పెళ్లికాని ప్రసాద్‌ల బాధలు ఏ రేంజ్ లో ఉంటాయో చాలా మందికి తెలిసే ఉంటది. వయసు మీదపడే కొద్దీ ఆప్షన్లు తగ్గిపోతూ చివరికి ఎలాగైతే అలా.. ఆ మూడు ముళ్లు వేస్తే చాలనుకునే కేసులకు కొదువలేదు. అదిగో ఆ కోవకు చెందినవాడే రంగారెడ్డి జిల్లా యాచారానికి చెందిన బాధితుడు. 40 ఏళ్ల వయసులో ఆయన చేసుకున్న తొలి వివాహం అది దారుణంగా గంటల వ్యవధిలోనే బెడిసికొట్టింది. కాళ్ల పారాణి ఆరకముందే.. కనీసం నోరారా ‘దొరక్క దొరక్క దొరికింది.. తళుక్కు చిలక ఇది..’అనే పాట పూర్తి చేసేలోపే ఆ పెళ్లికొడుక్కి భారీ షాక్ తగిలింది. వివాహం చేసుకుని ఇంటికి తీసుకొచ్చిన కొద్దిసేపటికే.. ఇల్లాలిగా వచ్చిన ఆమె ఇంటిని దోచేసింది. చేతికందినకాడికి డబ్బు, బంగారంతో ఉడాయించింది. రంగారెడ్డి జిల్లా యాచారంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలివి..
వయసు మీరిపోతోంది.. ఎలాగైనా ఓ ఇంటివాడిని కావాలనే తాపత్రయం ఆ వ్యక్తి ఇల్లు గుల్ల కావడానికి కారణమైంది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో సినీ ఫక్కీలో పెళ్లి మోసం జరిగింది. ఎంతకూ పెళ్లి సంబంధాలు కుదరకపోవడంతో ఓ యువకుడు(40) మిత్రుడి ద్వారా పెళ్లిళ్ల బ్రోకర్ ను ఆశ్రయించాడు. ముందూ వెనుకా ఎవరులేని ఓ అమ్మాయి విజయవాడలో ఉందని.. రూ.లక్ష కమిషన్ గా ఇస్తే సంబంధం సెట్ చేస్తానని బ్రోకర్ చెప్పడంతో ఆ యువకుడు నమ్మేసి డబ్బులిచ్చాడు. ఆ తర్వాత మిత్రుడితో కలిసి బ్రోకర్ వెంట విజయవాడకు వెళ్లాడు..
బ్రోకర్ చెప్పినట్లుగానే విజయవాడలో అమ్మాయిని కలుకున్నారు. ఓ లాడ్జిలో పెళ్లి చూపులు ఏర్పాటు చేయగా, కాస్త పెద్దదైన ఆ అమ్మాయి మనోడికి తెగనచ్చేసింది. వెంటనే పెళ్లి పెట్టుకుందామని పెళ్లికాని ప్రసాద్ తొందరపడ్డాడు. గత గురువారం ఆ లాడ్జిలోనే పెళ్లి కూడా చేసేసుకున్నాడు. ఆ తర్వాత కొత్త భార్యను వెంటపెట్టుకుని యాదాద్రి ఆలయానికి వెళ్లి వ్రతం చేసుకున్నాడు. ఇద్దరూ హైదరాబాద్ వచ్చి షాపింగ్ చేశారు. కొత్త పెళ్లానికి బహుమానంగా మూడు తులాల బంగారు గొలుసు, రూ.40వేల విలువైన దుస్తులు కొనుగోలు చేసి, శుక్రవారం రాత్రికిగానీ స్వగ్రామం చేరుకున్నారు..
అత్తారింట్లో కొద్దిసేపున్న కొత్త పెళ్లికూతురు.. బీరువాలో బట్టలు సర్దుతున్నట్లు నటించి అందులోని రూ.2లక్షల నగదు, ఖరీదైన కొత్త దుస్తులు బ్యాగులో సర్దేసింది. ఒంటిపై ఎలాగూ మరో రూ.2లక్షల విలువైన బంగారం ఉంది. ఆమెకు సహాయకురాలిగా వచ్చిన మరో యువతి.. హైదరాబాద్ లోని తన సోదరిడిని అర్జెంట్ గా కలవాల్సి ఉందని చెప్పి స్థానికంగా ఓ కారును అద్దెకు మాట్లాడి పెట్టుకుంది. అటు కారు రెడీ కాగానే, ఈలోపు తలనొప్పి వస్తోందని ట్యాబ్లెట్లు తెమ్మని కొత్త పెళ్లికూతురు భర్తను మెడికల్ షాపునకు పంపింది. అతను అలా వెళ్లగానే కొత్తపెళ్లికూతురు, ఆమె సహాయకురాలిగా వచ్చిన యువతి కారులో జంప్ అయ్యారు. ట్యాబ్లెట్ తీసుకొని ఇంటికి తిరిగొచ్చిన వ్యక్తి.. భార్య కోసం అమాయకంగా ఇల్లంతా వెతికాడు. కొన్ని గంటల తర్వాతగానీ మోసపోయినట్లు గ్రహించలేదు. బాధితుడు స్థానిక పెద్దలకు చెప్పుకోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇదంతా ఓ ముఠా పథకం ప్రకారం చేసిన మోసమని స్థానికులు భావిస్తున్నారు. అయితే ఈ ఘటనపై ఇప్పటిదాకా ఫిర్యాదు నమోదు కాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.