Khammam : ఖమ్మం మేయర్ ఎవరు ? ఎవరి నిర్ణయం ఫైనల్.. మే 8న ఏం జరగనుంది ?

మంత్రి అజయ్ కుమార్ ఫైల్ ఫోటో

Khammam mayor : ఆ పదవికి 29 మంది పోటీ.. ఖమ్మం మునిసిపల్‌ మేయర్‌ పదవికి మహిళామణులు, తేల్చడం మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌కు కత్తిమీద సామే ,.సీల్డు కవర్ ఎంపిక ఉంటుందా..మంత్రి పువ్వాడకు వదిలేస్తారా..?

 • Share this:
  ఖమ్మం జిల్లా జి.శ్రీనివాసరెడ్డి, న్యూస్‌18 తెలుగు కరస్పాండెంట్‌

  గత కొద్దిరోజులుగా ఖమ్మంలో ఉన్న ఎన్నికల ఫీవర్‌ కాస్తా ముగిసి.. ఇప్పుడు మేయర్‌ కుర్చీ ఎవరిదన్న దానిపై అందరూ దృష్టి పెట్టారు. మేయర్‌ స్థానం మహిళా జనరల్‌ కావడం.. ఎక్కువ డివిజన్లు గెలుచుకున్న తెరాస పార్టీలో ఉన్న 29 మంది మహిళా కార్పోరేటర్లు అందరూ ఇప్పుడు పోటీలో ఉన్నట్టే భావిస్తున్నారు. ఏదో ఒక ఈక్వేషన్‌లో తమకు అవకాశం రాకపోతుందా అన్న ఆశ దాదాపు అందరిలోనూ కనిపిస్తోంది. అయితే ఈ విషయంలో నిర్ణయాత్మకమైన వ్యక్తి, స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన పువ్వాడ అజయ్‌కుమార్‌ మనసులో ఏముందన్న దానిపై ఎవరికీ స్పష్టత లేదు. ఆయన మాత్రం నామినేషన్ల ప్రక్రియ సాగుతున్న సమయంలో తన సతీమణి వసంతలక్ష్మి పోటీలో లేరని ప్రకటించిన సందర్భంలో.. గెలుపొందిన వారితో సమావేశం అయిన అనంతరం సీఎం కేసీఆర్‌ నిర్ణయం మేరకు పార్టీ అధిష్టానం పంపే సీల్డ్‌ కవర్‌లో ఏ పేరుంటే వారే మేయర్‌ అని క్లారిటీ ఇచ్చారు. మరి ఆ సీల్డ్‌ కవర్‌లో పేరు రాసే క్రమంలో సీఎం కేసీఆర్‌ తీసుకునే నిర్ణయాన్ని ఎవరు ప్రభావితం చేస్తారన్న దానిపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

  మొత్తం ఎన్నికలను తన భుజాలపై వేసుకుని, పార్టీ విజయానికి కృషిచేసిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుంటారన్న చర్చ సాగుతోంది. అదే క్రమంలో గత కౌన్సిల్‌లో మేయర్‌ ఎన్నికలోనూ సీఎం కేసీఆర్‌ తానే సొంతంగా నిర్ణయం తీసుకున్నారన్న విషయాన్ని పార్టీలో సీనియర్ల గుర్తు చేస్తున్నారు.

  2016లో జరిగిన కార్పోరేషన్‌ తొలి ఎన్నికల్లో తెరాస గెలవడం.. మేయర్‌ పదవి ఎస్టీ జనరల్‌కు రిజర్వు కావడంతో.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో తనకు చికిత్స చేసిన వైద్యుడు అయిన డాక్టర్‌ పాపాలాల్‌ను సీఎం కేసీఆర్‌ మేయర్‌గా ఎంపిక చేశారు. అప్పట్లో మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అభిప్రాయాన్ని సీఎం కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకున్నారా లేదా అన్నది ఎవరికీ తెలీదు. అయితే తాజాగా జరిగిన ఎన్నికల్లో రెండోసారి మంచి మెజారిటీతో తెరాస గెలుపొందడం.. కార్పోరేషన్‌ మేయర్‌ పదవి జనరల్‌ మహిళకు రిజర్వు కావడం.. ఎంతో మందిలో ఆశలు రేపింది.

  దీంతో మేయర్‌ ఎంపికలో సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని నిర్ణయం తీసుకుంటారా.. లేక ఇంకేదైనా ఫార్ములాను అమలు చేస్తారా అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు. మంత్రికి సంబంధించిన కమ్మ సామాజికవర్గం నుంచి భారీగా పోటీ ఉండగా.. ఇక బీసీలలో ప్రధానమైన కులాలైన మున్నూరుకాపు, ముదిరాజ్‌, యాదవ్‌లు ఉన్నారు. లేకుంటే మంత్రి తనకు ప్రతి ఎన్నికల్లోనూ అండగా నిలుస్తున్న ముస్లిం మైనారిటీలను ఆదరిస్తారా అన్న కోణంలోనూ చర్చ నడుస్తోంది.

  పార్టీకి అందించిన సేవలకు గుర్తింపు లభిస్తుందా..? లేక సామాజిక వర్గం పరిగణనలోకి తీసుకుంటారా..? బీసీలకు దగ్గర చేసుకుంటారా..? లేక ముస్లిం మైనారిటీలను ఆదరిస్తారా అన్న విషయాలపై పలు రకాలుగా చర్చలు సాగుతున్నాయి.

  ఒకవేళ సామాజికవర్గమే పరిగణనలోకి తీసుకుంటే మంత్రికి పువ్వాడ అజయ్‌కుమార్‌ సామాజికవర్గంలోనూ పోటీ తీవ్రంగా ఉంది. ఒకవేళ ఆయనకు ఆప్షన్‌ ఉంటే విధేయతకు పట్టం కడతారన్న చర్చ కూడా నడుస్తోంది. బీసీల నుంచి ఇప్పటికే సుడా ఛైర్మన్‌, డీసీసీబీ ఛైర్మన్‌ పదవులను మంత్రి పువ్వాడ అజయ్‌ మాట ప్రకారమే ఇచ్చారు .. కనుక ఈసారి మంత్రికి దగ్గరగా ఉండే వారికి మేయర్‌ పదవి లభించే అవకాశం కనిపిస్తోంది. వీరిలో పొనుకొల్లు నీరజ (26వ డివిజన్‌ కార్పోరేటర్‌), పైడిపల్లి రోహిణి (56 వ డివిజన్‌ కార్పోరేటర్‌). వీరిద్దరూ మంత్రి అజయ్‌కుమార్‌ కుటుంబానికి విధేయులుగా, విశ్వసనీయులుగా ఉన్నట్టు చెబుతున్నారు. వీరిద్దరూ రేసులో ముందు వరుసలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇంకా రేసులో ఉన్న బిక్కసాని ప్రశాంతిలక్ష్మి (20 వ డివిజన్‌ కార్పోరేటర్‌) భర్త బిక్కసాని జశ్వంత్‌ మంత్రి అజయ్‌కుమార్‌కు విధేయుడు కావడంతో అవకాశం ఉన్నట్టు చెబుతున్నారు. బిక్కసాని కుటుంబానికి అటు మాజీ మంత్రి తుమ్మలతోనూ మంచి సంబంధాలు ఉండడం కలసి వచ్చే అంశంగా చెబుతున్నారు.

  ఇంకా 10వ డివిజన్‌ నుంచి ఏకగ్రీవం అయిన చావా మాధురికి కూడా ఛాన్స్‌ ఉండొచ్చంటున్నారు. ఈమె భర్త నారాయణరావు గతంలో కార్పోరేటర్‌గా చేసి ఉండడం, అప్పట్లో నారాయణరావుకు డిఫ్యూటీ మేయర్‌ పదవి ఇవ్వలేకపోవడంతో.. ఈసారి ఛాన్స్‌ ఉండొచ్చంటున్నారు. వీరితో బాటు మంత్రి అజయ్‌కుమార్‌ కుటుంబానికి సుదీర్ఘకాలంగా సంబంధాలున్న 18వ డివిజన్‌ కార్పోరేటర్‌ మందడపు లక్ష్మిమనోహర్‌కు అవకాశం రావొచ్చంటున్నారు. వీరే కాకుండా 15వ డివిజన్‌ కార్పోరేటర్‌ రావూరి కరుణసైదుబాబు, సరిపూడి రమాదేవి (11), చిరుమామిళ్ల లక్ష్మి (12) కొత్తపల్లి నీరజ (13), పాలెపు విజయ (44)లు సైతం సామాజికకోణంలో గట్టిగా మేయర్‌ పదవిని ఆశిస్తున్నారు. ఒకవేళ వేరే సామాజిక వర్గాలకు ఛాన్స్‌ ఇవ్వాల్సి వస్తే విధేయతను ప్రాతిపదికగా తీసుకుంటే 21 వ డివిజన్‌ నుంచి గెలిచిన ఆళ్ల నిరీషకు ఛాన్స్‌ ఉండొచ్చంటున్నారు.

  దశాబ్దాలుగా వామపక్ష రాజకీయ నేపథ్యం ఉన్న నిరీష కుటుంబం గత ఎన్నికల సమయంలో తెరాసలో చేరింది. నాలుగు డివిజన్లలో విస్త్రుతమైన ప్రజా సంబంధాలు ఉన్న నిరీష కుటుంబం సైతం మేయర్‌ పదవి ఇస్తారని ఆశిస్తోంది. మరోవైపు మంత్రికి సన్నిహితంగా ఉండే పగడాల నాగరాజు తన డివిజన్‌ రిజర్వేషన్‌ బీసీ మహిళ కావడం.. తన భార్య శ్రీవిద్య ఓసీ జనరల్‌ కావడంతో ఆమెకు మరోచోట టికెట్‌ ఇప్పించుకుని విజయం సాధించారు. ఆమెకు మేయర్‌ పదవి ఇస్తే ఇటు ఓసీ, అటు బీసీ రెండు సామాజికవర్గాలను బ్యాలెన్స్‌ చేసినట్లవుతుందన్న కోణంలోనూ పదవిని ఆశిస్తున్నారు.

  ఒకవేళ బీసీలకు ఛాన్స్‌ ఇవ్వాల్సి వస్తే .. మున్నూరుకాపు కోటాలో సీనియర్‌ కార్పోరేటర్‌ శీలంశెట్టి రమవీరభద్రం(51), మాటేటి అరుణనాగేశ్వరరావు (47), తోట గోవిందమ్మ రామారావు (48)లు మేయర్‌ పదవిని ఆశిస్తున్నారు. ఇంకా ముదిరాజ్‌ కోటాలో ఉన్న మహిళా కార్పోరేటర్‌ దోరేపల్లి శ్వేత (58) సైతం పదవిని ఆశిస్తున్నారు.

  వీరికితోడు ముస్లిం మైనారిటీలు సైతం తమకు ఓ ఛాన్స్‌ ఇవ్వాలని మంత్రిని కోరుతున్నారు. ఇలా మొత్తం 29 మంది తెరాస మహిళా కార్పోరేటర్లు మేయర్‌ సీటు కోసం తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మంత్రి అజయ్‌కుమార్‌ కోవిడ్‌ పాజిటివ్‌తో హోం క్వారైంటైన్‌ కావడంతో ఆయనకు అందరూ మెసేజ్‌ల ద్వారా తమ విన్నపాలను పంపుతున్నట్టు సమాచారం. మరి ఈ విషయంలో మంత్రి అజయ్‌కుమార్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదానిపై ఉత్కంఠ నెలకొంది.
  Published by:yveerash yveerash
  First published: