WOMENS DAY 2022 KCR GOVT DECLARES HOLIDAY FOR ALL WOMEN EMPLOYEES IN TELANGANA ON INTERNATIONAL WOMENS DAY MKS
Women's day 2022: మంగళవారం సెలవు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.. పోటాపోటీగా ఈవెంట్లు!
ప్రతీకాత్మక చిత్రం
మహిళా దినోత్సవమైన మంగళవారం(మార్చి 8న) రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులు అందరికీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. కాగా, గవర్నర్, ముఖ్యమంత్రి నివాసాల్లో మహిళల వేడుకలు పోటాపోటీగా జరిపారనే విమర్శలు వెల్లువెత్తాయి..
అంతర్జాతీయ మహిళా దినోత్సం (International Womens Day) సందర్భంగా కేసీఆర్ (KCR)సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. మహిళా దినోత్సవమైన మంగళవారం(మార్చి 8న) రాష్ట్రంలోని మహిళా ఉద్యోగులు అందరికీ సెలవు ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏడాది మహిళా ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ఇస్తుండటం తెలిసిందే. కాగా, గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు పెరిగాయనే వార్తల నడుమ రాజ్ భవన్, రాష్ట్ర సర్కారు దాదాపు పోటాపోటీగా విమెన్స్ డే ఈవెంట్లు జరిపాయి.
మహిళా దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం 6 గంటలకు రాజ్ భవన్ లో వేడుకలు నిర్వహించనున్నట్లు గవర్నర్ తమిళిసై తొలుత ప్రకటించారు. అందులో పాల్గొనాల్సిందిగా మహిళా మంత్రులకు ఆహ్వానాలు కూడా పంపారు. కానీ అదే సమయానికి తాము కూడా ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. గవర్నర్ తో నెలకొన్న విబేధాల నేపథ్యంలోనే కేసీఆర్ పంతానికి పోయి స్పెషల్ ఈవెంట్ నిర్వహింపజేశారని ప్రతిపక్షాలు విమర్శించాయి.
మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేసీఆర్ మహిళా బంధు పేరిట సోమవారం తెలంగాణ భవన్లో వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుధ్య కార్మికులు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, వివిధ రంగాలలో విశేష ప్రతిభ కనపరిచిన మహిళలను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ వాణి దేవి, గ్రేటర్ హైదరాబాద్ మేయర్ శ్రీమతి గద్వాల్ విజయలక్ష్మి, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి తదితరులు ఘనంగా సత్కరించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణలోని మహిళలకు సరైన గుర్తింపు వచ్చిందని మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు.
‘సుస్థిరమైన రేపటి కోసం ఈ రోజు లింగ సమానత్వం’అనే థీమ్ తో ఈ ఏడాది మహిళా దినోత్సవం జరుగుతోంది. లింగ సమానత్వాన్ని సాధించడానికి 2022 సంవత్సరం కీలకమైనదని, లింగ సమానత్వంతోనే మహిళలకు స్థిరమైన భవిష్యత్తు, సమాన భవిష్యత్తు, మన పరిధి వస్తుందని ఐక్యరాజ్యసమితి మహిళా విభాగం పేర్కొంది. సమాన వేతనం, ఓటు హక్కు కోసం కదంతొక్కిన అమెరికన్ మహిళలు 1908లో న్యూయార్క్ నగరంలో చారిత్రక ప్రదర్శన నిర్వహించారు. వారి డిమాండ్లను గుర్తించి అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. 1911నాటికి యూరప్ దేశాలూ పాటించాయి. 1975లో ఐక్యరాజ్యసమితి మొదటిసారిగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించింది. అప్పటి నుంచి ప్రపంచంలోని అన్ని దేశాలూ ఫాలో అవుతున్నాయి.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.