Sharmila Politics : రెండ్రోజుల కిందట హైదరాబాద్లో వైఎస్ షర్మిల రాజకీయ రచ్చ చేశారు. ప్రత్యర్థులు దాడి చేసిన కారుతో వచ్చి.. నానా హంగామా చేశారు. దీనిపై రాజకీయంగా పెద్ద చర్చే జరుగుతోంది. ఇందులో రాజకీయ పార్టీలు భిన్న కోణాలు చెబుతున్నాయి. ఒక్కో పార్టీ నేతల మాట ఒక్కోలా ఉంది. ప్రధానంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. భైంసాకి దగ్గర్లో ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా బహిరంగ సభ జరిపేందుకు డేట్ ఫిక్స్ చేసుకున్న రోజునే.. షర్మిల హైదరాబాద్లో హంగామా చెయ్యడం వెనక టీఆర్ఎస్ వ్యూహం ఉందని బీజేపీ భావిస్తోంది. సీఎం కేసీఆర్.. ఇదంతా ఆమెతో కావాలని చేయిస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
ఓట్ల చీలిక:
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లడం ద్వారా కేసీఆర్ పార్టీ టీఆర్ఎస్ రెండోసారి భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు మాత్రం అలా చెయ్యట్లేదు. ఐదేళ్ల పాలన తర్వాతే ఎన్నికలకు వెళ్లేందుకు సిద్ధమవుతోంది. ఐతే.. ఓవైపు ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు, మరోవైపు బీజేపీ బలపడుతున్నట్లుగా కనిపిస్తున్న రాజకీయ వాతావరణాన్ని టీఆర్ఎస్ లోతుగా గమనిస్తోందనీ.. బీజేపీ సహా ప్రతిపక్షాలు బలపడకుండా ఉండాలంటే.. ఓట్లను చీల్చివేయడమే సరైన వ్యూహం అని ఆ పార్టీ ఎత్తుగడలు వేస్తోందన్నది బీజేపీ నేతల ఆరోపణ.
షర్మిల పార్టీ బలపడేలా చేస్తే.. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బీజేపీ, కాంగ్రెస్ , షర్మిల పార్టీకి పడతాయి. తద్వారా ఏ పార్టీకీ తగిన మెజార్టీ రాదు. అదే జరిగితే.. బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యలేవు. అదే సమయంలో వైఎస్ షర్మిల పార్టీ అభ్యర్థులకు ఓట్లు వస్తాయే తప్ప.. గెలిచేంత సీన్ ఉండదని గులాబీ పార్టీ లెక్కలు వేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అందువల్లే.. షర్మిలను రెచ్చగొడితే.. ఆటోమేటిక్గా బీజేపీ డౌన్ అవ్వగలదనీ.. భైంసా దగ్గర్లో బీజేపీ సభ హైలెట్ అవ్వకుండా ఉండేందుకే.. షర్మిల కారుపై దాడి జరిగిందనే వాదన, ఆరోపణలు వస్తున్నాయి. వీటికి ఆధారాలు లేకపోయినా.. పొలిటికల్ సర్కిల్లో ఈ విధమైన చర్చ జరుగుతోంది.
Time Traveller : టైమ్ ట్రావెలర్ అంట.. ఫిఫా వరల్డ్ కప్లో గెలిచేదెవరో చెప్పాడు
కాంగ్రెస్ వాదన :
టీఆర్ఎస్ వదిలిన బాణమే షర్మిల అన్నది కాంగ్రెస్ నేతల వాదన. తమ పార్టీకి నష్టం కలిగించేందుకే.. షర్మిలతో లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకొని.. టీఆర్ఎస్ పార్టీ ఆమెతో ఇదంతా చేయిస్తోందని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలు షర్మిల ఏ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారో బయటపెట్టాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. షర్మిల మాత్రం.. ప్రజా సమస్యలపై నిజంగా పోరాడుతుంటే.. ఇలా ఏదో ఒక పార్టీకి అంటగట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా తెలంగాణ రాజకీయాల్లో సడెన్గా షర్మిల ఎపిసోడ్ హాట్ టాపిక్ అయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana News, Telangana Politics, Telugu news, YS Sharmila