Viral News: నిద్రపోయి లేచాడు.. గతం మార్చిపోయాడు.. భార్యాపిల్లలు కూడా గుర్తులేరు

భార్యాపిల్లలతో డేనియల్ పోర్టర్

విచిత్ర ఘటన ఇది. ఓ వ్యక్తి రాత్రి పడుకొని ఉదయం నిద్రలేచాడు. అంతే.. తనం గతం మొత్తం మర్చిపోయాడు. కనీసం భార్యా, పిల్లలను కూడా గుర్తుపట్టడం లేదు.

  • Share this:
గజిని సినిమా చూశారా? అందులో హీరో15 నిమిషాల్లోనే గతాన్ని మర్చిపోతుంటాడు. ఎవరో ఆధారాలతో సహా గుర్తు చేస్తేనే గతం కొంతవరకు గుర్తుకొస్తుంది. ఇలాంటివి నిజజీవితంలో జరగడం చాలా అరుదు. అయితే సరిగ్గా ఇలాంటి రుగ్మత బారిన పడ్డాడు అమెరికాకు చెందిన ఒక వ్యక్తి. కానీ ఈ ఘటనలో రాత్రి వేళ పడుకొని, ఉదయాన్నే మేల్కొన్న తరువాత.. అతడు గతాన్ని మర్చిపోయాడు. దాదాపు 20 సంవత్సరాల గతాన్ని, జ్ఞాపకాలను మర్చిపోయాడు. తనకు 16 ఏళ్లేనని, ఇంకా హైస్కూల్లో చదువుకుంటున్నానని నొక్కి చెబుతున్నాడు. తాను 1990వ దశకంలో ఉన్నట్లు స్పష్టం చేశాడు. తనకు పెళ్లయి భార్య, కూతురు ఉన్న విషయాన్ని కూడా మర్చిపోయాడు.

*వయస్సు, బరువు పెరిగానేంటి?
వివరాల్లోకి వెళ్తే అమెరికాలోని టెక్సాస్‌లో గ్రాన్బరీ ప్రాంతానికి చెందిన డేనియల్ పోర్టర్(37) ఓ రోజు ఉదయం అకస్మాత్తుగా నిద్రలేచాడు. అనంతరం తనకు 16 ఏళ్లేనని భావించి స్కూల్‌కు వెళ్లడానికి రెడీ అవ్వాలనుకున్నాడు. తన భార్య రూత్, 10 ఏళ్ల కూతురును కూడా గుర్తించలేకపోయాడు. అద్దంలో తనను తాను చూసుకొని నాకు వయసు పెరిగి, బరువు పెరిగానేంటి? అని ప్రశిస్తున్నాడు. తాను అతడి భార్యనని డేనియల్‌ను కన్విన్స్ చేసేందుకు రూత్ ఎంతో కష్టపడాల్సి వచ్చింది.

* కిడ్నాప్ కు గురయ్యానని భావించాడు..
"అతడు ఓ రోజు ఉదయాన్నే నిద్రలేచాడు. నేను ఎవరో కూడా అతడికి తెలియదని చెబుతూ గందరగోళానికి గురయ్యాడు. తన గదిని కూడా గుర్తించలేకపోయాడు. తాగి ఇంటికి ఎవరో మహిళతో కలిసి ఇంటికి వెళ్లానని లేదా తనను ఎవరో కిడ్నాప్ చేశారని భావిస్తున్నాడు. తప్పించుకునేందుకు మార్గం కోసం వెతుకుతున్నాడు" అని రూత్ తెలిపింది. అయితే 90వ దశకంలో ప్రారంభమైన డబ్ల్యూడబ్ల్యూఈ టీవీ ప్రోగ్రాంను డేనియల్ గుర్తించగలిగాడని రూత్ తెలిపింది.

అంతేకాదు రూత్ అతడికి బట్టలను ఇవ్వగా.. డేనియల్ మాత్రం అవి ఆమె భర్త బట్టలని, ఏ నిమిషంలోనైనా అతడు ఇంటికి రావచ్చని భావించాడు. ఈ జంట డేనియల్ తల్లిందడ్రుల ఫామ్ లో ఉంటున్నందున, రూత్ అబద్ధం చెప్పలేదని అతడిని ఒప్పించగలిగింది. డేనియల్ తన తల్లిదండ్రులను నమ్మాడని, కానీ అతడికి ఓ కుమార్తె ఉందనే విషయం మాత్రం నమ్మలేకపోతున్నాడని రూత్ మీడియాకు వివరించింది. అద్దంలో చూసుకున్న ప్రతిసారీ తన భర్త కోపంగా మారుతున్నాడని, నేను ఎందుకు ఇంత లావుగా, వృద్ధుడిగా మారానని అడుగుతున్నాడని ఆమె చెప్పింది.

* ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా..
డేనియల్ తన చదువు, జ్ఞాపకశక్తిని కోల్పోయాడు. దీంతో వైద్య రంగంలో వినికిడి విభాగం నిపుణుడు అయిన అతడు తన ఉద్యోగాన్ని వదులుకోవాల్సి వచ్చింది. అతడు ట్రాన్సియంట్ గ్లోబల్ అమ్నీషియా అనే వ్యాధితో బాధపడుతున్నాడని వైద్యులు నిర్ధారించారు. స్వల్పకాలిక జ్ఞాపక శక్తిలో అకస్మాత్తుగా, తాత్కాలికంగా అవాంతరం ఎదురైందని స్పష్టం చేశారు. 24 గంటల్లోగా అతడు సాధారణ స్థితికి వస్తాడని తెలిపారు. కానీ ఏడాది పూర్తయినా తన 20 ఏళ్ల జ్ఞాపకాలను మాత్రం తిరిగి పొందలేకపోయాడు. అయితే డేనియల్ స్థితిపై వైద్యులు కూడా స్పష్టత ఇవ్వలేకపోయారు. ఎమోషనల్ స్ట్రెస్ వల్ల కూడా ఇలా జరిగి ఉంటుందని భావిస్తున్నారు.

గత ఏడాది జనవరిలో ఉద్యోగం కోల్పోయిన తర్వాత ఇంటిని అమ్మేశామని, అనారోగ్యం వేధించడంతో డేనియల్‌కు ఒత్తిడి, ఆందోళన పెరిగిందని రూత్ స్పష్టం చేసింది. ఆరు నెలల కాలంలో పరిస్థితులు తారుమారయ్యాయనని ఆమె వాపోతోంది. డేనియల్ జ్ఞాపకశక్తిని కోల్పోవడం వల్ల అతడి వ్యక్తిత్వం పూర్తిగా మారిపోయిందని, ఆహారంలో విభిన్న రుచులను అడుగుతున్నాడని రూత్ తెలిపింది. అయితే ఇప్పడు తనలో హాస్య చతురత పెరిగిందని, మరింత స్నేహపూర్వకంగా ఉంటున్నాడని చెప్పింది. అంతేకాకుండా ఎక్కువగా బయటకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నాడని ఆమె పేర్కొంది.
Published by:Shiva Kumar Addula
First published: