వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి తెలంగాణ (Telangana) ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య కొనసాగుతోన్న వివాదం కీలక మలుపు తిరిగింది. తెలంగాణ నుంచి ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్ గింజ కూడా కొనబోమని, ఇక ఉప్పుడు బియ్యం అనేది చరిత్రే అని కేంద్రం కుండబద్దలుకొట్టింది. అదే సమయంలో సాధారణ బియ్యం సేకరణపైనా దాటవేట ధోరణి ప్రదర్శించింది. ఈ యాసంగి, వచ్చే వానకాలానికి సంబంధించి మామూలు బియ్యాన్ని ఎంతమేరకు కొంటామనే విషయాన్ని కేంద్రం తేల్చలేదు. తెలంగాణ మంత్రుల బృందం గట్టిగా పట్టుపట్టగా, మామూలు బియ్యం సేకరణ అంశంపై చర్చించేందుకు ఈనెల 26న మరోసారి కలుద్దామని కేంద్రం తెలిపింది. కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో తెలంగాణ మంత్రుల బృందం జరిపిన చర్చల్లో ఇప్పటిదాకా వచ్చిన ఫలితమిదే కావడంతో సీఎం కేసీఆర్ (CM KCR) ముందు నుంచీ చెబుతున్నదే జరిగిందని, తెలంగాణ వ్యవసాయ రంగంపై కేంద్రం చిన్న చూపు చూస్తోందనే విషయం మరోసారి రుజువైందని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వివరాలివి..
కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
తెలంగాణ వరి ధాన్యం సేకరణ, నీటి వాటాల పంపకం, విభజన హామీల అమలు తదితర అంశాలపై క్లారిటీ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో మంత్రులు, అధికారుల బృందం ఢిల్లీలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. గడిచిన మూడు రోజులుగా సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్ తదితరులు ఢిల్లీలోనే ఉన్నారు. టీఆర్ఎస్ పార్లమెంటరీ నేత కేశవరావు, లోక్ సభ నేత నామా నాగేశ్వరరావు, ఇతర ఎంపీలు తోడై కేంద్రంలోని వివిధ శాఖల మంత్రులను వరుసగా కలుస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులు, అధికారుల బృందం.. మంగళవారం నాడు కేంద్ర ఆహార మంత్రి గోయల్, వ్యవసాయ మంత్రి తోమర్ ను కలిశారు.
సాధారణ బియ్యంపైనా నో క్లారిటీ
తెలంగాణలో ఉత్పత్తి అయ్యే బాయిల్డ్ రైస్ అసలే కొనబోమని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పష్టంచేశారు. యాసంగి బియ్యం ఏ మేరకు కొంటారని తెలంగాణ బృందం అడగ్గా, స్పష్టమన క్లారిటీ ఇవ్వలేదు. బాయిల్డ్ రైస్ పక్కన పెడితే, సాధారణ ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాల్సిందేనని తెలంగాణ మంత్రుల బృందం పట్టుపట్టగా, రెండు రోజుల్లో చెప్తామని గోయల్ సమాధానమిచ్చారు. కేంద్రం క్లారిటీ ఇచ్చాకే హైదరాబాద్ తిరిగెళతామని, అప్పటిదాకా ఇక్కడే ఉంటామని తెలంగాణ బృందం చెప్పడంతో 26వ తేదీన సమావేశాన్ని ఫిక్స్ చేశారు గోయల్.
కేసీఆర్ చెప్పిందే జరిగింది..
కేంద్ర మంత్రులతో సుదీర్ఘంగా భేటీ అయిన తెలంగాణ మంత్రులు.. ధాన్యం కొనుగోలు పరిమితిని పెంచాలని కోరగా, సానుకూల స్పందన వచ్చింది. తెలంగాణలో వరిసాగు 62లక్షల ఎకరాలకు చేరిందని అధికార టీఆర్ఎస్ వాదించగా, కేంద్రం మాత్రం తెలంగాణ వరి సాగు విస్తీర్ణాన్ని 58.66 లక్షల ఎకరాలుగా ధృవీకరించింది. అయినాసరే, ఎంత వరి ధాన్యాన్ని కొంటారనే అంశాన్ని కేంద్రం పెండింగ్‌లోనే ఉంచింది. ఈనెల 26న మరింత స్పష్టతతో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని కేంద్రం పేర్కొంది. పేర్కొన్నది. దీంతో ఈనెల 26 వరకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం ఢిల్లీలోనే ఉండి కేంద్రం నిర్ణయంపై తెలుసుకొన్నాకే రాష్ట్రానికి తిరిగి రావాలని నిర్ణయించారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం వైఖరికి సంబంధించి సీఎం కేసీఆర్ వాదనే నిజమైందని, రాష్ట్ర బీజేపీ నేతల వాదన తప్పని తేలిపోయిందని మంత్రులు అంటున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Minister ktr, Paddy, PADDY PROCUREMENT, Piyush Goyal, Telangana, Union government