news18
Updated: November 11, 2020, 2:43 PM IST
image credits ANI
- News18
- Last Updated:
November 11, 2020, 2:43 PM IST
దృఢ సంకల్పం ఉంటే మనిషి అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చు. మనం సాధించవలసిన లక్ష్యం.. అందుకు మనం చేసే ప్రయత్నాలే మన విజయాన్ని, భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. మనను ఉన్నత స్థాయిలో నిలబడతాయి. లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురైనా.. వాటిని దాటుకుని విజయాన్ని ముద్దాడినప్పుడే అసలైన విజయం. అబ్బే.. ఇవన్నీ మనతో కావులెండి.. అంటారా..? అయితే ఈ బాలుడిని చూసి మీలో మీరు స్ఫూర్తి నింపుకోండి. రెండు కాళ్లు ఉన్న వాళ్లే ఫుట్ బాల్ ఆడటానికి తడబడుతుంటే.. ఒక్క కాలుతోనే ఫుట్ బాల్ ఆడుతున్నాడు. ఒక్క ఫుట్ బాలే కాదు.. సైకిల్ తొక్కడం.. బడికెళ్లడం.. అన్నీ ఒక్క కాలుతోనే.. ఇంతకీ ఎవరా బాలుడు..?
మణిపూర్ రాజధాని ఇంపాల్ కు చెందిన కునాల్ శ్రేష్ట.. నాలుగో తరగతి చదువుతున్నాడు. వయసు తొమ్మిదేండ్లు. పుట్టినప్పుడే ఒక కాలు లేకుండానే పుట్టాడు. శాశ్వత అంగవైకల్యం. కానీ అతని తల్లిదండ్రులు ఎప్పుడూ ఆ లోటు తో కునాల్ ను పెంచలేదు. ధైర్యం నూరిపోశారు. ప్రత్యేకమైన వ్యక్తులంతా.. ప్రత్యేక లక్షణాలతోనే పుడతారని తల్లి చెప్పింది. తనకు కాలు లేదనే విషయం తెలియకుండా నాన్న పెంచాడు. ఆ తల్లిదండ్రులిద్దరూ ఆ పిల్లాడికి తాను అవయవలోపంతో బాధపడుతున్నాననే ఊహే రానివ్వకుండా పెంచుతున్నారు.
తల్లిదండ్రుల నమ్మకాన్ని కునాల్ శ్రేష్ట ఏనాడు వమ్ము చేయలేదు. చదువుల్లో ఫస్ట్. కానీ విచిత్రంగా అతడు ఫుట్ బాల్ కూడా ఆడుతున్నాడు. అదీ ఒంటికాలితో.. చేతికింద క్రచ్ తో.. అతడు ఫుట్ బాల్ ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
ఇదే విషయమై కునాల్ మాట్లాడుతూ... ‘నాకు ఫుట్ బాల్ ఆటంటే చాలా ఇష్టం. ఈ ఆట ఆడే కొత్తలో నేను కొంచెం ఇబ్బందులు పడ్డాను. నేను ఆడగలనో లేనో అని చాలా భయమైంది. కానీ ఇప్పుడు నాకు ఆ బాధ లేదు. చాలా ఆత్మవిశ్వాసంతో ఉన్నాను. నా స్నేహితులంతా నాకు చాలా మద్దతిస్తున్నారు. త్వరలోనే నేను గోల్ చేస్తాను..’ అంటూ ఆశాభావం వ్యక్తం చేశాడు.
కాగా.. కునాల్ ఆత్మస్థైర్యాన్ని చూసి నెటిజన్లు ముచ్చట పడుతున్నారు. ఈ బాలుడు ఎప్పటికైనా మంచి పొజిషన్ లో ఉంటాడని అభినందిస్తున్నారు. ఏదీ అసాధ్యం కాదు అని ఈ బాలుడి ద్వారా మరసారి నిరూపితమైందని ఒక ట్విట్టర్ యూజర్ ట్వీట్ చేశాడు.
Published by:
Srinivas Munigala
First published:
November 11, 2020, 2:43 PM IST