దసరా పండుగ పర్వదినాన్ని గ్రామాల్లో అంతా ఒక్కటిగా ఐకమత్యంగా ఉండి, ఊరి బయటకు వెళ్లి జమ్మిచెట్టుకు పూజచేస్తారు. అనంతరం గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులను కలసి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకోవడం ఆనవాయితీ. కానీ ఈ గ్రామంలో ఒకే పార్టీకి సంబంధించిన వారు రెండు గ్రూపులుగా ఏర్పడి రెండు జమ్మిచెట్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఏకంగా మహిళా సర్పంచ్ ఇంటికి వెళ్లి ఆమెపై దాడి చేసి ఓ వ్యక్తి గాయపరచగా ఆమె న్యాయం కోసం కేశంపేట పోలీసులను ఆశ్రయించారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. కేశంపేట గ్రామంలో మొదట అందరూ కలసి వేపచెట్టుకు పూజచేశారు. అనంతరం సామాజిక దూరాన్ని పాటిస్తూ జమ్మిచెట్టు దగ్గరకు బయలుదేరారు. టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు మురళీధర్ రెడ్డితో పాటు మరికొంత మంది కార్యకర్తలు వారికి అడ్డుగా వచ్చారు. జమ్మిచెట్టు మరోచోట ఉందని, అక్కడికి వెళ్దామని చెప్పారు. దీంతో అందరూ అవాక్కయ్యారు. అదేంటి జమ్మిచెట్టు ఊరు బయట పెట్టామని చెప్పాంగా మళ్ళీ ఇదేంటని సర్పంచ్ వర్గం ప్రశ్నించింది. అనంతరం సర్పంచ్ ఏర్పాటు చేసిన చెట్టు వద్దకు అందరూ వెళ్లారు. మండల పార్టీ అధ్యక్షుడితో పాటు మరికొంత మంది మరోచోట జమ్మిచెట్టు పెట్టి పూజలు చేశారు. దీంతో టీఆర్ఎస్ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు ఆ గ్రామంలో బహిరంగమయ్యాయి.

సర్పంచ్ రేణుక
జమ్మిచెట్టుకు పూజచేసి ఇంటికి చేరుకున్న మహిళ సర్పంచ్ రేణుక వద్దకు గ్రామానికి చెందిన తిమ్మగళ్ళ భూపాల్ వెళ్లాడు. జమ్మిచెట్టు విషయంపై ఆమెతో వాగ్వాదానికి దిగాడు.అనంతరం ఆమెపై దాడి చేశాడు. దీంతో సర్పంచ్ చేతులకు గాయాలయ్యాయి. ఈ విషయమై బాధితురాలు పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దసరా పండుగ రోజు ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య ఈ గొడవ రాజేసిన వ్యక్తులపై అటు పోలీసులు, ఇటు పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే.
దసరా రోజు సాయంత్రం పూజ ముగిసిన అనంతరం చెట్టు నుంచి జమ్మి ఆకులను తుంచుకుని వాటిని బంగారంలా భావిస్తూ భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. ఆ ఆకులను తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్న ఆధ్మాత్మిక ప్రాధాన్యత రీత్యా అవి బంగారంతో సమానం అనడంలో ఏమాత్రం సందేహం లేదు. జమ్మి ఆకులను శుభంగా భావించి, జమ్మి కొట్టేందుకు రాలేకపోయిన పెద్దల చేతిలో ఉంచుతారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలనూ సాధించాలని కోరుకోవడమే. పిల్లల మనసులోని ఈ విజయకాంక్షను గ్రహించిన పెద్దలు, వారి కోరికలు నెరవేరాలని తమ దీవెనలను కూడా జతచేస్తారు.
అలాగే, దసరా రోజున పాలపిట్టను కూడా చూడాలన్న నియమం ఒకటి ఉంది. పాండవులు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద నుంచి తీసుకుని తిరిగి తమ రాజ్యానికి చేరుకుంటుండగా, వారికి పాలపిట్ట కనిపించిందనీ... అప్పటి నుంచీ వారికి సకల విజయాలూ సిద్ధించాయని ఒక నమ్మకం. అందుకనే విజయానికి శుభసూచకంగా పాలపిట్టను దర్శించే ఆనవాయితీ ఉంది.
Published by:Ashok Kumar Bonepalli
First published:October 25, 2020, 20:55 IST