గోదావరి జిల్లాలు అంటే మర్యాదకు మారు పేరు. అప్పుడెప్పుడో మర్యాద రామన్న సినిమాలో చూపించినట్టు మర్యాదలో రాయలసీమతో పాటు గోదావరి జిల్లాల్లో కూడా చాలా ఎక్కువగానే ఉంటాయి. మర్యాదల విషయంలో చాలా ప్రత్యేకత కూడా ఉంది. ఇక గోదావరి జిల్లాలకు కొత్త అల్లుడు అంటే ఇక మర్యాదల విషయంలో ఎక్కడా తగ్గరు. ప్రేమతో, అభిమానంతో కడుపు నింపేస్తారు. ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే, తాజాగా సంక్రాంతికి ఇంటికి వచ్చిన అల్లుడికి అత్తింటి వారు ఏకంగా 125 రకాల వంటలు వడ్డించారు. ఆ వంటకాలు అన్నీ సర్దడానికే డైనింగ్ టేబుల్ మొత్తం సరిపోయింది. ఆ 125 రకాల్లోనూ అన్ని టేస్ట్‌లు ఉండేలా చూసుకున్నారు. స్వీట్, హాట్, పండ్లు, బర్గర్లు, రకరకాల కూరలు, రకరకాల రైస్‌లు అన్నీ వరుసగా అల్లుడి ముందు పెట్టారు. వెజ్, నాన్ వెజ్ అన్నీ పెట్టారు. అవన్నీ ఒక్కొక్కటి టేస్ట్ చేసినా కూడా కడుపు నిండిపోయేంతగా ఉన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
తనకు అన్ని రకాల ఫుడ్ పెట్టిన అత్తింటి వారి ప్రేమకు ఆ అల్లుడు ఫిదా అయినట్టు ఉన్నాడు. తన భార్యకు కూడా కొంచెం టేస్ట్ చేయమంటూ స్పూన్‌తో అందించాడు. కానీ, నాకొద్దు అంటూ ఆమె తినలేదు. ఈ వీడియో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జరిగినట్టు తెలిసింది. అయితే, ఆ అత్తింటి వారు, అల్లుడు ఎవరనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
సాధారణంగా ఏదైనా పెళ్లిళ్లకు వెళితే అక్కడున్న 20, 25 రకాల వంటకాలు తినడానికే జనం అలసిపోతారు. ఒక్కో రకం ఫుడ్ ఒక్కొక్కటి టేస్ట్ చేస్తారు. ఆ మాత్రం దానికే ‘అబ్బో కడుపు పట్టడం లేదు’ అంటారు. అలాంటిది, 125 రకాల వంటకాలు కళ్ల ముందు ఉంటే, వాటిని తినడం ఏ అల్లుడు వల్ల మాత్రం అవుతుంది. అన్ని రకాల వంటలు చూడగానే కడుపు కంటే ముందు కళ్లు నిండిపోతాయి. అత్తింటివారు చూపించిన అభిమానానికి ఆ అల్లుడు ఎంత ఎగ్జైట్ అవుతున్నాడో అతడి కళ్లలో కనిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, East Godavari Dist, Sankranti 2021, West Godavari