ఈ రోజుల్లో ప్రజలు విలువైన వస్తువులు, ఫర్నిచర్, ఇతర సామగ్రిని సైతం ఈ-కామర్స్ ప్లాట్‌ఫాంల ద్వారానే కొనుగోలు చేస్తున్నారు. స్మార్ట్‌ఫోన్ ద్వారా సెలక్ట్ చేసుకొని, డిజిటల్ విధానంలో చెల్లింపులు చేస్తూ ఇంటినుంచే వస్తువులను ఆర్డర్ చేస్తున్నారు. అయితే ఈ లగ్జరీ వస్తువులను చేరవేసే సమయంలో డెలివరీ సిబ్బంది ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల ఒక డెలివరీ బాయ్ విలువైన ఫ్రిజ్‌ను డెలివరీ చేసేటప్పుడు.. ప్రమాదవశాత్తూ అది కిందపడి పగిలిపోయింది. ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. ఇద్దరు డెలివరీ సిబ్బంది పెద్ద ఫ్రిజ్‌ను ట్రాలీపై తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇదంతా దగ్గర్లో ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ఈ ఘటన ఫిబ్రవరి 18న అమెరికాలోని ఒహియో- టాలమాడ్జ్ ప్రాంతంలో చోటుచేసుకుంది.
వీడియోలో ఏముంది?
స్థానిక కుటుంబం ఇచ్చిన ఆర్డర్ మేరకు.. ఇద్దరు డెలివరీ సిబ్బంది ఫ్రిజ్‌ను ట్రాలీపై తీసుకువెళ్తున్నారు. వారిలో ఒకరు ఫ్రిజ్‌ను ట్రాలీపై పెట్టి లాగుతున్నారు. అయితే రోడ్డుపై వెళ్తున్నప్పుడు ట్రాలీ బ్యాలెన్స్ తప్పింది. డెలివరీ బాయ్ ట్రాలీని నియంత్రించడానికి ప్రయత్నించాడు. అయితే ఈ క్రమంలో ఫ్రిజ్ ముందుకు పడిపోయింది. దీంతో చూస్తుండగానే ఫ్రిజ్ డోర్ భాగం, ముందు వైపు మొత్తం పగిలిపోయింది. వెంటనే వ్యాన్‌లో వస్తువులు సర్దుతున్న మరో డెలివరీ బాయ్ అక్కడికి పరుగెత్తుకుంటూ వచ్చాడు. పగిలిపోయిన ఫ్రిజ్ ని చూసి.. ఇద్దరం కలిసి ఫ్రిజ్‌ను తీసుకెళ్తే బాగుండేదేమో అని ఆ వ్యక్తి వాపోయాడు. అయితే జరిగిపోయాక ఏం చేయగలం అంటూ వారు బాధపడుతూ ఉండడం వీడియో చూసిన వారందరికీ బాధను కలిగిస్తుంది.
ఖరీదైన LG రిఫ్రిజిరేటర్ పగిలిపోవడంపై డెలివరీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేశారు. దాని ధర 4,200 డాలర్లు కావడం విశేషం. అంటే మన కరెన్సీలో ఈ ఫ్రిజ్ ధర రూ. 3.28 లక్షల వరకు ఉంటుంది. ఏం చేయాలో అర్థంకాక.. పగిలి పోయిన ఫ్రిజ్నే వారిద్దరూ బుకింగ్ అడ్రస్‌కు తీసుకెళ్లారు. మ్యాన్యుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ అని చెప్పి, పగిలిపోయిన ఫ్రిజ్‌ను వారికి డెలివరీ చేశారు. అలా పాడైపోయిన ఫ్రిజ్‌ను ఆ కుటుంబం డెలివరీ తీసుకోక తప్పలేదు. ఆ తరువాత వారు మరోసారి ఫ్రిజ్ రీప్లేస్మెంట్ కోసం అప్లికేషన్ పెట్టుకోవాల్సి వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, E-commerce, Us news, Viral Video