హైదరాబాద్ పార్లమెంట్ సభ్యుడు, ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పుల ఘటన అనంతర పరిణామాలు కొనసాగుతున్నాయి. ఈ కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితులకు బీజేపీతో అనుబంధం ఉందని వెల్లడి కావడంతో ఒవైసీ విమర్శల దాడిని ముమ్మరం చేశారు. కాల్పుల ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సోమవారం నాడు పార్లమెంటులో ప్రకటన చేసే అవకాశముంది. ఇదిలా ఉంటే, కాల్పుల ఘటనలో ఒవైసీ ప్రాణాలతో బయటపడిన క్రమంలో దేశ వ్యాప్తంగా ఎంఐఎం కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ప్రార్థనలు చేస్తున్నారు. హైదరాబాద్ కు చెందిన ఓ బడా వ్యాపారి అసద్ పేరు మీద ఏకంగా 101 మేకలను బలిచ్చాడు..
హైదరాబాద్ ఓల్డ్ సిటీ యాకుత్ పురా పరిధిలోని బాగ్ ఎ జహానారా ప్రాంతానికి చెందిన ఓ వ్యాపారి అసదుద్దీన్ అభిమాని. ఎంఐఎం పార్టీకి ఆర్థికంగానూ సహకారం అందిస్తుంటాడు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో అసదుద్దీన్ ఒవైసీ కాన్వాయ్ పై కాల్పుల వార్త విని కంగారుపడ్డాడు. తన ప్రియతమనేత ప్రాణాలతో బయయటపడటంతో అల్లాకు దువా చెల్లించుకోవాలనుకున్నాడు. ప్రత్యేక ప్రార్థనల్లో భాగంగా ఇవాళ(ఆదివారం) ఉదయం 101 మేకలను బలిచ్చాడా వ్యాపారి. ఈ కార్యక్రమానికి మలక్ పేట్ ఎంఐఎం ఎమ్మెల్యే అహ్మద్ బలాలా సైతం హాజరయ్యారు. అనంతరం ఆ ప్రాంతంలోనే భారీ విందు ఏర్పాటు చేశాడు. ఒవైసీ కోసం ఓల్డ్ సిటీ వ్యాపారి 101 మేకల్ని బలిచ్చిన వార్త వైరల్ అవుతోంది.
ఒవైసీపై కాల్పు ఘటనకు సంబంధించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒవైసీ కాన్వాయ్ పై కాల్పుల ఉదంతాన్ని హైదరాబాద్ సహా అన్ని రాష్ట్రాల్లోని ఐఎంఐం శ్రేణులు నిరసించాయి. కేంద్రం సైతం ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుంది. కానీ సాక్షాత్తూ అసదుద్దీన్ సతీమణి మాత్రం కాల్పుల ఘటనను నమ్మలేదట. యూపీలోని చిజారసీ టోల్ ప్లాజా వద్ద కాన్వాయ్ పై కాల్పులు, తృటిలో ప్రాణాలతో బయటపడి వేరే కారులోకి ఎక్కిన తర్వాత మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ఢిల్లీలో ఉన్న తన భార్య ఫర్హీన్ ఒవైసీకి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పారు. కానీ కాల్పుల ఉదంతాన్ని ఆమె అసలే నమ్మలేదు.
‘ఏంటి? మరో కొత్త కథ చెబుతున్నారా?’అని దాదాపు నిలదీశారు. నిజానికి ఫర్హీన్ హైదరాబాద్ వెళ్లిపోవాల్సి ఉన్నా, ఒవైసీ కోరడంతో ఆమె గురువారం కూడా ఢిల్లీలోనే ఉన్నారు. ఇద్దరూ కలిసి ఆ సాయంత్రం ఢిల్లీలోని రెస్టారెంట్లో డిన్నర్ కు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. డిన్నర్ ప్రోగ్రామ్ ఎగ్గొట్టడానికే భర్త ఇలా కట్టుకథ చెబుతున్నాడేమోనని ఫర్హీన్ భావించారట. ఆ తర్వాత.. కాన్వాయ్ పై కాల్పుల ఉదంతాన్ని భార్య ఎంతకీ నమ్మకపోవడంతో, కావాలంటే టీవీ చూడమని ఒవైసీ సూచించారు. దీంతో ఫర్హీన్ టీవీ పెడుతుండగానే, పెద్ద కూతురు ఖుద్సియా ఫోన్ చేసింది. తండ్రి కాన్వాయ్ పై దాడి జరిగిందని, అయితే ఆయన క్షేమంగానే ఉన్నారని కూతురు చెప్పాకగానీ ఒవైసీ భార్యలో ఆందోళన పెరిగింది. భార్యకు ఫోన్ చేసిన ఒవైసీ తన మాటలను ఆమె ఎంతకూ నమ్మకపోయే సరికి పక్కనున్న మజ్లిస్ నేతలతో.. ‘నేను బుల్లెట్ల నుంచి బచాయించాను గానీ భార్య అనుమానపు చూపుల నుంచి తప్పించుకోలేకపోయా..’అని ఒవైసీ సరదాగా వ్యాఖ్యానించారి తెలిసింది.
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న ఒవైసీ తన పార్టీ నేతలతో కలిసి మీరట్ నుంచి ఢిల్లీకి వస్తుండగా గురువారం నాడు చిజారసీ టోల్ ప్లాజా వద్ద కాల్పులు జరగడం, ఒవైసీ ప్రయాణిస్తోన్న వాహనానికి బుల్లెట్లు తగలడం, ప్రాణాపాయం నుంచి బయటపడ్డ ఆయన మరో కారులో ఢిల్లీకి వెళ్లడం, ఈ ఘటనను కేంద్ర హోం శాఖ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సీరియస్ గా తీసుకోవడం, మజ్లిస్ నేతకు జెడ్ కేటగిరీ భద్రత కేటాయించడం తెలిసిందే. అయితే, తాను ఏ కేటగిరీ పౌరుడిగా ఉండాలని కోరుకుంటానేతప్ప, జెడ్ ప్లస్ కేటగిరీ వద్దని అసద్ పార్లమెంటులో ప్రకటించారు. కాల్పుల ఘటనకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఒవైసీపై కాల్పుల ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫిబ్రవరి 7న పార్లమెంటులో వివరణ ఇచ్చే అవకాశాలున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.