ఆలయాల్లో దేవుడి పూజలకు వినియోగించే పూలను ఆ తర్వాత ఏం చేస్తారు? పూజా వ్యర్థాలను చెత్తలో పడేస్తారా? ఈ డౌట్స్ చాలా మందికి వచ్చి ఉంటుంది. కానీ ప్రధాన ఆలయాల్లో పూజా వ్యర్థాలను వృథా చేయరు. వాటితో వివిధ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం (Tirumala Temple)తో పాటు ఇప్పటికే తిరుమల తిరుపతి అలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో పూజలు,ఇతర రోజువారీ ఆచారాలకు ఉపయోగించే పూలతో అగరుబత్తులు, దూది వత్తులు, పెన్సిళ్లు తయారు చేస్తున్నారు. ఇదే తరహాలో యాదాద్రి (Yadadr Temple)లోనూ పూజా వ్యర్థాలతో వివిధ ఉత్పత్తులను తయారు చేస్తున్నారు అక్కడి మహిళలు. ఆలేరుకు చెందిన వాగ్మీ (Vagmi) మహిళా సంఘం సభ్యులు (Women self help Group).. యాదాద్రి ఆలయ నుంచి పూలు, ఆవుపేడ, కొబ్బరి చిప్పలను సేకరించి... అరగబత్తులు, దూది ఒత్తులు, దీపావళి పెన్సిళ్లు ఉత్పత్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందాలనే లక్ష్యంతో 'వాగ్మీ' బ్రాండ్ పేరిట వాటిని రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఆయా ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదలయ్యాయి.
జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి చొరవతో.. తహసీల్దారు పి. రామకృష్ణ ప్రత్యేక పర్యవేక్షణలో.. ఆలేరులోని ఇండోర్ స్టేడియంలో వాగ్మీ ఉత్పత్తుల తయారీ జరుగుతోంది. యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వినియోగించే పూలు, భక్తులు సమర్పించే వస్తువులు, తులసీ సుగందంతో కటాక్ష అగరు బత్తులు, అష్టగంధ సువాసనతో వాగ్మి సమధుర అగరు బత్తులు తయారు చేస్తున్నారు. వీటితో పాటు యాదాద్రి గోశాలలో లభించే ఆవు పేడ, భక్తులు నరసింహస్వామికి సమర్పించే కొబ్బరి చిప్పల పొడి, శ్రీలక్ష్మి ఆలయ ప్రాంగణంలో ఉపయోగించే పువ్వులు, తులసీ ఆకులు, యాదాద్రి చుట్టుపక్కల పవిత్ర ప్రదేశాల్లో పండించే పూలు, తులసి పత్రాలను ఉత్పత్తుల తయారీలో ఉపయోగిస్తున్నారు. మార్కెటింగ్ పరంగా ఇబ్బందులు తలెత్తకుండా మొదటగా యాదాద్రి దేవస్థానం ఆధ్వర్యంలో కొండపైన, భువనగిరి కలెక్టరేట్ వద్ద ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్టాళ్లలో విక్రయాలు చేపట్టారు. తద్వారా మహిళా సంఘాల స్వయం ఉపాధి పొందుతున్నాయి.
అగరుబత్తుల తయారీకి అవసరమైన యంత్రాలను దూర ప్రాంతాల నుంచి కొనుగోలు చేశారు. ఇందుకు కలెక్టర్ ప్రత్యేక చొరవ చూపారు. ప్రత్యేక సుమారు రూ.6 లక్షలకు పైగా విలువైన యంత్రాలు, పరికరాలు, ముడి పదార్థాలు సమకూర్చేందుకు సహకారం అందించారు. వాగ్మీ సభ్యులు సైతం కొంత మొత్తాలను పోగుచేసి వెచ్చించారు. ఈ పరిశ్రమను తహసీల్దారు పి. రామకృష్ణ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఆలేరు, యాదగిరిగుట్ట పట్టణాలకు చెందిన 18 మంది రిసోర్స్ పర్సన్లు పరిశ్రమలో పనిచేస్తున్నారు. రానున్న రోజుల్లో వాగ్మి పేరిట కుంకుమ, పసుపు, కొబ్బరిచిప్పలతో ఆకృతులను తయారు చేసి విపణిలో విక్రయానికి తీసుకొస్తామని సంఘ ప్రతినిధులు చెబుతున్నారు. భవిష్యత్లో బొమ్మలు, విగ్రహాలు,, పసుపు పొడి, కుంకుమ, ఫొటో ఆల్బమ్స్ తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టు తో స్థానిక మహిళలకే కాకుండా ఈ ప్రాంతంలోని ఇతర రంగాల వారికి కూడా ఉపాధి లభిస్తుందని ఆలేరు తహశీల్దారు రామకృష్ణ తెలిపారు. మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నష్టాలు రాకుండా కలెక్టర్ సూచనల మేరకు అవసరమైన చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Telangana, Yadadri, Yadadri temple