WILL TELANGANA GOVERNMENT STOP RYTHU BANDHU TO FARMERS WHO CULTIVATE PADDY CM KCR MAY TAKE DECISION TOMORROW AK
Telangana: వారికి రైతుబంధు నిలిపేస్తారా ?.. రేపు కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్ ?
ప్రతీకాత్మక చిత్రం
Telangana: ఈ అంశంపై ముందుగా రేపు జరగబోయే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో సమావేశమైన తరువాత నిర్ణయం తీసుకునే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది.
తెలంగాణలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్.. రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి ఏడాదికి రూ. 10000 అందిస్తోంది. ఈ మొత్తాన్ని రెండు విడతలుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. త్వరలోనే యాసంగి సీజన్‌కుగానూ రైతులకు రైతుబంధు(rythu bandhu) నగదు ఇచ్చేందుకు ఓ వైపు కసరత్తు జరుగుతుండగానే.. మరోవైపు ఈ పథకాన్ని వరి పండించే రైతులకు ఇస్తారా ? లేదా ? అనే చర్చ మొదలైంది. కేంద్రం రైతులు పండించే వరిని కొనే విషయంలో షరతులు విధించడంపై తెలంగాణ ప్రభుత్వం (telangana government) ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అయితే కేంద్రం ఈ విషయంలో వెనక్కి తగ్గకపోవడంతో.. యాసంగితో వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు వేయాలని రైతులకు సూచించింది. ఇందుకు సంబంధించి పలుసార్లు రైతులకు సూచనలు చేసింది.
అయితే రైతుల్లో ఎక్కువమంది వరి సాగు విషయంలో ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నట్టు కనిపించడం లేదని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రైతులు వరి సాగుకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టేందుకు ఏం చేయాలనే దానిపై ఆలోచన చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. వరి సాగు చేసే రైతులకు రైతుబంధు నిలిపేయాలనే ఆలోచన కూడా చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ రకమైన ప్రతిపాదనను అధికారులు తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుకు తీసుకొచ్చారని.. కానీ ఆయన మాత్రం ఈ విషయంలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
మరోవైపు ఈ అంశంపై ముందుగా రేపు జరగబోయే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలతో సమావేశమైన తరువాత నిర్ణయం తీసుకునే యోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. రైతుబంధు పథకం టీఆర్ఎస్కు ఎంతో మంచి పేరు తెచ్చిందని.. ఈ పథకం విషయంలో ఇబ్బందులు వస్తే రైతులు టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారే అవకాశం లేకపోలేదనే భావన ఆ పార్టీ వర్గాల్లో ఉంది. రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేలా మరో రకంగా అవగాహన కల్పించాలనే అభిప్రాయం కూడా టీఆర్ఎస్ శ్రేణుల్లో ఉంది. ఈ నేపథ్యంలో వరి సాగు చేసే రైతులకు రైతుబంధు పథకం అమలు అవుతుందా ? లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.
మరోవైపు కొద్దిరోజుల క్రితం మీడియా సమావేశంలో రైతుబంధు పథకం కొనసాగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. దీంతో ఏ పంటలు సాగు చేసినా.. రైతుబంధు వస్తుందని రైతులు భావిస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం రైతులు వరి నుంచి వేరే పంటల వైపు మళ్లేందుకు ఈ రకమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పే ప్రయత్నం చేస్తోందని సమాచారం. మొత్తానికి రైతుబంధు విషయంలో టీఆర్ఎస్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంటుందా ? అన్నది ఉత్కంఠ రేపుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.