YS SHARMILA HAS LASHED OUT AT THE TRS PARTY OVER VANAMA RAGHAVA INVOLVEMENT IN THE RAMAKRISHNA FAMILY SUICIDE CASE PRV
YS Sharmila: "టీఆర్ఎస్ పార్టీ అండతోనే వనమా కొడుకు ఆగడాలు, యథా లీడర్.. తథా క్యాడర్ అన్నట్లుగా టీఆర్ఎస్ పార్టీ" : వైఎస్ షర్మిల
ys sharmila
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను శుక్రవారం లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి, ఓదార్చారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆమె మండిపడ్డారు.
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలను శుక్రవారం లోటస్ పాండ్ లోని పార్టీ కార్యాలయంలో వైఎస్ షర్మిల (YS Sharmila) పరామర్శించారు. బాధిత కుటుంబసభ్యులతో మాట్లాడి, ఓదార్చారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలుసుకుని తల్లడిల్లిపోయారు. రైతులు, వారి కుటుంబసభ్యులు ఎవరూ అధైర్యపడవద్దని, తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ‘‘ కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న ఏడున్నరేళ్లలో 8 వేల మంది ఆత్మహత్యలు (farmers suicide) చేసుకున్నారు. రైతులను కోటీశ్వరులను చేస్తామని చెప్పి కాటికి పంపుతున్నారు. బంగారు తెలంగాణ అన్న కేసీఆర్ బతికే అవకాశం లేకుండా చేస్తున్నారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక కొందరు, యాసంగిలో వరి వద్దన్న కారణంగా మరి కొందరు మరణించారు. మరికొంత మంది రైతులు ధరణిలో భూమి కనిపించడం లేదని ఆత్మహత్యలు చేసుకున్నారు. వీరందరి కుటుంబాలకు కేసీఆర్ సమాధానం చెప్పాలి. రైతుల మరణాలన్నింటికీ కారణం కేసీఆర్ గారే. 8 వేల కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయంటే ఆయనే కారణం.
రుణమాఫీ అని చెప్పి కేవలం 3 లక్షల మందికి రూ. లక్ష చొప్పున మాఫీ చేశారు. మరో 36 లక్షల మందికి రుణాలు ఎగ్గొట్టాడు. బ్యాంకులు రైతులను డీఫాల్టర్స్ గా చూసి అప్పులు ఇవ్వడం లేదు. దీంతో వడ్డీలకు డబ్బులు తెచ్చుకుంటున్నారు. ఆ మిత్తీలు కట్లలేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటు..
రైతు బంధు కింద ఎకరాకు బోడి రూ.5 వేలు ఇచ్చి సంబురాలు చేసుకోవడం సిగ్గుచేటు. రైతు బంధుకు జై కొట్టి.. ఇన్ పుట్ సబ్సిడీ నై అంటున్నారు యంత్ర లక్ష్మి నై అంటున్నారు. పంట బీమా నై అంటున్నారు. పంట నష్ట పరిహారం నై అంటున్నారు. ఎకరాలకు రూ.5వేలు ఇచ్చి రూ.25 వేలు ఎగ్గొడుతున్నారు.
ఉచిత విద్యుత్ కు ఆద్యుడే వైయస్ఆర్..
వైయస్ఆర్ పాలనలో రైతులకు రుణమాఫీ చేశారు. ఉచిత విద్యుత్ అందించారు. ఉచిత విద్యుత్ కు ఆద్యుడే వైయస్ఆర్ గారు.. బోర్లు వేసుకుంటే ఆర్థిక సాయం చేశారు. పంట నష్టపోతే పరిహారం ఇచ్చారు.పెట్టుబడిని తగ్గించి రాబడి పెంచారు. అందుకే ఆనాడు ఎవుసం పండుగ అయింది.
నియంత పాలన..
మద్దతు ధర మీద బోనస్ ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి వైయస్ఆర్ గారు.. వైయస్ఆర్ పాలనను మిగతా రాష్ట్రాలు అనుసరిస్తుంటే కేసీఆర్ మాత్రం.. నియంత పాలన సాగిస్తున్నాడు.- వైయస్ఆర్ హయాంలో ఐదేండ్లలో వరికి మద్దతు ధర రెండింతలైంది. మరి కేసీఆర్ హయాంలో ఎంత అయింది? మద్దతు ధర దేవుడెరుగు.. కనీసం వడ్లనైనా కొనడం లేదు. కొన్న ధాన్యంలో తేమ, తాలు పేరుతో దోచుకుంటున్నారు.
7 వేల మంది రైతులు ఆత్మహత్య..
కేసీఆర్ కు పాలన చేతకాదు. పరిపాలన చేతకాకే రైతులు చనిపోయారు. పరిపాలన చేతకాకే ధర్నాలు చేస్తున్నారు. పరిపాలన చేతకాకే ఢిల్లీలో డ్రామాలు చేస్తున్నారు. పరిపాలన చేతకాక చావు డప్పు లాంటి చెత్త కార్యక్రమాలు చేపడుతున్నారు.- ఏడేండ్లలో 7వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే కేసీఆర్ గారు ఒక్కరినైనా పరామర్శించలేదు. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు రైతుల సమస్యల మీద ఫోకస్ చేస్తుంటే.. కేసీఆర్ గారికి మాత్రం సోయి లేదు.
కేంద్ర ప్రభుత్వమైనా కొనాలనే ధ్యాస ఉండనక్కర్లేదా?..
ఇటు రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనమని చెబుతుంది. అటు కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనమని చెబుతుంది. రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందనే ఉద్దేశంతోనే ఆ అంశాన్ని ఇరు పార్టీల లీడర్లు పక్కదారి పట్టించారు.- రాష్ట్ర ప్రభుత్వం వడ్లు కొనమంటే.. కేంద్ర ప్రభుత్వమైనా కొనాలనే ధ్యాస ఉండనక్కర్లేదా? ఎంతసేపటికీ సమస్యను డైవర్ట్ చేయడమేనా ? రెండు పార్టీలకు వడ్లు కొనడం ఇష్టం లేదు కాబట్టే వేరే సమస్యను తెర పైకి తెచ్చారు.
ఒకరినొకరు తిట్టుకుంటూ రైతుల సమస్యను మళ్లించారు. అందుకే ఇంతమందిని పిలిచి వాస్తవాలు చెప్పిస్తున్నాం. మద్దతు ధర ఉన్న పంటను వేసుకోవద్దని చెప్పే హక్కు బీజేపీకిగాని, టీఆర్ఎస్ ప్రభుత్వానికి గానీ లేదు.- పంట వేసుకునే హక్కు రైతుది. అది కొనాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. రైతులు ఎంత పండిస్తారో, అంతా కొనాల్సిందే. కొన్న ధాన్యాన్ని పక్క రాష్ట్రానికి అమ్ముతారో, పక్క దేశానికి అమ్ముతారో, రా రైస్ చేస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం. కానీ కొనాల్సిందే.
ఇతర పంటలు వేసుకోండి డబ్బులు వస్తాయంటున్నారు కేసీఆర్ గారు. అలా వేసుకుంటున్న వారేమైనా కోటీశ్వరులు అయ్యారా ? వారు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కదా.. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం కేసీఆర్ కు లేదా ? దున్నపోతు మీద వాన పడినట్టు, ఎంతమంది సచ్చిపోతే నాకేంటని అనుకుంటాడు ఆయన.
మన రాష్ట్రంలో ఇంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టని కేసీఆర్, హరియాణాలో చనిపోయిన రైతులకు మూడు రోజుల్లోనే మూడు లక్షలు ఇస్తాడట. వీరివి ప్రాణాలు కాదా ? వీరి బాధ్యత పట్టదా ? ముఖ్యమంత్రికి సిగ్గుంటే రాజీనామా చేసేవారు.- రైతులను ఆదుకోవాలన్న ఇంగితజ్ఞానం అంటు కేంద్రంలో ఉన్న బీజేపీకి కానీ ఇటు రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ కు గానీ లేదు.
చేతకాని సన్నాసి ముఖ్యమంత్రి మాకొద్దు..
కేసీఆర్ భాషలోనే మేం మాట్లాడాలంటే మాకు చేతకాక కాదు. మాకు ఇంగితజ్ఞానం ఉంది. ఈ రోజు చేతకాని ముఖ్యమంత్రి మాకొద్దని మేం నినదిస్తున్నాం. కేసీఆర్ భాషలో చెప్పాలంటే చేతకాని సన్నాసి ముఖ్యమంత్రి మాకొద్దు.. ఉద్యోగాలు ఇవ్వడం చేతకాని సన్నాసి ముఖ్యమంత్రి మాకొద్దు. రుణమాఫీ చేయని చేతకాని ముఖ్యమంత్రి మనకొద్దు. కేసీఆర్ గారు ఇకనైనా ఆ పదవికి తగ్గట్టు, ఆ కుర్చీకి తగ్గట్లు మాట్లాడితే సమాజానికి బాగుంటుంది.
మొన్న కేటీఆర్ గారు నల్లగొండలో కొవిడ్ రూల్స్ ఉల్లంఘించి ర్యాలీ తీశారు. ఆ తర్వాత భారీ మీటింగ్ నిర్వహించారు. 25వ తేదీకి కొవిడ్ జీవో ఇచ్చి.. దానిని జనవరి 2వ తేదీ వరకు పొడిగించారు. కేటీఆర్ మాత్రం 28వ తేదీన సభ నిర్వహించి, జీవో అమలులో లేదని అబద్దాలు చెబుతున్నారు. కొవిడ్ రూల్స్ టీఆర్ఎస్ లీడర్లకు వర్తించవా? ప్రతిపక్షాలకే వర్తిస్తాయా?
కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాలని ఎంత మొత్తుకుంటున్నా.. కేసీఆర్ చెవిన పడడం లేదు. కరోనా కష్టకాలంలో మేం కాల్ సెంటర్ ఏర్పాటు చేసి, ఎంతో మందిని ఆదుకున్నాం.- కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కొడుకు వనమా రాఘవ ఒక కుటుంబాన్ని పొట్టనపెట్టుకుని దర్జాగా బయట తిరుగుతున్నాడు అంటే దానికి కారణం అధికార పార్టీ. యథా లీడర్ తథా క్యాడర్ అన్నట్లు టీఆర్ఎస్ లీడర్లు ఉన్నారు.
కేసీఆర్, కేటీఆర్ పోలీసులను పనివాళ్లలా వాడుకుంటున్నారు. మీరు ప్రజా సేవకులు అనే విషయాన్ని పోలీసులు గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ ఎవరిని చెబితే వారిని అరెస్ట్ చేయడం.. పర్మిషన్లు ఇవ్వకపోవడంతో సరికాదు. ఆంక్షల పేరుతో సంబంధం లేని వారిపై, సంబంధం లేని విషయాలపై కేసులు పెడుతున్నారు. ఇది భావ్యం కాదు. పోలీసులు ప్రజల కోసం పనిచేయాలి. ముఖ్యమంత్రి, మంత్రులకు కాదు. ప్రభుత్వ కూడా ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేయాలి. - ఇకనైనా రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న వారందరికీ రూ.25లక్షల పరిహారం ఇవ్వాలని వైయస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోంది.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.