మనుషుల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన వ్యాపకం ఉంటుంది. ఎన్ని అవరోధాలు ఎదురైనా కొంతమంది వాటిని వదులుకోవడానికి ఇష్టపడరు. అలాంటి వ్యక్తి ఒకరు తాజాగా వార్తల్లో నిలిచారు. సాధారణంగా సెలబ్రిటీలు వివిధ కంపెనీలకు చెందిన లగ్జరీ కార్లను సేకరించడం అలవాటుగా పెట్టుకుంటారు. ధరలను లెక్కచేయకుండా ఇష్టంతోనే వాటిని సొంతం చేసుకుంటారు. వియన్నాకు చెందిన 80ఏళ్ల ఒట్టొకర్ జె అనే వ్యక్తి ఏకంగా 80 లగ్జరీ కార్లను సేకరించి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా అతడు 80వ పోర్స్చే బాక్స్టర్ స్పైడర్ (Porsche Boxster Spyder) కారు కొన్నాడు. అతడికి గత కొన్ని దశాబ్దాలుగా ఈ అలవాటు ఉంది.
1972లో ఒట్టొకర్ మొట్టమొదటి పోర్స్చే కారును కొన్నాడు. అప్పటి నుంచి తన గ్యారేజీని వివిధ పోర్స్చే మోడళ్లతో నింపుతూనే ఉన్నారు. వీటిని ఒకేదగ్గర పెట్టడానికి ప్రత్యేకంగా ఒక భవనాన్ని సైతం నిర్మించారు. దాదాపు 50ఏళ్ల క్రితం ఒకరోజు అతడు రోడ్డుపై వెళ్తుండగా పోర్స్చే కారు వేగంగా దూసుకెళ్లిందట. అప్పటి నుంచి వాటిపై ఇష్టం పెరిగింది. ప్రత్యేకంగా వాటి కోసమే డబ్బు ఆదా చేయడం మొదలుపెట్టాడు. అనంతరం మొట్టమొదటి పోర్స్చే స్పీడ్ ఎల్లో 911 E కారును కొనుగోలు చేశాడు.
అరుదైనవి ఉన్నాయి
ఒట్టొకర్ తాజాగా మియామి బ్లూ కలర్ పోర్స్చే బాక్స్టర్ స్పైడర్ కారును సొంతం చేసుకున్నాడు. దీనికి అతడే మొట్టమొదటి కస్టమర్ కావడం విశేషం. పోర్స్చే కంపెనీకి చెందిన జుఫెన్హౌసెన్ ఫ్యాక్టరీ నుంచి దాన్ని కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఆయన గ్యారేజీలో 38 వేర్వేరు పోర్స్చే మోడల్ కార్లు ఉన్నాయి. వాటిలో రేస్ కార్లు, ఎనిమిది సిలిండర్ల ఇంజిన్ ఉండే పోర్స్చే 910, 917, 956, 904, 964 కప్... వంటి అరుదైన మోడళ్లు ఉన్నాయి. ఇప్పటి వరకు తొమ్మిది వెర్షన్ల కారెరా ఆర్ ఎస్ (Carrera RS) మోడళ్లను సేకరించాడు. ఫోర్సే కయోన్నె కారులో పాన్ అమెరికన్ హైవేపై వెళ్లాలని అతడు ప్రణాళిక వేస్తున్నాడు. ఇంతటితో ఆగిపోకుండా మరికొన్ని కార్లను సేకరిస్తానని ఒట్టొకర్ చెబుతున్నాడు.
Published by:Kishore Akkaladevi
First published:December 24, 2020, 13:39 IST