తెలంగాణలో ఇకపై ఏ ఎన్నిక జరిగినా ఇదే రకమైన ఫలితాలు వస్తాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మంచి సంఖ్యలో సీట్లు రావడంతో కార్యకర్తలతో కలిసి బండి సంజయ్ పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. ఈ విజయం గ్రేటర్ హైదరాబాద్ ప్రజల విజయమని ఆయన అన్నారు. ఈ ఎన్నికలు సీఎం కేసీఆర్‌కు కనువిప్పు కావాలని అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ గడీని వదిలి బయటకు రావాలని అన్నారు. వారి ఎమ్మెల్యేలు, మంత్రులకైనా అపాయింట్‌మెంట్ ఇవ్వాలని అన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ప్రజా సమస్యలపైనే జరిగాయని ఆయన అన్నారు.
ఎన్నికల సందర్భంగా తమ కార్యకర్తలను ప్రభుత్వం ఎంతగానో ఇబ్బంది పెట్టిందని ఆరోపించిన బండి సంజయ్.. అయినా పట్టుదలగా పార్టీ విజయం కోసం పని చేసిన కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. దుబ్బాకలో కేసీఆర్ అల్లుడికి షాక్ తగిలిందని.. ఇప్పుడు ఆయన కుమారుడికి తగిలిందని అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎన్నికల కమిషనర్, డీజీపీలకు అంకితం చేస్తున్నానని అన్నారు. ఓటర్లు టీఆర్ఎస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పారని అన్నారు. ప్రజలు నిజాలను నమ్మారని.. అందుకే బీజేపీ అభ్యర్థులను ఈ సంఖ్యలో గెలిపించారని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అభివృద్ధి కోసం తాము సహకరిస్తామని.. అయితే కేంద్రం నుంచి వచ్చే నిధులను దారి మళ్లించి పేర్లు మారిస్తే మాత్రం తమ సభ్యులు పోరాటం చేస్తారని హెచ్చరించారు. తాము ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజల కోసం పోరాటం చేస్తామని అన్నారు. తాము ఓడిపోయిన స్థానాల్లో కూడా ఓడిపోయామని అన్నారు. సీట్లు సంఖ్య నాలుగు నుంచి 40కిపైగా పెరిగిందని.. ఓట్ల శాతం గణనీయంగా పెరిగిందని అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:December 04, 2020, 19:55 IST