డ్రైవర్ అవసరం లేకుండా ఆటోమేటిగ్గా నడిచే కార్లు ఇప్పుడిప్పుడే మార్కెట్లోకి వస్తున్నాయి. వీటిని ఆటోపైలట్ వేకిల్స్ అంటున్నారు. ప్రస్తుతం ఇలాంటి డ్రైవింగ్ మోడ్‌కు ప్రభుత్వాలు అనుమతులు ఇవ్వలేదు. ఒకవేళ ఎవరైనా ఈ ఫీచర్‌ను ఉపయోగించుకున్నా శిక్ష అనుభవించాల్సిందే. భవిష్యత్తులో ఆటోపైలట్ వాహనాలకు అనుమతి వస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఆటోపైలట్ ఆప్షన్ ద్వారా టెస్లా కారులో ప్రయాణించాడు ఒక వ్యక్తి. అమెరికాలోని కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన పరమ్ శర్మ తన టెస్లా కారుతో అడ్వెంచర్ చేశాడు. ఆటో పైలట్ మోడ్‌లో కారును ఉంచి, తాను మాత్రం వెనుక సీట్లో కూర్చొని సేదతీరాడు. దీంతో నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేసిన అభియోగాలతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. భారత సంతతికి చెందిన 25 ఏళ్ల పరమ్ శర్మకు లేటెస్ట్ మోడల్ టెస్లా కారు ఉంది. మే 10న డ్రైవర్ సీటులో ఎవరూ లేకుండా ఆటోపైలట్ మోడ్‌లో అతడు ప్రయాణించాడు. అమెరికాలో ఈ విధానం ద్వారా డ్రైవింగ్ చేసే అంశం చట్టబద్దం కాలేదు. ఆటో డ్రైవ్ సమయంలో, అత్యవసర పరిస్థితుల్లో పర్యవేక్షణ కోసం డ్రైవింగ్ సీటు వద్ద ఎవరైనా కూర్చోవాలి. కారు తయారీ సంస్థ తన వెబ్ సైట్లో కూడా ఆటోపైలట్ డ్రైవ్ నియమాల్లో దీని గురించి స్పష్టంగా పేర్కొంది. అయితే పరమ్ మాత్రం ఈ విషయాన్ని పెడచెవిన పెట్టాడు. ఈ సమయంలో కారు వెనుక సీట్లో కూర్చొని, నవ్వుతూ చూస్తున్న పరమ్ శర్మ కెమెరాకు చిక్కాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఈ ఘటనలో గోల్డెన్ గేట్ డివిజన్ ఆఫ్ కాలిఫోర్నియా హైవే పెట్రోల్(CHP) అధికారులు అతడిని అరెస్టు చేశారు. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద అతడిని అరెస్టు చేశారు. అంతేకాకుండా ఈ ఫోటోను ఫేస్ బుక్ లో పంచుకున్నారు. ఈ అసాధారణ సంఘటన గురించి సీహెచ్‌పీ ప్రజలకు సమాచారమిచ్చింది. ఇలాంటివి ఎక్కడైనా చూస్తే వెంటనే 911కు తెలియజేయాలని ఫేస్బుక్ పోస్టులో కోరింది. ప్రస్తుతం పరమ్ శర్మ కేసుపై విచారణ జరుగుతోంది. విచారణలో అతడి టెస్లా కారును సాక్ష్యంగా తీసుకున్నారు.
టెస్లా విద్యుత్ కారులో ఆటోపైలట్ ను ప్రయోగించడం ఇదే మొదటి సారి కాదు. గతేడాది సెప్టెంబరులో ఆల్బర్ట్ సిప్లెస్ అనే వ్యక్తి టెస్లా ఎక్స్ వాహనంలో ప్యాసింజరు సీట్లో కూర్చొని హైవేపై వేగంగా దూసుకెళ్లాడు. కారు వేగంగా వెళ్లడమే కాదు డ్రైవింగ్ లైన్ పైనే వెళ్లింది. అప్పట్లో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఈ సంఘటనపై విశేషంగా స్పందించారు. ఏదిఏమైనప్పటికీ ఇతరుల భద్రత విషయంలో ఎప్పటికీ ఇది ఆలోచన కాదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tesla Motors, Trending, Viral Video