KCR Target : కేసీఆర్‌ టార్గెట్‌ వాళ్లేనా..? ఇప్పటికే వారిపై నిఘా.. నివేదికలు

సీఎం కేసీఆర్(ఫైల్ ఫొటో)

khammam : రాజకీయ కారణాలు.. అసైన్‌మెంట్‌ భూముల ఆక్రమణల ఆరోపణలతో తన క్యాబినెట్‌లోని సీనియర్‌ మంత్రి ఈటెల రాజేందర్‌పై బర్తరఫ్‌ వేటేసిన సీఎం కేసీఆర్‌.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్షేత్ర స్థాయిలో అక్రమాలకు పాల్పడుతూ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, తాజాగా పదవులు ఆశిస్తున్న మాజీలపైనా నజర్‌ పెట్టారా ?

  • Share this:


రాజకీయ కారణాలు.. అసైన్‌మెంట్‌ భూముల ఆక్రమణల ఆరోపణలతో తన క్యాబినెట్‌లోని సీనియర్‌ మంత్రి ఈటెల రాజేందర్‌పై బర్తరఫ్‌ వేటేసిన సీఎం కేసీఆర్‌.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని క్షేత్ర స్థాయిలో అక్రమాలకు పాల్పడుతూ, ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్న అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు, తాజాగా పదవులు ఆశిస్తున్న మాజీలపైనా నజర్‌ పెట్టారు. ఈమేరకు ఎప్పటికప్పుడు నిఘా వర్గాల ద్వారా సమాచారాన్ని తెప్పించుకుంటున్నట్టు భొగట్టా. ఈ క్రమంలోనే భద్రాచలం ఏజెన్సీలో జరుగుతున్న పలు అక్రమాలపై రకరకాల స్థాయుల్లో వస్తున్న ఫిర్యాదులపై సమగ్ర విచారణకు గతంలోనే ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో తరచూ చోటుచేసుకుంటున్న పోడు వివాదాలు.. ప్రభుత్వానికి చెందిన విలువైన భూముల ఆక్రమణలు.. కోట్ల విలువైన ఇసుక దందాలపై ప్రభుత్వం ఎప్పటికప్పుడు సమాచారం తీసుకుంటోంది. ఇలా అక్రమ ఇసుక దందా, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, పోడు పేరిట అటవీ ఆక్రమణలతో సంబంధాలున్నట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మాజీ ప్రజా ప్రతినిధి, మరో ప్రజా ప్రతినిధిపైనా దృష్టి సారించినట్టు సమాచారం.

భద్రాచలం ఏజెన్సీ.. విలువైన ప్రకృతి సంపదలకు నిలయం. ఓవైపు రోజురోజుకూ విలువను సంతరించుకుంటున్న గోదావరి ఇసుక.. అరుదైన వృక్షజాతుల కలప.. మరోవైపు రోడ్ల విస్తరణతో రేట్లు పెరిగిపోయిన భూములు.. ప్రస్తుతం వీటిపై పెద్దల కన్నుపడింది. వీటిని అక్రమంగా తరలించడం.. ప్రభుత్వాదాయానికి భారీగా గండికొట్టడం.. సొంత బొక్కసాలను నింపుకోవడంపైనే ఇక్కడి నేతలు.. దళారులు దృష్టిసారించారు. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక, మణుగూరు మండలాలు.. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లోని గోదావరి తీర ప్రాంతం ఆదాయవనరుగా మారింది. టీఎస్‌ఎండీసీ పరిధిలో ఉన్న ఇసుక రీచ్‌లలో సైతం ఇసుక దందా సాగుతున్నట్టు ఇప్పటికే ఇంటెలిజెన్స్‌ నివేదికలు ప్రభుత్వానికి అందినట్టు చెబుతున్నారు. ఈ ప్రాంతంలోని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులపై ప్రభుత్వ పెద్దలు ప్రత్యేక దృష్టి సారించినట్టు చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న ఈ అక్రమాలలో అసెంబ్లీ మాజీ స్పీకర్‌ పేరు పెద్ద ఎత్తున వినిపిస్తోంది. అయితే ఇలాంటి భూ అక్రమాలు, ఇసుక దందాల్లో ఆయన నేరుగా ఇన్‌వాల్వ్‌ అయ్యారా.. లేక ఎవరైనా ఆయనతో ఉన్న బంధుత్వాన్ని, లేదా సామాజికవర్గ సంబంధాలను ఉపయోగించుకుంటున్నారా.. అన్న కోణంలోనూ విచారణ సాగుతోంది. దీనికితోడు ఈ ప్రాంతానికి చెందిన మరో ప్రజా ప్రతినిధిపైనా ప్రభుత్వ పెద్దలు నజర్‌ పెట్టినట్టు నిఘా వర్గాలు చెబుతున్నాయి.

ఎక్కడ మొదలైంది..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక తహశీల్దార్ గా పదోన్నతిపై వరంగల్‌ జిల్లాకు చెందిన కె. విక్రమ్ కుమార్ ఛార్జి తీసుకున్నారు. అప్పటి నుంచి ఇక్కడ జరుగుతున్న భూ దందాలు, ఇసుక అక్రమ రవాణా లాంటి వాటిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ మొత్తం అక్రమాలపై ఎవరెవరు ఉన్నారన్న దానిపై ఓ సవివర నివేదికను కలెక్టర్‌ డాక్టర్‌ ఎం.వి.రెడ్డికి సమర్పించారు. తహశీల్దార్‌ విక్రమ్‌కుమార్‌ తాను రూపొందించిన నివేదికలో ఏఏ సర్వే నెంబర్లలో ఎంతెంత భూమి అన్యాక్రాంతం అయ్యింది.. పోడు పేరిట గిరిజనేతరులు ఎవరెవరు అడవుల్ని ఆక్రమిస్తున్నారు.. పోడు పేరిట అటవీ శాఖ అధికారులపై తరచూ జరుగుతున్న దాడుల వెనుక ఎవరున్నారన్న దానిపై సమగ్రంగా నివేదించినట్టు సమాచారం. తహశీల్దార్‌ అందించిన నివేదిక (Rc No. B/235/2021) ను కలెక్టర్‌ ఉన్నది ఉన్నట్టుగా ప్రభుత్వానికి పంపినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి.

తహశీల్దార్ కె. విక్రమ్ కుమార్ కలెక్టర్ కు సమర్పించిన నివేదిక ప్రకారం…. గిరిజనేతరులైన కొందరు బడా రియల్టర్లు, ఓ సామాజికవర్గానికి చెందిన గిరిజనేతరులు కలిసి మణుగూరు-ఏడూళ్ల బయ్యారం ప్రధాన మార్గంలోని అత్యంత విలువైన ప్రభుత్వ భూముల కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. ఉప్పాక రెవెన్యూ గ్రామానికి చెందిన సర్వే నెం. 987లో గల 2.10 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. బయ్యారం క్రాస్ రోడ్ సమీపాన మణుగూరు-ఏటూరునాగారం జాతీయ రహదారి నెం. 163 వద్ద గల ఈ భూమి భద్రాద్రి పవర్ స్టేషన్ కు సమీపాన ఉంది. ఎమ్మార్వోతోపాటు మండల గిర్దావర్-1, సర్వేయర్, వీఆర్ఓ లు సదరు స్థలాన్ని ఈనెల 11వ తేదీన సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఓ పెద్ద రియల్టర్ (పేరు కూడా ఎమ్మార్వో ప్రస్తావించారు.) ఆయా ప్రభుత్వ స్థలంలో రేకులతో మూడు తాత్కాలిక షెడ్లను నిర్మిస్తున్నట్లు తనిఖీ సందర్భంగా గుర్తించారు. రెవెన్యూ అధికారిగా తనకున్న అధికారాలతో చట్టం ప్రకారం ప్రభుత్వ స్థలాలను పరిరక్షిస్తూ తాత్కాలికంగా నిర్మించిన మూడు షెడ్లను ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఉప్పాక రెవెన్యూ గ్రామంలోని సర్వే నెం. 987లో గల స్థలం ప్రభుత్వానికి చెందినదిగా స్పష్టం చేస్తూ, దురాక్రమణకు పాల్పడినవారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ డిస్‌ప్లే బోర్డులు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఈనెల 11వ తేదీన (Rc No. B/234/2021) ద్వారా ఉన్నతాధికారులకు నివేదికను కూడా సమర్పించారు. ఈ ఘటనకు ముందు కూడా ఇదే స్థలానికి ఎదురుగా గల సర్వే నెం. 683లోని బయ్యారం క్రాస్ రోడ్డు వద్ద గల 1.24 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా రియల్టర్లు కబ్జా చేసేందుకు ప్రయత్నించారు. ఈ స్థలాన్ని పినపాక తహశీల్దార్ గా పనిచేసిన శిక్షణ ఐఏఎస్‌ అధికారి అనుదీప్ దురిశెట్టి (Rc No. B/883/2019) ద్వారా పరిరక్షించారు. అదే ఐఏఎస్‌ అధికారి ప్రస్తుతం ఆ జిల్లాలో అదనపు కలెక్టర్‌గా ఉన్న విషయం తెలిసిందే.

నివేదికలో ఏముంది..

కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ఏ విధంగా ఆక్రమిస్తున్నారు.. గిరిజనుల పేరిట సాగుతున్న పోడుతో ఇప్పటిదాకా ఎన్ని వందల ఎకరాలను గిరిజనేతరులు దురాక్రమణ చేశారు..? వారి వెనుక ఉన్న రాజకీయ శక్తుల వివరాలను పొందుపర్చారు. అదే విధంగా మరికొన్ని విలువైన ప్రభుత్వ స్థలాలను స్థానిక రియల్టర్లు, గిరిజనేతరులు కలిసి కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతేగాక ప్రభుత్వానికి ఎటువంటి రాయల్టీ చెల్లించకుడా, నియమ, నిబంధనలకు విరుద్ధంగా స్థానికుడొకరు పదేళ్లుగా ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. విలువైన ప్రభుత్వ స్థలాల కబ్జాలకు పాల్పడుతున్న బడా రియల్టర్ ఒకరు, పదేళ్లుగా ఇసుక అక్రమ దందాకు పాల్పడుతున్న మరో వ్యక్తి తదితరుల అక్రమాలను నివేదికలో పేర్కొన్నారు. ప్రతి అక్రమానికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష వ్యక్తుల వివరాలు, హోదాలను పొందుపర్చినట్టు చెబుతున్నారు. దీంతో ప్రభుత్వ పెద్దలు ఎప్పుడు ఎవరిపై ఎలాంటి చర్యలకు పూనుకుంటారోనన్న చర్చ ఈ ప్రాంతంలో సాగుతోంది.
Published by:yveerash yveerash
First published: