(శ్రీనివాస్. పి. న్యూస్ 18తెలుగు కరీంనగర్ ప్రతినిధి)
సంప్రదాయ పంటలతో రైతులకు పెద్దగా లాభాలు రావడం లేదు. అందుకే ఈ మధ్య చాలా మంది రైతులు విభిన్న మార్గాలను ఎంచుకుంటూ భారీగా సంపాదిస్తున్నారు. కరీంనగర్ (Karimnagar)లో కూరగాయల నారు పెంపకంలో పలువురు రాణిస్తూ మంచి ఆదాయాన్ని గడిస్తున్నారు. తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఎక్కువ మంది నర్సరీల (Vegetable Nursery) ఏర్పాటుపై ఆసక్తి చూపుతున్నారు. ఎకరం విస్తీర్ణంలో షేడ్నెట్లు ఏర్పాటు చేసుకొని వివిధ రకాల కూరగాయల నారును పెంచుతూ రైతుల అవసరాలు తీరుస్తున్నారు. కురగాయలు సాగు చేయాలంటే రైతులు ముందుగా నారును సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం గతంలో రైతులు తమ పొలాల వద్ద నారుమడులు సిద్ధం చేసుకొనేవారు . వాతావరణంలో ప్రతికూల పరిస్థితులు తలెత్తితే సరిగ్గా ఎదగక పాడైపోయేవి . ప్రస్తుతం ఈ నర్సరీలు వచ్చాక రైతులకు మేలు జరుగుతోంది. నారుకోసం రైతులు ఇతర జిల్లాలకు వెళ్లేవారు. స్థానికంగా వీటిని ఏర్పాటు చేయడంతో పెద్ద సంఖ్యలో అన్నదాతలు ఇక్కడికి వచ్చి నారును కొనుగోలు చేస్తున్నారు.
ఒక ఎకరా విస్తీర్ణంలో నర్సరీ ఏర్పాటు చేస్తే రూ 90 వేల వరకు ఖర్చు అవుతుండగా సీజన్లో నెలకు రూ.50 వేల నుంచి రూ లక్ష రూపాయల వరకు ఆదాయం ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఎక్కువగా టమాటా, వంకాయ, క్యాబేజీ, మిరప నారును పెంచుతున్నారు. టమాటా, క్యాబేజీ , క్యాలీ ఫ్లవర్ విత్తనాలు మొలకెత్తడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుండగా , పొలాల్లో నాటేందుకు 15 నుంచి 20 రోజుల సమయం పడుతుంది. మిరప వంకాయ 25 రోజుల నుంచి 30 రోజుల సమయానికి పూర్తిస్థాయి అందుబాటులోకి వస్తాయి. కల్తీ విత్తనాల ద్వారా నారు, నాణ్యతలేని నారు పెంపకాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం నర్సరీ యాక్టును తీసుకువచ్చింది. నిర్వాహకులు ఇందులో తమ వివరాలను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. తద్వారా రైతులకు మంచి కూరగాయల నారును ఇవ్వవచ్చని అధికారులు అంటున్నారు.
యువ రైతు జశ్వంత్ రెడ్డి మాట్లాడుతూ..నర్సరీలో అన్ని రకాల కూరగాయల నారును పెంచుతున్నాం. రైతుల అవసరాల మేరకు పూర్తి స్థాయిలో నారును అందుబాటులో ఉంచి, తక్కువ ధరకే అందిస్తున్నాం. నర్సరీ ద్వారా నేను ఉపాధి పొందడమే కాకుండా, పది మందికి ఉపాధి కల్పిస్తున్నాను. రైతుల కోరిక మేరకు పూల నారును సైతం అందుబాటులో ఉంచుతున్నామని అన్నారు. కరీంనగర్ జిల్లాలో తిమ్మాపూర్లోనే 21 నర్సరీలు న్నాయి. ఈ క్రమంలో నకిలీ బెడదను నివారించేందుకు ప్రభుత్వం నర్సరీ యాక్టును తెచ్చింది. కొన్ని నియమ నిబంధనలను విధించింది. ప్రతీ నిర్వాహకుడు వాటికి అనుగణంగానే నర్సరీలను నడపాలని ఉద్యానవనశాఖ అధికారి స్వాతి తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Business, Farmers, Karimnagar