తెలంగాణలో వైఎస్ షర్మిల దూకుడు పెంచారు. కొత్త రాజకీయ పార్టీ ప్రకటించేందుకు అంతా సిద్ధం చేసుకున్నారు. ఏప్రిల్ 9న ఖమ్మంలో జరిగే బహిరంగ సభలో అన్ని వివరాలను వెల్లడించనున్నారు. ఈ క్రమంలో అన్ని వర్గాల ప్రజలతో ఆమె సమావేశమవుతున్నారు. ఇప్పటికే పలు జిల్లాల వైఎస్ఆర్ అభిమానులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించిన ఆమె.. శుక్రవారం నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల వైఎస్ అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బీజేపీతో పాటు ఆ పార్టీ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు షర్మిల.
నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు తెస్తానని ఎవరో బాండ్ పేపరో రాసిచ్చారట.. బాండ్ పేపర్ ఇచ్చి రైతులను మోసం చేశారట.. అంటూ బీజేపీ ఎంపీ అరవింద్‌పై సెటైర్లు వేశారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం తెలియదా..? అని ఆమె విమర్శించారు. తెలంగాణలో పసుపు రైతుల కష్టాలు వర్ణనాతీతమని, ఎక్స్టెన్షన్ సెంటర్ ఇస్తే పసుపు రైతుల కష్టాలు తీరుతాయా అని మండిపడ్డారు షర్మిల. ప్రతి గడపకు పూసే పసుపు పండించే రైతు కష్టాలు కనపడటం లేదా అంటూ విమర్శలు గుప్పించారు. బైంసాలో మతకల్లోలాలు సృష్టించడంపై ఉన్న ఆసక్తి రైతుల కష్టాలపై ఎందుకు లేదని ఆమె ప్రశ్నించారు.
అటు ఆదిలాబాద్ అభిమానులతో మాట్లాడుతూ.. తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షర్మిల. ''తెలంగాణ కాశ్మీర్ మన ఆదిలాబాద్ జిల్లా. పచ్చటి అడవులు, కుంటాల జలపాతంతో అందంగా ఉంటుంది. జల్ జమీన్ జంగల్ పేరుతో నిజాంకి చుక్కలు చూపిన కొమురం భీం పుట్టిన గడ్డ. ప్రత్యేక తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామ చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదిలాబాద్ జిల్లా వాసి. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ప్రొఫెసర్ కోదండరామ్ ఇక్కడే పుట్టారు. జలియన్ వాలా బాగ్‌ను తలపించే ఇంద్రవెల్లి ఘటన ఇంకా మనలను రగిలిస్తూనే ఉంది. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు ఆదిలాబాద్‌కు తలమానికం.'' అని షర్మిల అన్నారు.
తెలంగాణ రాజకీయాల్లోకి నేరుగా ఎంట్రీ ఇవ్వడానికి వైఎస్ షర్మిల అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏప్రిల్ 9న ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. సభను నిర్వహణకు అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేయాల్సిందిగా అనుచరులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. భారీగా ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నందున దానికి అనుగుణంగానే అనుచరులు కూడా బహిరంగ సభ ఎక్కడ అయితే బాగుంటుందన్న దానిపై సమాలోచనలు చేస్తున్నారు. ఇదే సమయంలో తెలంగాణ పోలీసులు ఊహించని షాకిచ్చారు. సభను జరుపుకునేందుకు అనుమతిని ఇచ్చినట్టే ఇచ్చి ఆంక్షలను విధించారు. ఇది కాస్తా షర్మిల అనుచరుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Dharmapuri Arvind, Telangana, YS Sharmila