( Srinivasreddy News 18, Telugu, Khammam )
కొత్తగూడెం శాసనసభ్యుడు వనమా వెంకటేశ్వరరావు కుమారుడు, తెరాస నేత రాఘవేంద్ర రావు వివాదాలకు కేంద్రంగా మారాడు. ఇప్పటికే అనేక కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటుండగా... తాజాగా పాల్వంచ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయంగా మారింది. పాల్వంచ గ్రామీణం, పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటి వరకు ఆయనపై మొత్తం 6 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. పలువురి ఆత్మహత్యలకు సంబంధించి రాఘవేంద్రరావు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
జ్యోతి అనే గిరిజన మహిళకు చెందిన స్థలవివాదంలో రాఘవేంద్రరావు అనుచరులు ఆమెపై భౌతికదాడికి పాల్పడ్డారు. ఎస్టీ మహిళపై హత్యాయత్నం విషయంలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొనగా... ఈ కేసు ఎస్సీ, ఎస్టీ కమిషన్ వరకు వెళ్లటం గతంలో సంచలనం రేపింది. పాల్వంచకు చెందిన ఫైనాన్స్ వ్యాపారి వెంకటేశ్వర్లు ఆత్మహత్య కేసులో రాఘవేంద్రరావు ఏ-1 ఆరోపణలు ఎదుర్కొన్నారు. దాదాపు 20 రోజుల పాటు అజ్ఞాతంలోకి వెళ్లి, హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ దాఖలు చేసి మళ్లీ కేసు నుంచి బయటపడ్డారు. ఇవే కాకుండా నియోజకవర్గాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తారన్న విమర్శలు ఆది నుంచీ ఎదుర్కొంటున్నారు. పార్టీని, అధికార యంత్రాంగాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తారని ఆరోపణలున్నాయి. వ్యక్తిగత పంచాయతీల నుంచి భూవివాదాలు, సెటిల్మెంట్లలో రాఘవ జోక్యంతో అనేక వివాదస్పద ఘటనలు వెలుగులోకి వచ్చాయి.
Sangareddy Accident : రోడ్లపై రక్తం చిందింది.. ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి..ఎక్కడంటే..
తాజాగా పాల్వంచలో నాగ రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య కేసులోనూ రాఘవ ఏ-2గా ఉండటం అటు రాజకీయంగానూ దుమారం చెలరేగుతోంది. నిందితుడిని వెంటనే అరెస్టు చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాఘవేంద్రరావు అరాచకాలకు పోలీసులు పట్టించుకోనందునే ఇప్పుడొక కుటుంబం ప్రాణాలు తీసుకుందని సీఎల్పీ నేత భట్టి మండిపడ్డారు. ఎంతో మంది ఆత్మహత్యలకు కారకుడైన రాఘవను కఠినంగా శిక్షించాలని భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య డిమాండ్ చేశారు.
Telangana RTC : ఆర్టీసీ ప్రయాణికులకు మరో శుభవార్త.. జిల్లా బస్సుల్లో మరో వెసులుబాటు
మరోవైపు... రామకృష్ణ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవేంద్రరావు చుట్టూ ఉచ్చు బిగిస్తున్నట్లే కనిపిస్తోంది. ఈ కేసులో చర్యలను వేగవంతం చేస్తున్న పోలీసులు... ఇప్పటికే బాధితుడి సెల్ఫీవీడియో, కుటుంబ సభ్యుల నుంచి ఆధారాలు సేకరించి కోర్టుకు అందజేశారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కుమారుడు అయినా... పోలీసులు ఎక్కడా తగ్గకుండా దర్యాప్తు సాగిస్తున్నారు. పరారీలో ఉన్న రాఘవ కోసం ప్రత్యేక బృందాలు రంగంలోగి దిగాయి.ఇక అధికార పార్టీ నేతపై కేసు నమోదు, ఆయన చుట్టూ బిగిస్తున్న ఉచ్చుతో తెరాసలో చర్చకు దారితీస్తోంది. జిల్లా రాజకీయ పరిణామాలను పార్టీ స్థానిక నేతలు... ఎప్పటికప్పుడు అధినాయకత్వానికి తెలియజేస్తున్నారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన మరో కుమార్తె కూడా ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Family suicide, Khammam