దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు (TRS MLAs Poaching Case) లో రోజురోజుకు కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజిలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఈ ఘటనకు సంబంధించి ఆడియో, వీడియోలను సీఎం కేసీఆర్ బయటపెట్టి మరో సంచలనానికి తెర లేపారు. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ పట్టుబట్టింది. కానీ ఈ కేసును దర్యాప్తు చేయడానికి ప్రభుత్వం హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తో కూడిన సిట్ (Special Investigation Team) ను ఏర్పాటు చేసింది. ఈ సిట్ ఏపీ, తెలంగాణతో పాటు కేరళ, కర్ణాటక, హర్యానా రాష్ట్రాల్లో సోదాలు చేసింది. ఈ సోదాల్లో కీలక సమాచారం రాబట్టిన సిట్ మరికొందరికి నోటీసులు ఇచ్చింది. అందులో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్, నిందితుల్లో ఒకరైన నందకుమార్ భార్య చిత్రలేఖ, అంబర్ పేట లాయర్ ప్రతాప్ గౌడ్ ఉన్నారు.
BL సంతోష్ కు రెండుసార్లు నోటీసులు..
ఈ కేసులో BL సంతోష్ ను విచారిస్తే కీలక విషయాలు వస్తాయని సిట్ (Special Investigation Team) భావించింది. అందులో భాగంగా ఈనెల 16న సంతోష్ కార్యాలయానికి నోటీసులు పంపింది. కానీ సంతోష్ ఆ సమయానికి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. దీనిపై సిట్ (Special Investigation Team) హైకోర్టును ఆశ్రయించగా కీలక ఆదేశాలు ఇచ్చింది. BL సంతోష్ కు మరోసారి నోటీసులు ఇవ్వాలని వాటిని ఈ-మెయిల్ ద్వారా పంపించాలని పేర్కొంది. ఈ మేరకు సిట్ అధికారులు మెయిల్ ద్వారా BL సంతోష్ కు నోటీసులు పంపించారు. ఈనెల 26న లేదా 28న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. దీనిపై BL సంతోష్ క్వాష్ పిటీషన్ వేశారు. FIR లో తన పేరు లేనప్పుడు తనకు నోటీసులు ఎలా ఇస్తారని సంతోష్ తరపు లాయర్ వాదించాడు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు సిట్ నోటీసులపై స్టే ఇచ్చింది. దీనితో BL సంతోష్ కు ఊరట కలిగింది. మరి నెక్స్ట్ సిట్ ఏం చేయబోతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సిట్ ఏం చేయబోతుంది?
అయితే BL సంతోష్ ను ఎలాగైనా విచారించాలని సిట్ (Special Investigation Team) భావిస్తుంది. అందుకోసం సంతోష్ కు మళ్లీ నోటీసులు ఇవ్వాలని చూస్తుంది. కానీ ప్రస్తుత నోటిసులపై స్టే ఉండడంతో కొత్తగా నోటీసులు ఇవ్వొచ్చా అనేది న్యాయపరంగా అడిగి తెలుసుకోవాలి. ఒకవేళ నోటీసులు ఇవ్వలేమని చెబితే హైకోర్టులో తదుపరి విచారణ డిసెంబర్ 5న ఉంది కాబట్టి అప్పటివరకు ఆగాల్సి ఉంటుంది. మరి దీనిపై సిట్ సంతోష్ కు మళ్లీ నోటీసులు ఇస్తుందా? లేక హైకోర్టు తదుపరి విచారణ వరకు వెయిట్ చేస్తుందా అనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Telangana, Telangana News, Trs, TRS MLAs Poaching Case