WHILE CM KCR AT DELHI THE CENTRE YET TO CLEAR TELANGANA BORROWINGS IT IS LEARNT THAT HOSPITALS COULD BE MORTGAGED MKS
CM KCR | Centre : తెలంగాణ అప్పులపై తగ్గని కేంద్రం.. ఆర్థిక సంకటం.. ఆస్పత్రుల తాకట్టు?
మోదీ, కేసీఆర్ (పాత ఫొటోలు)
తెలంగాణ అప్పుల విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుండటంతో ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారింది. అప్పులు అందనిదే ప్రాజెక్టులు, పథకాలు కొనసాగలేని, ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని స్థితి నెలకొందని, ఆస్పత్రుల తాకట్టు వ్యవహారాలు కూడా సాగుతున్నాయని వార్తలు వస్తున్నాయి..
ఓవైపు కేంద్రం పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల అమ్మకం, రుణాల ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నా, తెలంగాణ అప్పుల విషయంలో మాత్రం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుండటంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి సంక్లిష్టంగా మారింది. పేరుకు ధనిక రాష్ట్రమే అయినా అప్పులు అందనిదే ప్రాజెక్టులు, పథకాలు కొనసాగలేని, కనీసం ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిణామాలకు దారి తీసింది. మరోవైపు, ఆస్పత్రుల తాకట్టు వ్యవహారాలు కూడా సాగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ అజెండా సెట్ చేస్తానంటూ సీఎం కేసీఆర్ స్వయంగా ఢిల్లీలో మకాం వేసినా.. కేంద్రం నుంచి రుణ సమీకరణకు అంగీకార పత్రం (కాన్సంట్) పొందడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడంలేదు. కొత్త అప్పులు లభించకుంటే ఉద్యోగులకు జూన్ వేతం 50 శాతం చెల్లించాలని భావిస్తోన్న కేసీఆర్ సర్కారు.. నిధుల సమీకరణకు ఆస్పత్రులను సైతం తాకట్టుపెట్టాలని యోచిస్తున్నట్లు తాజాగా వెల్లడైంది. అయితే అప్పుల వ్యవహారం, జీతాల కోత, ఆస్పత్రుల తాకట్టు వంటి అంశాలపై ప్రభుత్వం ఇప్పటిదాకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
తెలంగాణ ప్రభుత్వం పరిమితికి మించి అప్పు చేసిందంటూ, కొత్త రుణాలు పొందడానికి వీల్లేదంటూ కేంద్ర ఆరోర్థిక శాఖ తెలంగాణపై ఆంక్షలు విధించడం తెలిసిందే. కనీసం ప్రభుత్వ బాండ్లను అమ్ముకునేందుకైనా అవకాశం ఇవ్వకపోవడంతో రాష్ట్ర సర్కారు రోజువారీ రెవెన్యూ ఖర్చులు, ప్రాజెక్టులు, పథకాలకు నిధుల ఎద్దడి ఏర్పడింది. జూన్ నాటికి ఉద్యోగులకు పూర్తి స్థాయిలో వేతనాలు అందుతాయా? అనేదీ అనుమానంగా మారింది. ఈ సంక్లిష్ట దశలో.. రుణ సమీకరణకు సంబంధించి తలెత్తిన వివాదంపై కేంద్రంతో చర్చించి పరిష్కరించే బాధ్యతను రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుపై పెట్టారు సీఎం కేసీఆర్.
సీఎం ఆదేశాల మేరకు గురువారమే ఢిల్లీకి చేరుకున్న రామకృష్ణారావు.. అదేరోజు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సోమనాథన్ను కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదని తెలిసింది. శుక్ర, శనివారాల్లోనూ ఆశించిన ఫలితాలు రాలేదని సమాచారం. నిబంధనల మేరకు మార్కెట్ నుంచి అప్పు తీసుకోవడానికి కేంద్రం అనుమతి తప్పనిసరి కాగా రాష్ట్రం పరిస్థితి జఠిలంగా మారింది. కేంద్రం తీరుపై మొదట్లో దుమ్మెత్తిపోసిన కేసీఆర్ సర్కారు.. ఒక దశలో న్యాయపోరాటం దిశగానూ ఆలోచనలు చేసింది. కానీ వ్యవహారం రోజురోజుకూ ముదురుతుండటంతో సామరస్యంగానే పరిష్కరించుకునే దిశగా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. కానీ తెలంగాణ చేస్తోన్న ప్రయత్నాలేవీ ప్రస్తుతానికి ఫలించినట్లు కనిపించడంలేదు.
ఇప్పటికే రూ.2.84 లక్షల కోట్ల దాకా అప్పులు చేసిన తెలంగాణ.. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.59 వేల కోట్లు అప్పుల రూపేణా తీసుకోవాలని బడ్జెట్లో ప్రతిపాదించింది. ఆర్బీఐ నుంచి రూ.10 వేల కోట్లను సెక్యూరిటీస్ వేలం రూపంలో సమీకరించాలన్న రాష్ట్రప్రభుత్వ నిర్ణయానికి ఇప్పటికే కేంద్రం బ్రేకులు వేసింది. తీసుకున్న అప్పులన్నీ ఎఫ్ఆర్బీఎం పరిమితిని దాటేశాయని, ఇకమీదట రుణాలు తీసుకోవడానికి వీల్లేదని కేంద్రం స్పష్టంచేసింది. కేంద్రం నిర్ణయం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభావం పడింది. బ్యాంకులే కాదు...రుణ సంస్థలేవీ రాష్ట్రానికి రుణాలు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. దీంతో ప్రాజెక్టులు, పథకాలకు నిధుల ఎద్దడి ఏర్పడింది. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ సంస్థలు ఏప్రిల్ 1 నుంచి తెలంగాణకు ఒక్కరూపాయి కూడా విడుదల చేయలేదు.
ఇదిలా ఉంటే, నూతనంగా చేపట్టిన పనులను నిధులు లేని పరిస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఆస్పత్రులను తాకట్టుపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సీఎం కేసీఆర్ ఇటీవలే అట్టహాసంగా ఒకే రోజు శంకుస్థాపనలు చేసిన 'టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ' ఆసుపత్రులను తాకట్టు పెట్టేందుకు సర్కార్ రెడీ అయిందని, వరంగల్ హెల్త్ సిటీ కూడా ఈ జాబితాలోకి చేరిందని, కట్టకముందే సదరు ఆస్పత్రులు తాకట్టులోకి వెళ్లిపోతున్నాయంటూ వార్తలు వెలువడుతున్నాయి.
ఆస్పత్రుల నిర్మాణానికి సర్కారు వద్ద డబ్బులు లేనందున.. బ్యాంకు కన్సార్టియం ద్వారా ఆసుపత్రులనే షూరిటీగా పెట్టి రుణాలు పొందనున్నట్లు తెలుస్తోంది. అయితే లీగల్ చిక్కులు ఎదురుకాకుండా టిమ్స్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హెల్త్ కార్పొరేషన్ పేరిట మొత్తం రూ.15వేల కోట్ల రుణాల సేకరణ వ్యవహారం జరుగుతున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి వివరణ లేదా ఖండన వెలువడాల్సి ఉంది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.