుదుప్పటి కప్పేసి ఉంటుంది. అత్యంత శీతలమైన ప్రాంతం కూడా. అక్కడ సాధారణ ఉష్ణోగ్రతలే చాలా దారుణంగా ఉంటాయి. ఇంకా చలికాలంలో అయితే ఒక్కోసారి మైనస్ 50 డిగ్రీలు దాటిన సందర్భాలు కోకొల్లలు. కాగా.. ఇంతటి గడ్డకట్టే చలిలో కూడా కొంతమంది యువకులు ఒక సాహసానికి ఒడిగట్టారు. రాత్రి 11 గంటల సమయంలో ఒక ప్రదేశానికి చేరుకుని అక్కడ మహిళలు బికినీలు వేసుకుని.. మగవాళ్లు నిక్కర్లు వేసుకుని చిందులేశారు.
దాదాపు ఇరవై మంది సభ్యులున్న ఆ బృందం ఒక క్రేజీ పార్టీ చేసుకుంది. ఆ బృందంలో ఉన్న ఒక సభ్యుడి పుట్టినరోజు కావడంతో.. వాళ్లంతా ఆ రోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలని అనుకున్నారు. అనుకున్నదే తడువుగా.. సైబీరియాలోని టాంస్క్ లో గల ఒక నగరానికి వెళ్లి.. రాత్రి పూట అక్కడ ఒంటిమీద లోదుస్తులు తప్ప అన్నీ విప్పేసి చిందులు వేశారు. ఈ బృందంలో పలువురు మహిళలు కూడా ఉండటం గమనార్హం.
మంచు కూడా గడ్డకట్టే చలిలో బర్త్ డే పార్టీ జరుపుకున్న ఆ సభ్యులు.. ఆ పై చాలాసేపు డాన్సులు చేస్తూ కింద మంచు కురుస్తున్నా అందులోని ఎంజాయ్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆ బృందంలోని ఒక సభ్యుడు పోస్ట్ చేశాడు.
ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై భిన్న కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. పలువురు వారి సాహసానికి మెచ్చుకుంటుంటే.. మరికొంతమందేమో.. ‘మీకేమైనా పిచ్చా...?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అంతటి చలిలో పార్టీలు చేసుకోవడం అవసరమా..? అంటూ తిట్టిపోస్తున్నారు. ఎవరేం అనుకున్నా.. తాము మాత్రం ఎంజాయ్ చేశామని ఆ బృందంలోని సభ్యులు చెబుతుండటం విశేషం.
Published by:Srinivas Munigala
First published:December 29, 2020, 21:49 IST