పువ్వు పుట్టగానే పరిమళించడం అంటే అదేనేమో. పదేళ్ల వయసున్న చిన్నారి చదువుపై తనకున్న ఆసక్తి వదులుకోలేకపోయింది. తల్లిదండ్రులు తనకు అప్పగించిన బాధ్యతను నెరవేర్చింది. ఈ రెండు పనులు ఒకేసారి చేస్తూ వార్తలకెక్కింది. మణిపూర్(Manipur)లోని తమెంగ్‌లాంగ్(Tamenglong) జిల్లా డైలాంగ్(Dialong)లోని ప్రాధమిక పాఠశాలలో నాల్గో తరగతి చదువుతున్న 10ఏళ్ల బాలిక(10year old girl) పామి(Pamei)క్లాస్ రూమ్‌లో పాఠాలు వింటున్న ఫోటో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ఫోటో వైరల్ కావడానికి ముఖ్య కారణం ఏమిటంటే పదేళ్ల వయసున్న చిన్నారి రెండేళ్ల పాపను తన ఒడిలో కూర్చోబెట్టుకొని పాఠాలు వినడమే ఆ ఫోటో ప్రత్యేకత. పమి తల్లిదండ్రులు వ్యవసాయం పనుల కోసం ఉదయాన్నే పొలానికి వెళ్లడంతో చెల్లెల్ని చూసుకోవాల్సిన బాధ్యతను పదేళ్ల చిన్నారికి అప్పగించారు. అయితే చదువుకోవాలన్న తపన పమీలో మెండుగా ఉండటంతో అలాగే తన చెల్లెల్ని తీసుకొని స్కూల్‌కి వెళ్లడం, క్లాస్ రూమ్‌లో ఒళ్లో కూర్చొబెట్టుకొని పాఠాలు వినడం, రాసుకోవడం చేస్తుంది. చిన్నపిల్ల బాధ్యత, భవిష్యత్తు కోసం పడుతున్న తపనను చూసి నెటిజన్లు ఆమెను అభినందిస్తున్నారు. వయసులో చిన్నపిల్ల అయినప్పటికి బాధ్యతలో గొప్పదానివంటూ కామెంట్స్ షేర్ చేస్తున్నారు. పామి ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతూ చివరకు రాష్ట్ర మంత్రి వరకు చేరాయి.
బాల్యంలోనే బాధ్యతలు..
పదేళ్ల చిన్నారి పామి అంకితభావం చూసి గర్విస్తున్నట్లుగా చెప్పారు మణిపూర్ విద్యుత్, అటవీ, పర్యావరణ శాఖ మంత్రి టీహెచ్. బిస్వజిత్ సింగ్.పదేళ్ల చిన్నారి కుటుంబ పరిస్థితుల దృష్ట్య చదువు కోసం పడుతున్న తపన చూసి ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాలికను ఆదుకుంటామని వాగ్దానం చేస్తూ మంత్రి ట్వీట్ చేశారు. పామీకి అండగా ఉంటామని చెబుతూనే మంత్రి అమ్మాయి బంధువులను సంప్రదించారు. చిన్నారిని తీసుకొని ఇంపాల్ వచ్చి తనను కలవమని కోరారు. చిన్నారి గ్రాడ్యుయేట్ పూర్తయ్యే వరకు అయ్యే ఖర్చును తానే వ్యక్తిగతంగా చెల్లిస్తానంటూ వాగ్ధానం చేశారు మంత్రి.
Her dedication for education is what left me amazed! This 10-year-old girl named Meiningsinliu Pamei from Tamenglong, Manipur attends school babysitting her sister, as her parents were out for farming & studies while keeping her younger sister in her lap. pic.twitter.com/OUIwQ6fUQR
— Th.Biswajit Singh (@BiswajitThongam) April 2, 2022
భవిష్యత్తుపై ఆశలు..
మంత్రి ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు బాలిక వివరాలు, తల్లిదండ్రుల ఆచూకి కొనుగొన్నారు. వ్యవసాయ ఆధారిత కుటుంబం కావడంతో బాలిక పామీని బాగా చదివించే ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చదువుకోవాలనే తపన ఉన్న ఇలాంటి విద్యార్ధులను ప్రభుత్వం, పాలకులు ఈవిధంగా ప్రోత్సహించడం మంచి పద్దతి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ షేర్ చేస్తున్నారు నెటిజన్లు. ఎలాగైతేనేం చిన్నారి శ్రద్ధగా చదువుకునేందుకు ఉన్న అడ్డంకులు తొలగిపోతున్నాయని మరికొందరు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Manipur, VIRAL NEWS, Viral photos