• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • WOMAN DIED IN RTC BUS CONDUCTOR DRIVER LEAVES HER BODY ON ROAD IN VIKARABAD SK

ఆర్టీసీ బస్సులో మహిళ మృతి.. కరోనా భయంతో నడిరోడ్డుపై దించేశారు..

ఆర్టీసీ బస్సులో మహిళ మృతి.. కరోనా భయంతో నడిరోడ్డుపై దించేశారు..

ప్రతీకాత్మక చిత్రం

కిష్టాపూర్ సర్పంచ్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన ఒక ఆటోను పంపించారు. అక్కడి నుంచి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. మృతదేహానికి కరోనా పరీక్షలు చేయగా కరోనా నెగెటివ్ వచ్చిందని డాక్టర్లు తెలిపారు.

  • Share this:
    కరోనా వైరస్ మనుషుల్లోని మానవత్వాన్ని చంపేస్తోంది. తోటి మనిషి కాపాడమని ప్రాధేయపడినా ఎవరూ సాయం చేయడం లేదు. ఇక చనిపోయిన వారిని కుక్కల కంటే హీనంగా చూస్తున్నారు. తాజాగా వికారాబాద్ జిల్లా ధరూర్‌లో హృదయ విదారకర ఘటన జరిగింది. గొంతు నొప్పితో బాధపడుతూ ఓ మహిళ ఆర్టీసీ బస్సులో చనిపోయింది. ఐతే కరోనాతోనే చనిపోయిందన్న అనుమానంతో.. డ్రైవర్, కండక్టర్ వారిని నడిరోడ్డుపైనే దించేశారు. కరోనా లేదని.. ఇటీవల చేయించుకున్న టెస్ట్‌లో నెగెటివ్ వచ్చిందని చెప్పినా వినలేదు.


    ధరూర్‌ మండలానికి చెందిన చిన ఆశప్ప భార్యకు గొంతులో కణతి అయింది. ఆహారం తీసుకోవడంతో పాటు శ్వాస తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో చికిత్స చేయించుకునేందుకు మంగళవారం తాండూరులో బస్సు ఎక్కారు. ఆశప్పతో పాటు అతడి భార్య, ఇద్దరు కుమార్తెలు హైదరాబాద్‌కు బయలుదేరారు. ఐతే మార్గమధ్యలో ఆమెకు గొంతు నొప్పి తీవ్రమై మరణించింది. ఆమె కరోనాతోనే చనిపోయిందని తోటి ప్రయాణికులు భయపడిపోయారు. ఈ క్రమంలోనే బస్సు కండక్టర్, డ్రైవర్ వారిని నడిరోడ్డుపై వదిలేశారు. దిక్కుతోచని స్థితిలో ఆశప్ప, అతడి ఇద్దరు కుమార్తెలు మృతదేహంతో రోడ్డుపైనే ఉండిపోయారు. తల్లి కోసం వారు రోదిస్తున్న దృశ్యాలు స్థానికులను కంటతడి పెట్టించాయి.

    కాసేపటి తర్వాత ఆశప్ప అల్లుడు.. కిష్టాపూర్ సర్పంచ్‌కు సమాచారం ఇవ్వడంతో ఆయన ఒక ఆటోను పంపించారు. అక్కడి నుంచి మృతదేహాన్ని ఇంటికి తరలించారు. మృతదేహానికి కరోనా పరీక్షలు చేయగా కరోనా నెగెటివ్ వచ్చిందని డాక్టర్లు తెలిపారు. కాగా, నెల రోజుల క్రితం కూడా మెదక్‌లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఆస్తమాతో ఇబ్బందిపడుతున్న ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఏ ఒక్కరూ స్పందించకపోవడంతో రోడ్డు పక్కనే అతడు మరణించాడు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు