మనది అనుకున్నది ఎప్పటికైనా మనల్ని చేరుతుందని పెద్దలు చెబుతుంటారు. కానీ మనదనుకున్న సొత్తు వేరే వారి సొంతం అయితే పడే బాధ వర్ణనాతీతం అని చెప్పవచ్చు. దాన్ని తిరిగి పొందేందుకు చాలామంది ప్రయత్నిస్తారు. అలా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అరవై సంవత్సరాల పాటు తన భూమి కోసం పోరాటం చేశాడో రైతు. చివరికి అతడి పోరాటం ఫలించి భూమిని అతడికి అందించింది ప్రభుత్వం. రూ.కోట్లు విలువ చేసే ఆ పొలాన్ని చూసి ఇప్పుడు ఆనందంతో తడిసి ముద్దవుతున్నాడా వ్యక్తి. అసలు ఏం జరిగిందో తెలియాలంటే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
మధ్య ప్రదేశ్లోని రత్లామ్‌లో నివసించే గిరిజన రైతు తవార్ కొన్ని దశాబ్దాల నుంచి తనకు రావాల్సిన భూమి కోసం పోరాటం చేస్తున్నాడు. 1961లో తవార్ తండ్రికి ఉన్న 16 బిగాల (దాదాపు నాలుగున్నర ఎకరాలు) పొలాన్ని చాలా తక్కువ ధరకే ఆయన దగ్గరి నుంచి కొనేశారు కొంతమంది. చదువుకోని తమ తండ్రి అమ్మిన ఆ భూమిని వారి నుంచి తిరిగి పొందేందుకు ప్రయత్నించారు కొడుకులు తవార్, మంగల, నానూ రామ్. కానీ ఎలాంటి ఫలితం లేకపోయింది. 1961లో ప్రభుత్వ సహాయంతో ఈ సేల్ డీడ్‌ను క్యాన్సిల్ చేయించారు. అయితే సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ దీన్ని 1987లో క్యాన్సిల్ అయితే చేశారు కానీ.. భూమి డాక్యుమెంట్లపై ఈ అన్నదమ్ముల పేర్లు మాత్రం రికార్డు చేయలేదు.
అప్పటి నుంచి ఈ ముగ్గురు అన్నదమ్ములు కోర్డులు, ఆఫీసుల చుట్టూ తిరుగుతూ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. చాలా వాదనల తర్వాత కోర్టులు కూడా వారి పక్షానే తీర్పును వెలువరించాయి. కానీ భూమి పత్రాలపై మాత్రం పేరు మార్పు జరగలేదు. దీంతో ఆఖరికి విసుగు చెందిన ఈ అన్నదమ్ములు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి తమ భూమిని తమకు తిరిగి అప్పగించాలని వినతి పత్రం అందించారు.
వారి పూర్తి కథ విన్న కలెక్టర్ కుమార్ పురుషోత్తం వెంటనే ఆశ్చర్యపోయారు. ఇన్నేళ్ల నుంచి వారి పోరాటం గురించి తెలుసుకొని ఈ భూమి వారి పేరిట రిజిస్టర్ చేయాలని వారం లోపు ఈ భూమిని వారికి అప్పగించాలని అధికారులను ఆదేశించారు. దీంతో జూలై 8న వారి భూమి పత్రాలు ఈ అన్నదమ్ములకు చేరాయి. అంతే కాదు.. వారి భూమి విలువ కొన్ని కోట్ల రూపాయలు ఉంటుందని కూడా అధికారులు వారికి వెల్లడించారు.
ఈ విషయం గురించి దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. మధ్య ప్రదేశ్ సీఎం శివ్ రాజ్ సింగ్ చౌహాన్ కూడా కలెక్టర్ ఇలాంటి విషయాలను కూడా పట్టించుకోవడం హర్షణీయం అంటూ ఆయనపై ప్రశంసల జల్లు కురిపించారు. ఇప్పటి వరకు రోజు వారీ కూలీలుగా ఉండి కోర్టుల్లో, ఆఫీసుల్లో న్యాయం కోసం పోరాడిన ఈ రైతు కుటుంబాలు ఇప్పుడు తమ భూమి తమకు తిరిగి రావడం ఎంతో ఆనందంగా ఉందని వెల్లడిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farmer, VIRAL NEWS