మనం ప్రతి రోజు స్నానం చేస్తాం. ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకొని.. టీ తాగిన అనంతరం.. స్నానం చేయడం చాలా మందికి అలవాటు. కొందరైతే రోజు రెండు సార్లు కూడా స్నానం చేసుకుంటారు. అంతేకాదు ఆరోగ్యంగా ఉండేందుకు చాలా మంది ఏవేవో జాగ్రత్తలు తీసుకుంటాం. తిండి నుంచి వర్కవుట్స్ వరకు.. అన్ని విషయాల్లోనూ పక్కాగా ప్లాన్ చేసుకుంటారు. ఐనప్పటికీ ఏదో ఒక అనారోగ్య సమస్య వేధిస్తుంది. కానీ ఓ వ్యక్తి మాత్రం ఇవేవీ లేకుండానే ఆరోగ్యంగా జీవిస్తున్నాడు. అతడు అస్సలు స్నానమే చేయడు. మాసిన బట్టలే వేసుకుంటాడు. మనం రెండు రోజులు స్నానం చేయకుంటేనే కంపు కొడుతుంది. కానీ అతడు మాత్రం 67 ఏళ్లుగా స్నానం చేయడం లేదు. ఎలాంటి శుభ్రత పాటించకుండా..పోషకాహారం తినకుండా.. 87 ఏళ్ల వయసులోనూ దిట్టంగా ఉన్నాడు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. అసలు ఇదెలా సాధ్యమైందో శాస్త్రవేత్తలకు కూడా అంతు చిక్కడం లేదు.
ఇరాన్‌కి చెందిన అమో జాజి వయసు 87 ఏళ్లు. ఇతడికి ఇల్లు లేదు. కుటంబం లేదు. దేజ్గా గ్రామంలో రోడ్డు పక్కనే తింటాడు. రోడ్డు పక్కనే పడుకుంటాడు. అంతేకాదు అమో జాజి 67 ఏళ్లుకు పైగా స్నానమే చేయలేదట. బట్టలు కూడా సరిగ్గా ఉండవు. మురికి పట్టిన దుస్తులనే ధరిస్తాడు. మాసిన జట్టుతోనే నివసిస్తున్నాడు. స్నానం లేకున్నా.. బట్టలు లేకున్నా.. సరైన ఆహారమైతే తీసుకోవాలి కదా..! కానీ అమో జాజి.. తిండి గురించి కూడా పెద్దగా ఆలోచించడు. గ్రామాల్లో దొరికే పందికొక్కులు, కుందేళ్లు వంటి జంతువులను వేటాడి తింటాడు. నీటి కుంటల్లో ఉన్న నీటినే తాగుతాడు. ఒక్కోసారి అవి దొరక్కపోతే.. చెత్త కుండీల్లో ప్రజలు వేసిన.. కుళ్లిపోయిన ఆహారాన్నే ఇష్టంగా తింటాడు. ఇదే అతడి జీవన శైలి. కొన్నేళ్లుగా ఇదే ఫాలో అవుతున్నాడు.
అమో జాజి ఒంటరిగానే గడుపుతాడు. ఎవరితోనూ మాట్లాడడు. దొరికింది తినడం.. పడుకోవడం.. ఇదే అతడికి తెలుసు. ఇంకేమీ చేయడు. ఇతడు చాలా కాలం సొరంగంలోనే జీవించాడట. ఐనప్పటికీ ఎంతో ఆరోగ్యంగా ఉన్నాడు. ఇతడిని చూసి వైద్యులు, శాస్త్రవేత్తలు ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదెలా సాధ్యమని నోరెళ్లబెట్టుతున్నారు. అమో జాజి విచిత్ర జీవనశైలిని చూసి విస్తుపోయిన గ్రామస్తులు.. అతడి కోసం ఓ పూరి గుడిసెను నిర్మించారు. ప్రస్తుతం అతడు అక్కడే ఉంటున్నారు. ఇప్పుడు పూరి గుడిసెలో ఉంటున్నా.. లైఫ్ స్టైల్ మాత్రం ఏ మాత్రం మారలేదు. అవే బట్టలు..అదే తిండి..!
అమో జాజి గురించి తెలుసుకున్న కొందరు స్వచ్ఛంద సంస్థల వారు అతడికి వద్దకు వెళ్లి ఆరాతీశారు. ఏం తింటావు? ఏం చేస్తావు? అని అడిగి తెలుసుకున్నారు. ఇటీవల టెహ్రాన్‌లోని స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కి సంబంధించిన పారాసిటాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆ వృద్ధుడికి వైద్యపరీక్షలు నిర్వహించారు. అతడు 67 ఏళ్లుగా స్నానం చేయకపోయినప్పటికి.. శరీరంలో ఎలాంటి పరాన్నజీవులు, బ్యాక్టీరియాలు గానీ లేవని తెలిపారు. అతను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాడని ధృవీకరించారు. అమో జాజి గురించి తెలిసి చాలా మంది చూసేందుకు వస్తున్నారు. ఐతే అతడిని ఇబ్బంది పెట్టవద్దని స్థానిక గవర్నర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మనం ఎన్నో రకాల జాగ్రత్తలు.. మంచి పోషకాహారం తీసుకున్నా.. ఏవేవో రోగాలు వస్తుంటాయి. కానీ ఇవేమీ లేకుందా అపరిశుభ్రంగా బతుకుతున్న అమో జాజి ఆరోగ్యంగా ఉండడం అందరికి ఆశ్చర్యం కలిగిస్తోంది.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.