అమెరికాలోని మిస్సౌరీలో ఉన్న సెయింట్ లూయిస్ జంతుప్రదర్శనశాలలో ఓ వింత సంఘటన చోటుచేసుకుంది. జంతుప్రదర్శనశాలలోని 62 ఏళ్ల బాల్ పైథాన్ అనే కొండచిలువ ఏడు గుడ్లు పెట్టింది. దీంట్లో విచిత్రం ఏముంది అనుకుంటున్నారా? కనీసం రెండు దశాబ్దాలుగా అది ఒంటరిగా ఉంటుందట. మగ పైథాన్ జత లేనప్పటికీ అది గుడ్లు ఎలా పెట్టిందో తెలియక జూ అధికారులు ఆశ్చర్యపోతున్నారు.
ఈ వింత సంఘటనపై జూ హెర్పెటాలజీ (పాముల అధ్యయన శాస్త్రం) మేనేజర్ మార్క్ వాన్నర్ స్పందించారు. ఇది అసాధారణమేమీ కాదని ఆయన చెప్పారు. "బాల్ పైథాన్లు, కొమొడో డ్రాగన్లు, కొన్ని రకాల ర్యాటిల్ స్నేక్స్ అలైంగిక పునరుత్పత్తి (మగజాతి అవసరం లేకుండా పునరుత్పత్తి)సామర్థ్యం కలిగి ఉంటాయి. ఇది అప్పుడప్పుడూ జరిగేదే" అని వివరించారు. అయితే ఇక్కడ ఇంకో విచిత్రం ఉంది. ఈ రకం కొండచిలువలు 60ఏళ్లు దాటిన తరువాత గుడ్లు పెట్టడం అసాధారణమే. "నాకు తెలిసి ఎక్కువ వయసులో గుడ్లు పెట్టిన కొండచిలువగా దీని పేరుమీదే రికార్డు ఉంటుంది. సాధారణంగా బాల్ పైథాన్లు 60 ఏళ్ళకు చేరుకోవడానికి ముందే గుడ్లు పెట్టడం మానేస్తాయి" అని వాన్నర్ చెబుతున్నాడు.
ఆ కొండచిలువ జూలై 23న ఏడు గుడ్లు పెట్టిందని జూ అధికారులు తెలిపారు. అందులో మూడు గుడ్లను ఇంక్యుబేటర్లో పొదిగిస్తున్నారు. మరో రెండింటిని జన్యు నమూనాల సేకరణకు ఉపయోగించారు. మిగిలిన రెండు గుడ్లలోని పిండాలు చనిపోయాయి. ఇక, జన్యు నమూనా విశ్లేషించిన తరువాతే గుడ్లు లైంగిక లేదా అలైంగిక పునరుత్పత్తి ద్వారా ఏర్పడ్డాయో తెలియనుంది. ఫలదీకరణ కోసం ఆడ పాములు తమ శరీరంలో మగ పాము వీర్యాన్ని దాచుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అక్కడి జంతుప్రదర్శనశాలలో 31ఏళ్ల మరో మగ బాల్ పైథాన్ కూడా ఉంది. కానీ వాటిని ప్రజల సందర్శనకు పెట్టలేదు. ఈ ఆడ పైథాన్ను 1961లో ఓ వ్యక్తి జూకు ఇచ్చాడు. ఇది ఆఖరిసారిగా 2009లో గుడ్లు పెట్టింది. కానీ వాటిలో పిండాలు చనిపోయాయి. అంతకుముందు 1990లో ఓసారి గుడ్లు పెట్టిందని జూ అధికారులు తెలిపారు. పాముల బోనులను సిబ్బంది శుభ్రం చేసేటప్పుడు అన్ని పాములను కలిపి బకెట్లో ఉంచుతారట. అప్పుడు మేటింగ్ ద్వారా ఈ ఆడ పాము గర్భం దాల్చి గుడ్లు పెట్టి ఉండొచ్చని అప్పట్లో జూ సిబ్బంది భావించారు.
Published by:Narsimha Badhini
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.