Women Startup Program: ఐఐఎం విశాఖపట్నంలో ఉమెన్ స్టార్టప్ ప్రోగ్రాం ప్రారంభం.. మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ

విశాఖ ఐఐఎం

మహిళా యువ పారిశ్రామిక వేత్తలకు ఐఐఎం విశాఖ అండగా నిలుస్తోంది. తాజాగా 19 మంది యువ మహిళా పారిశ్రామిక వేత్తలకు శిక్షణ ఇచ్చేందుకు ఐఐఎం వైజాగా ఎంపిక చేసింది. వీరి స్టార్టప్‌ ప్రతిపాదనలను ఆచరణలో పెట్టేందుకు ఈ శిక్షణ ఉపయోగపడనుంది.

  • Share this:
ఐఐఎం విశాఖపట్నం మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రోత్సాహకాలు అందించేందుకు శ్రీకారం చుట్టింది.  వివిధ రంగాల్లో రాణించాలని లక్ష్యంగా పెట్టుకున్న మహిళా పారిశ్రామిక వేత్తల కోసం ఉమెన్ స్టార్టప్ ప్రోగ్రామ్ కింద సంస్థ శిక్షణ ఇవ్వనుంది. ఈ శిక్షణ కార్యక్రమం కోసం మొత్తం 19 మంది యువ మహిళా పారిశ్రామిక వేత్తలను ఐఐఎం వైజాగా ఎంపిక చేసింది. వీరి స్టార్టప్‌ ప్రతిపాదనలను ఆచరణలో పెట్టేందుకు ఈ శిక్షణ ఉపయోగపడనుంది. ఈ ప్రతిపాదనల్లో హెల్త్ కేర్, ఫుడ్ టెక్నాలజీ, ఎడ్యుకేషన్ టెక్నాలజీ, వ్యవసాయం, సోషల్ ఇంపాక్ట్, ఫ్యాషన్.. వంటి రంగాలకు సంబంధించి శిక్షణ ఇవ్వనున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా నుంచి లబ్ధిదారులను సంస్థ ఎంపిక చేసింది. ఉమెన్ స్టార్టప్ ప్రోగ్రాంను విశాఖ ఐఐఎం  సంస్థ 2018 నుంచే నిర్వహిస్తోంది. మొదటి సంవత్సరం భారీ సంఖ్యలో మహిళలు ఈ కార్యక్రమం కోసం తమ పేర్లు నమోదు చేసుకున్నారు.

ఈ ఏడాది కార్యక్రమానికి సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలోని నేషనల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటర్ ‌ప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్ బోర్డ్ సలహాదారు, అధిపతి డాక్టర్ అనితా గుప్తా ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. తమలో ఉన్న ప్రత్యేకతలకు పదును పెట్టుకుంటూ, స్టార్టప్‌ను విజయవంతంగా ఆచరణలో పెట్టేందుకు ఇలాంటి శిక్షణ ఉపయోగపడుతుందని ఆమె తెలిపారు. ఇక్కడ ట్రైనింగ్ పొందిన 2018 బ్యాచ్‌కు చెందిన మహిళా పారిశ్రామిక వేత్తలు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.  ఐఐఎం-V ఇంక్యుబేషన్ కాలంలో వారు తీసుకున్న శిక్షణ తమ కెరీర్‌కు ఎలా ఉపయోడపడిందనే వివరాలను వారు వెల్లడించారు. ఇలాంటి కార్యక్రమాలు మహిళలు ప్రారంభించే స్టార్టప్‌లు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు ఎంతగానో ఉపయోగడతాయని చెప్పారు.

ఆ సంస్థతో ఒప్పందం కార్యక్రమంలో విశాఖ ఐఐఎం డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడారు.  ఆయన ఐఐఎం విశాఖ ఫీల్డ్ ఎండీగా, సీఈఓగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం కోసం ఐఎఎం-బెంగళూరుతో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. మహిళా వ్యవస్థాపకులకు అన్ని విధాలుగా మద్దతు ఇవ్వడంతో పాటు ప్రోత్సాహకాలు అందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఎంపిక చేసిన కొంతమంది మహిళా వ్యవస్థాపకులకు మార్కెట్ డైనమిక్స్‌ను అర్థం చేసుకోవడానికి, వారి ఆలోచనలను విజయవంతమైన వెంచర్లుగా మార్చడానికి అవసరమైన టెక్నికల్ నాలెడ్జ్ కోసం శిక్షణ ఇస్తున్నామని వివరించారు.

మహిళా వ్యవస్థాపకుల కెరీర్‌కు ఐఐఎం విశాఖ ఎంతగానో సహాయపడుతుందని చంద్రశేఖర్ చెప్పారు. ఈ కార్యక్రమం కోసం విశాఖ ఐఐఎం ఫీల్డ్ కు 32 లక్షల రూపాయలను సంస్థ గ్రాంట్‌గా ఇచ్చిందని పేర్కొన్నారు. రాబోయే ఆరు నెలల్లో వ్యాపార నిర్వహణ గురించి శిక్షణ ఇస్తామని ఐఐఎం విశాఖ  ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ విభాగాధిపతి ప్రొఫెసర్ షమీమ్ జావెద్ తెలిపారు. వివిధ రంగాల్లో నాలెడ్జ్ సెషన్లు, వర్క్ షాప్‌లు నిర్వహిస్తామని చెప్పారు.
Published by:Nagesh Paina
First published: